శ్వేతా మంత్రి… ఓ హాస్య నటి. ఓ వికలాంగురాలిగా తనలాంటి వారు ఎదుర్కొనే సమసయల గురించి పూర్తి అవగాహనతో ఉన్నారు. అవసరమైన మౌలిక సదుపాయాలు లేక వికలాంగులు సమాజంలో వెనకబడి పోవడం గురించి ఆవేదన చెందుతున్నారు. అందుకే వైకల్యంపై ప్రజలకున్న అపోహల గురించి అవగాహన కల్పించేందుకు నడుం బిగించారు. దానికోసం స్టాండ్ అప్ కామెడీని ఆయుధంగా మలుచుకున్న ఆమె పరిచయం నేటి మానవిలో….
శ్వేతా జీవితంలోకి కామెడీ ఊహించని విధంగా ప్రవేశించింది. 2014లో ఆమె వికలాంగులు ఎదుర్కొంటున్న సవాళ్లపై ఓ చలనచిత్రాన్ని రూపొందించారు. ఇందులో ఆమె అనేక సమస్యల గురించి తెలియజేశారు. అయితే కంటెంట్ ప్రేక్షకులకు అంతగా నచ్చలేదు. దాంతో ఆమెకు ఎదురుదెబ్బ తగిలింది. వికలాంగులకు అనేక సదుపాయాలు అందుబాటులో ఉన్నప్పటికీ ఇలాంటి సినిమా ఎందుకు తీయాల్సి వచ్చిందని ప్రజలు ఆమెను ప్రశ్నించారు. వైకల్యాల పట్ల ప్రజలకున్న అవగాహన గురించి ఈ అనుభవం ఆమెకు నేర్పింది. అప్పటి నుండి వైకల్య అవగాహన కార్యక్రమాల్లో చురుకుగ్గా పని చేయడం మొదలుపెట్టారు. వికలాంగుల కోసం ఇతర మార్గాలు వెతకడం ప్రారంభించారు. అప్పుడే ఆమె స్టాండ్-అప్ కామెడీ సరైన మాధ్యమం అనే నిర్ణయానికి వచ్చారు. వైకల్యాల గురించి ప్రజలకు అవగాహన కల్పించాలనే కోరిక, కళారూపంపై ఆమెకున్న ఆసక్తి… ఈ రెండింటినీ కలపడానికి దారితీసింది. ‘స్టాండ్-అప్‌లో ప్రేక్షకుల నుండి స్పందన తక్షణమే ఉంటుంది. నాకు కామెడీ అనేది వైకల్యం గురించి అవగాహన పెంచడం మాత్రమే కాదు. అది నా శక్తిని తిరిగి పొందడం కూడా’ అని ఆమె పంచుకున్నారు.
వాష్‌రూంకు వెళ్లడమే కష్టమయ్యేది
శ్వేత పుట్టడమే వెన్నెముక సమస్య అయిన స్పైనా బిఫిడాతో జన్మించారు. దీనివల్ల ఆమె ఎడమ కాలు పనిచేయలేదు. ఫిజియోథెరపీతో కొంత కదలిక వచ్చింది. ఏడేండ్ల వయసు వరకు ఇతరుల సహాయంతో ఆమె పాఠశాలకు వెళ్లారు. ఆ తర్వాత క్రచెస్, లెగ్ బ్రేస్‌లను ఉపయోగించారు. కదలిక అనేది ఆమె ఇప్పటికీ ఎదుర్కొంటున్న సమస్య. గతంలో ఆమె కాలు నొప్పి లేకుండా 5 నుండి 7 నిమిషాలు నిలబడగలిగేవారు. ఇప్పుడు కేవలం నిమిషం మాత్రమే నిలబడగలరు. వాష్‌రూమ్‌కు తరచుగా వెళ్లాల్సి వచ్చేది. సరైన మౌలిక సదుపాయాలు లేకపోవడంతో ఈ సవాళ్లు ఆమెకు రోజురోజుకు పెరిగిపోయాయి. కాలేజీలో ఎలక్ట్రిక్ వీల్ చైర్ ఇచ్చారు. అయితే చాలా చోట్ల ర్యాంప్‌లు లేకపోవడంతో ఆ ప్రాంతాలు ఉపయోగించుకోలేకపోయే వారని ఆమె గుర్తుచేసుకున్నారు. నేటికీ పరిస్థితి పెద్దగా మెరుగుపడలేదు. వాష్‌రూమ్‌లు పని చేయకపోయినా, ఫ్లోరింగ్ నడవడానికి సౌకర్యంగా లేకపోయినా ఆమె ఈవెంట్లను దాటవేస్తున్నారు.
