ప్రేమ మహోన్నతమైనది. అది దేనికీ తలవంచదు. దేనికీ భయపడదు. ఎన్ని కక్షలు, పగలు అడ్డువచ్చినా ధైర్యంగా ఎదుర్కొనే సత్తా దానికి ఉంటుంది. తరతరాల నుంచి పునాదులు వేసుకున్న ఈర్ష్యాద్వేషాల్ని కూడా చల్లని కరుణగా మార్చేయగల మహిమ ప్రేమకుంది. కులమతాల అడ్డుగోడలు కూడా ప్రేమను ఆపలేవని నిరూపించి, పెళ్ళి చేసుకున్న ప్రేమికుల జంటను గురించి, వారి పెళ్ళి వేడుకను గురించి వివరిస్తూ సామవేదం షణ్ముఖశర్మ ఒక పాట రాశారు. 1997 లో భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వంలో వచ్చిన ‘శుభాకాంక్షలు’ సినిమాలోని ఆ పాటనిపుడు పరిశీలిద్దాం..
సామవేదం షణ్ముఖశర్మ సినీగీత రయితగా అపురూపమైన ఆణిముత్యాల్లాంటి పాటలు రాశారు. తక్కువ పాటలే రాసినా చిరకాలం నిలిచిపోయే పాటలు అవి. సినీరంగం నుంచి ఆయన ఆధ్యాత్మిక రంగానికి వెళ్ళిపోయారు. మేలైన మధురగీతాలను మనకు కానుకలుగా అందించారు. శుభాకాంక్షలు సినిమాలో ఆయన రాసిన ప్రేమపాట చాలా ప్రత్యేకమైనది.
ఎంతో ఆత్మీయంగా కలిసి ఉన్న రెండు కుటుంబాలు ఒక తరంలో ప్రేమ మూలంగానే విడిపోతాయి. మళ్ళీ తరువాతి తరంలో ప్రేమ మూలంగానే కలుసుకోవడం జరుగుతుంది. విడిపోయిన వారి బంధుత్వాలను ఇద్దరు ప్రేమికులజంట కలుపుతుంది. వారు ఒక్కటై వారి రెండు కుటుంబాలను ఒక్కటి చేస్తారు. ఇలా ప్రేమికుల జంటను కలపడానికి హీరో సహాయం చేస్తాడు. అతడే సూత్రధారియై ఆ రెండు కుటుంబాలను కలిపి, వారిద్దరికీ పెళ్ళి చేసి ఈ పాటను పాడతాడు.
అసలు విషయమేమిటంటే.. ఇక్కడ పెళ్ళి జరుగుతున్న ప్రేమికుల జంటలోని అమ్మాయి హీరో ప్రేమించిన అమ్మాయి. వారిద్దరికి మొదటి నుంచే స్నేహం ఉంది. హీరో ఆమెని ప్రేమించడం మొదలుపెడతాడు. కాని ఆమె మాత్రం అతన్ని స్నేహితునిగానే చూస్తుంది. ఆ అమ్మాయి తన ప్రేమను గెలవడానికి సహాయం చేయమని హీరోని అడగగానే హీరో తనలోని ప్రేమను లోలోనే చంపుకుని వాళ్ళిద్దరినీ కలుపుతాడు. ఇదీ ఇక్కడి సందర్భం..
తన ప్రేమను మనసులోనే దాచుకుని, లోలోపల కుమిలిపోతూనే పైకి మాత్రం ఆనందంగా ఉందని పాడుతుంటాడు. మనసులో నిరాశ ఉన్నా, పైకి మాత్రం ఆశలపూలు పూస్తూనే ఉన్నాయంటున్నాడు. మాటలు చాలని, హాయినే పాటగా మార్చి పాడుతున్నానంటున్నాడు. నిజానికి ఆనందంతో మాటలు రాని సమయం కాదిది. బాధతో మాటలు రాని సమయమిది. తన బాధను కనబడనివ్వకుండా కన్నీటిబాష్పాలనే ఆనందబాష్పాలుగా రాలుస్తున్నాడు. కాలం తనకు అన్యాయం చేసినా, కొత్తగా పెళ్ళైన జంట కోసం కాలమే పూలదారిలో సాగాలని, ఆనందంతో గానమే గాలిలాగా తాకాలని, ఈ స్వరం తనదిగా ఈక్షణం పరవశంతో పలికిందని చెబుతున్నాడు..
