వాళ్ళు పిలిచారని ఆనందంగా వెళ్ళాను
కానీ నా కంటే ముందే నా కులం అక్కడకి వెళ్ళిందని వెళ్ళాక తెలిసింది.
నా ముఖాన్ని జత చేస్తూ వేసిన
ఓ కుర్చీ నాపై జాలితో ఓ వైపుగా ఒదిగి చూస్తుంది.
నా గురించిన మాటలు చెల్లాచెదురుగా
అప్పటికే పడివుండటం చూసి నేనేంటో అక్కడ వెతొక్కోసాగాను
అతుకులేసిన మర్యాద సగం సగం చూపులతో
ముఖాన్ని గీసుకుంటూ నలుగురి మధ్యలో నా ప్రతిభ వేదికెక్కకుండా
ఎక్కడ నా పేరుకు రెక్కలు మొలిచి ఊరంతా ఎగురుతాయోన్న
భయాన్ని కనిపించనీయని నటన నా మనసుకు మంటపెట్టి
దూరాన్ని చాలా దగ్గరగా చూపుతూ ఒంటరితనాన్ని మెడకు చుట్టి
మూలన కూర్చోబెట్టింది కిక్కిరిసిన ప్రసంగాల్లో
నా అక్షరం ఎవరి గొంతులోనో మెరిి
తలలన్ని బొంగారాళ్లా నా వైపు తిరిగినా
వివక్ష పొడిపొడి ప్రశంసల్లో దాగి ఏ క్షణం నిద్రపోకుండా
ఏదో ఓ రూపంలో అహాన్ని చూపాలని కాచుకోవడం ప్రత్యక్ష అనుభవం.
ఐతే ఎప్పటికైనా నిజం, వివక్ష ఎదురుపడే రోజున
ఔను… నేనొస్తున్నని తెలిసి నా కంటే ముందు ఆ వివక్ష
పారిపోయే రోజు ఒకటి వస్తుంది.
– చందలూరి నారాయణరావు, 9704437247