సానుభూతి చూపేవారు
కామెడీ క్లబ్లో జారే నిగనిగలాడే ఫ్లోరింగ్ ఉండేదని ఆమె గుర్తు చేసుకున్నారు. ‘నాకు దానిపై నడవడం అసాధ్యం. వాష్‌రూమ్‌కు వెళ్లడం కూడా పెద్ద సమస్యగా మారింది. ప్రతిసారీ సహాయం కోసం అడగవలసి వచ్చేది. ఇది నా పనితీరుపై కూడా ప్రభావం చూపింది’ అని ఆమె చెప్పారు. వైకల్యంతో జీవించడానికి రోజువారీ జీవితంలో ప్రణాళిక అవసరం. వేదిక పై అంతస్తులో ఉంటే, అక్కడ ఎలివేటర్ లేనట్లయితే ఆమె ముందుగానే ప్లాన్ చేసుకోవాలి. స్టేజిపైకి వెళ్లే మెట్లు చాలా ఎత్తుగా ఉంటే ఆమె వేదిక కిందే ప్రదర్శన ఇవ్వాలి. తన చిన్నతనంలో ప్రజలు ఆమెను భిన్నంగా చూసేవారని కూడా గుర్తు చేసుకున్నారు. ‘ఇది చాలా దురదృష్టకరం’ అంూ ప్రజలు సానుభూతి చూపేవారు. బంధువులు నా భవిష్యత్తు, కెరీర్, వివాహం గురించి మాట్లాడేవారు. నాకు పూర్తి అవగాహన లేనప్పుడే ఈ విషయాలన్నీ నేను వినాల్సి వచ్చింది. కానీ అవి ఇప్పటికీ నాపై శాశ్వత ప్రభావాన్ని మిగిల్చాయి’ అంటూ ఆమె పంచుకున్నారు.
అర్హులు కాదని…
ఆమె కామెడీ ఓ సాధనంగా ప్రారంభమై ఉండవచ్చు. కానీ ఇప్పుడు హాస్యంలోని సూక్ష్మ నైపుణ్యాలను నేర్చుకుంటున్నట్లు చెబుతున్నార. ఎదుగుదల, అభ్యాసంతో కూడిన ప్రయాణంగా మారింది. ఇక వైకల్యం విషయానికి వస్తే లోతైన సమాజిక వివక్ష ఉందని, వికలాంగులు గౌరవప్రదమైన జీవితాన్ని గడపడానికి అర్హులు కాదని సామాజం భావిస్తుందని ఆమె అంటున్నారు. ‘వికలాంగుల జీవితాలకు మద్దతు ఇవ్వడానికి మా వద్ద వనరులు ఉన్నాయి. ఏదేమైనా వారి సామర్థ్యాలపై వివక్ష పితృస్వామ్యం వలె లోతుగా పాతుకుపోయింది. మార్పు కోసం మేము ప్రయత్నిస్తున్నాం. కానీ చాలా సమయం పడుతుంది. వికలాంగులు ఇళ్ల నుంచి బయటకు రావడానికి ఇష్టపడరని చాలా మంది అనుకుంటారు. కానీ ఇది నిజం కాదు. వారికి అనుకూలమైన మౌలిక సదుపాయాలు లేకపోవడం వల్లనే సమాజంలో వికలాంగుల కదలిక తక్కువగా ఉంటుంది. ఈ శారీరక, మానసిక అడ్డంకులను ఛేదించడానికి సమిష్టి కృషి అవసరం’ ఆమె అంటున్నారు.
సవాళ్లు ఎదురయ్యాయి
శ్వేత తల్లిదండ్రులిద్దరూ చార్టర్డ్ అకౌంటెంట్లు. చిన్నప్పటి నుండి బ్యాలెన్స్ షీట్లు, ట్రయల్ బ్యాలెన్స్‌ల గురించి వింటూ పెరిగారు. అయితే సీఏ కావడం తన వల్ల కాదని ఆమెకు తెలుసు. దానికి బదులుగా ఆమె సంగీతానికి ఆకర్షితురాలయ్యారు. అయితే ఆమె వృత్తిపరంగా దాన్ని కొనసాగించలేదు. గ్రాడ్యుయేషన్ తర్వాత పూణేలోని సింబయాసిస్‌లో ఎంబిఏ పూర్తి చేశారు. కోర్సు పూర్తయిన వెంటనే ముంబైలో ఉన్న పీఆర్ కంపెనీలో చేరారు. అయితే రోజూ వెళ్లి రావడం గురించి తల్లిదండ్రులు ఆలోచించార. కంపెనీ బాస్ వారిని స్వయంగా కలిసి ఒప్పించారు. అయితే శ్వేతకు కొన్ని సవాళ్లు ఎదురయ్యాయి. ముఖ్యంగా వర్షాకాలంలో టాక్సీ దొరకడం, దొరికినా లోపల వరకు రావడం వంటివి కష్టంగా మారాయి. చివరకు ఆమె ఉద్యోగాన్ని వదిలిపెట్టి స్వగ్రామానికి తిరిగి వచ్చేవారు. ఫ్రీలాన్స్ రచయితగా కెరీర్ ప్రారం భించారు. అలాగే తన న్యాయ వాద వృత్తిలో కూడా నిమగమయ్యారు.