హీరో తన ప్రేమలో ఓడిపోయాడు. కారణం.. తను ప్రేమించిన అమ్మాయి తనను ప్రేమించకపోవడం వల్ల. అందుకు మరో కారణం.. ఆ అమ్మాయి వేరే అబ్బాయిని ప్రేమించడం. అయినా అతడు నిండు మనసుతో తన ప్రేమ గెలవకపోయినా తన ప్రియురాలి ప్రేమ గెలవాలని కోరుకుంటున్నాడు. అందుకే ప్రేమ విలువ తెలిసినవాడు కాబట్టి చరణంలో.. ప్రేమలో గెలిచిన ఆ జంట గొప్పతనాన్ని, ధైర్యాన్ని గురించి ఇలా ప్రశంసిస్తున్నాడు.
పొగల మంచు తెరలు ఎన్ని అడ్డు వచ్చినా ఉదయం ఆగిపోనట్టుగానే మీ కుటుంబ కలహాలు ఎన్ని ఉన్నా మీరు అవేవీ లెక్క చేయకుండా ప్రేమను గెలుచుకున్నారు. కక్ష కంచె వేసినా మీరు మీ ప్రేమను వదులుకోలేదు. ప్రేమ విలువను చాటిన మీ చక్కని బంధం నూరేళ్ళ వరమవ్వాలి. కలకాలం ఇలాగే కొనసాగాలి. ఆ ఆకాశం, ఈ నేల, ఈ గాలి.. పంచభూతాలు సైతం మీ ప్రేమను, మీ జంటను చూసి శుభమస్తు అంటూ దీవించాలని అంటున్నాడు. ‘ప్రేమయేవ జయతే…’ ప్రేమయే గెలుస్తుందని మంగళ వాయిద్యం పలికిందంటున్నాడు.
ఇన్నినాళ్ళుగా కలవలేని కుటుంబాలని ఇకనైనా కలిపి తీరాలి.. ఈ రెండు కుటుంబాలను కలుపుతూ, ఈ పెళ్ళి జరిపిస్తూ, వీరి ప్రేమకు సాక్షిలాగ నేనుంటూ జ్ఞాపకంగా నిలవాలని కోరుకుంటున్నానంటున్నాడు. తన ప్రేమ గెలవకపోయినా తను ఓ జంటను కలిపిన పెద్దదిక్కునయ్యానని సంతృప్తి చెందుతున్న విషయాన్ని స్పష్టం చేస్తున్నాడు. తన ప్రేమ మాత్రం ఎప్పటికీ తన ప్రియురాలికి తెలియకుండానే మిగిలిపోయింది. రెప్పల్లో కలలై దాగిపోయిందంటున్నాడు. అలా దాగిపోయిన ప్రేమ ఈ క్షణంలో కన్నీటిరూపంలో అక్షింతలుగా కురిసి దీవెనలందిస్తుంది. ఎల్లప్పుడు మీరు సంతోషంగా ఉండాలని కోరుకుంటూ శుభాకాంక్షలు అందిస్తుందంటున్నాడు.
ప్రేమ ఎప్పటికీ గెలిచి తీరుందని తెలియజేస్తుందీపాట.. ప్రేమను ఎవ్వరూ అడ్డుకోలేరని, ఎవ్వరూ ఆపలేరని తెలుపుతుందీపాట..
పాట:
ఆనందమానందమాయె మది ఆశల నందనమాయె/
మాటలు చాలని హాయే ఒక పాటగ మారిన మాయే/
కాలమే పూలదారి సాగనీ/ గానమే గాలిలాగ తాకనీ/
ఈ స్వరం నాదిగా ఈ క్షణం పలికినది/
పొగల మంచు తెరలున్నా పొద్దు పొడుపు ఆగదనీ/
కక్ష కంచె వేస్తున్నా ప్రేమ గెలిచి తీరుననీ/
చాటే మీ చక్కని బంధం నూరేళ్ళ వరమవ్వాలి/
ఆ నింగీ నేలా గాలీ శుభమస్తని దీవించాలి/
ప్రేమయేవ జయతే అంటూ పలికే మంగళవాద్యమే/
కలవలేని తీరాలే కలిపి కదిలి తీరాలి/
సాక్షి గానే నేనుంటూ జ్ఞాపకంగ నిలవాలి/
ఎప్పటికీ చెప్పక మిగిలే రెప్పల్లో దాగిన కలలే/
అక్షింతలుగా ఇటు కురిసీ దీవించే చల్లని క్షణమే/
శుభాకాంక్షలే పలకాలి మీ సంతోషం కోరుతూ..
– డా||తిరునగరి శరత్‌చంద్ర,
[email protected]
సినీ గేయరచయిత, 6309873682