తెలంగాణ తొలి గజల్‌ కవయిత్రి ‘ఇందిర’కు నివాళి

కవులు, కళాకారులు సామాజిక బాధ్యతను తలకెత్తుకుని సామాజిక సమస్యలను కవితలు, కళా రూపాల్లో వ్యక్తం చేస్తుంటారు. అలా సమాజం గజల్‌ గీతం పట్ల తన బాధ్యతను నెరవేరుస్తూ కవితలు, గజళ్లు.. రచనలు, గేయాలాపనలతో సమాజాన్ని చైతన్య పరిచారు. తెలంగాణ సాహితిలో రాష్ట్ర కమిటీ సభ్యురాలిగా ఉన్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందుకు చెందిన బైరి ఇందిర.. తాను చూసిన… అనుభవంలోకి వచ్చిన ఉదంతాలకు అక్షర రూపమిచ్చి…. కథానికలుగా తీసుకొస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర తొలి గజల్‌ కవయిత్రిగానూ పేరొందారామె. ఇల్లెందులోని జడ్పీఎస్‌ఎస్‌, సుబ్నాగర్‌ ప్రభుత్వ పాఠశాలలో సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయురాలిగా ఉద్యోగ విరమణ చేశారు. ఉత్తమ ఉపాధ్యాయురాలుగా శ్రాస్తీయ ఆలోచనలతో విద్యార్థులను తీర్చిదిద్దారు. ఒక వైపు ఉపాధ్యాయురాలుగా బాధ్యతలు నిర్వహిస్తూ, ప్రవత్తిగా సాహిత్యాన్ని చివరి వరకు సమాజహితానికి అందించారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె ఆదివారం (19-02-2023)న కన్నుమూశారు.
– 1998లో ‘తేనెల పలుకు’ కవిత్వానికి ఆస్ట్రేలియా అంతర్జాతీయ అవార్డు.
– 2016లో విజయవాడ మానస సాహిత్య ఆకాడమీ జాతీయ స్థాయి అవార్డు.
– 2009లో ఉమ్మడి రాష్ట్రంలో అంటేవుర్‌ రాష్ట్ర స్థాయి సాహిత్య అవార్డు.
– 2013లో కొత్తగూడెం ‘చిగురు సాహిత్య అకాడమీ’ నానో విభాగంలో అవార్డు.
‘అలవోకలు’ వచన కవిత్వం, 2007లో, ‘అభిమతం’ 2016లో ‘తెలం గాణ గజల్‌ కావ్యం’ అచ్చయ్యాయి. 2021లో ‘అక్షింతలు’ మిని కవితలు, ‘వలపోత’ కథలు, ‘మరోప్రారంభం’ కవిత్వం పుస్తకాలు వెలువరించారు. 2022 డిసెంబర్‌లో వురిమళ్ల ఫౌండేషన్‌ అవార్డు అందుకున్నారు.

నేను పోయినప్పుడు

నేను పోయినప్పుడు
వస్త్రానికి బదులు
ఓ కాగితాన్ని కప్పండి
కవిత రాసుకుంటాను

సిరాబుడ్డినీ, పెన్నునొకదాన్ని
బ్యాగులో వుంచండి
మనసులో
ముల్లు గుచ్చుకున్నప్పటి పాటో
గాయపడిన గజలో
గుండెలోయలనుండి జాలువారొచ్చు
సెల్‌ మర్చిపొయ్యేరు
బోర్‌ కొట్టి చస్తాను

పసుపూ-కుంకుమ పులిమి
భయానకంగా మార్చకండి
నన్నందరూ గుర్తుపట్టాలి మరి!
దండలతో మూసెయ్యకండి
నాకు ఎలర్జీ!!
ఆ రేకులతో ఏ దార్నైనా
మెత్తగా పరవండి

పుణ్యస్త్రీ, పాపపు స్త్రీ అని
పేర్లు పెట్టకండి
నచ్చదు
సామాన్లేవీ పారేయొద్దు
అడిగిన వాళ్లకిచ్చేయండి
బ్యాండ్‌ వాళ్ళను
ఓల్డ్‌ మెలొడీస్‌ వాయించమనండి
డ్యాన్సులాడి లేట్‌ చెయ్యకండి
టైమంటే టైమే!

మంగళవారమో! అమంగళవారమో!!
పాడెకు కోడిపిల్లను కట్టి హింసించకండి
బడికి కబురు పెట్టండి
నే బతికిన క్షణాలు తలుచుని
వాళ్లు సెలవిచ్చుకుంటారు

దింపుడుకళ్లం దగ్గర
చెవులు గిల్లుమనేలా పిలవకండి
తలుచుకునేవారెవరో నాకు తెలుసు

డబ్బుకు ఇబ్బందక్కరలేదు
పక్కవాళ్ల కొట్లో ఖాతా ఉంది
అన్ని రోజులూ ఇక్కడే ఉండండి
మళ్లీ మళ్లీ చస్తానా ఏంటి!

మట్టిలో కప్పెట్టకండి
పురుగూ పుట్రా భయం!
కాస్త చూసి తగలబెట్టండే…
చుట్టుపక్కల మొక్కలుంటాయేమో!
గంధపు చెక్కలతో కాలడం కంటే
జ్ఞాపకమై పరిమళించడమే
ఎక్కువ నాకు

పనిలో పని!
నా నవ్వులూ కన్నీళ్ళు
ఆవిరైపోతున్న కాష్టం దగ్గర
కవిసమ్మేళనం పెట్టండి
నేనూ ఉన్నట్టుంటుంది
తనివితీరా విన్నట్టుంటుంది
– బైరి ఇందిర

Spread the love