హాస్యనటన కోసం
శ్వేత స్నేహితురాలితో కిసి ‘గివ్ సమ్ స్పేస్’ అనే ప్రాజెక్ట్‌లో పనిచేశారు. ఇందులో వారు ఎస్బీ రోడ్, ఫెర్గూసన్ కాలేజ్ రోడ్, పూణేలోని సమీప ప్రాంతాలలో ర్యాంప్‌లను ఏర్పాటు చేశారు. వీల్‌చైర్ వినియోగదారులకు పుస్తక దుకాణాలు, రెస్టారెంట్లు ఉపయోగించుకునేందుకు ఇవి ఎంతో ఉపయోగపడేవి. 2016లో తన హాస్యనటన కోసం స్నేహితులను స్క్రిప్ట్ రాయమని కోరారు. కానీ వారు తిరస్కరించారు. ఎందుకంటే శ్వేత పరిష్కరించాలను కంటున్న సవాళ్లకు సంబంధించి వారు న్యాయం చేయలేమన్నారు. ఆమెనే రాయాల్సిందిగా ప్రోత్సహించారు. వారి సలహాతో ఓ స్క్రిట్ రాసి ఈవెంట్లో ప్రదర్శించారు. సానుకూల స్పందన వచ్చింది. ఇది ఆమెను ముందుకు సాగేలా చేసింది.
రెస్ట్రూమ్ ప్రాజెక్ట్
న్యాయవాద పనిని కొనసాగిస్తూనే ‘రెస్ట్రూమ్ ప్రాజెక్ట్’ అనే ఆర్ట్ ఇన్‌స్టాలేషన్‌ను రూపొందించారు. ఈ కళాకృతి పూణేలోని వివిధ ప్రదేశాలల ప్రదర్శించేందుకు సిద్దమయ్యారు. టాయిలెట్ సీట్లు కాగితంతో రూపొందించబడ్డాయి. సందర్శకులు సీట్లను ఎత్తినప్పుడు, వారు ప్రతి రెస్ట్రూమ్కు సంబంధించిన నిర్దిష్ట సమస్యలను వైకల్యం కోణం నుండి వీక్షించ గలరు. ఆమె 2017లో ఓపెన్ మైక్‌తో కామెడీకి మరో షాట్ ఇచ్చారు. ప్రేక్షకుల నుండి చాలా ప్రేమను అందుకుంది. ‘నేను వైకల్యం గురించి ప్రజలకు అవగాహన కల్పించాలను కుంటున్నాను. అయితే కళారూపానికి కూడా అన్యాయం చేయకూడదను కుంటున్నాను’ అని జతచేస్తున్నారు. ఆమె ప్రసంగించే అంశాల సున్నితత్వం కారణంగా ప్రజలు తన జోకులు విని నవ్వని సందర్భాలు ఉన్నాయని ఆమె అంగీకరించారు. అయితే కామెడీ, స్టోరీ టెల్లింగ్లోని సూక్ష్మ నైపుణ్యాలను నేర్చుకోవ డం ద్వారా ఈ ఛాలెంజ్‌ను ఎలా విజయవంతం చేయాలో తెలుసుకుంటున్నాని ఆమె చెప్పారు.
విత్ దిస్ ఎబిలిటీ
మార్పుకు మార్గం స్టాండ్-అప్ కమెడియన్‌ను ఆమె ఎంచుకున్నారు. అయినా తన న్యాయవాద వృత్తికి మాత్రం ఆమె కట్టుబడి ఉన్నారు. వైకల్యం ఉన్న వ్యక్తిగా ప్రేమ, లైంగికత విషయాల పట్ల వివిధ ప్రాజెక్ట్‌లు, ప్యానెల్ చర్చల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. ఆమె చేతిలో ప్రస్తుతం ‘విత్ దిస్ ఎబిలిటీ’ అనే కాన్సెప్ట్ షో ఉంది. ఇది ఒక గంట కామెడీ సంభాషణ. ఈ కార్యక్రమాన్ని కార్పొరేట్ ప్రేక్షకుల కోసం, అలాగే పబ్లిక్ షోలలో కూడా ప్రదర్శిస్తారు. వైకల్యం గురించి మాట్లాడటం మార్పుకు మొదటి మెట్టు అని ఆమె అభిప్రాయం. వికలాంగుల వసతి అవసరాలను సాధారణీకరించవలసిన అవసరాన్ని కూడా ఆమె నొక్కి చెబుతున్నారు.