ఇప్పుడు వస్తున్న కవిత్వంలో కలగాపులగముంది. అటుదిటు తిరగళ్ళమరగళ్ళేసి చెప్పడముంది. వస్తువు-శిల్పం మధ్య బంధమేదో, భేదమేదో తెలియదు. పదఢాంబికతతో భాషాశైలి పఠితులకు మింగుడుపడదు. దాంతో కవిత్వాన్ని చదివేవారు కరువయ్యారు. కవిత్వం తెలిసిన కొంతమందే సంపుటాలను కొంటున్నారు. కథలకు, నవలలకైతే కొంత వరకు గిరాకీ ఉండనే ఉంది. అసలు కవిత్వంపై మోజు తగ్గడానికి గల కారణాలేమిటి? అని ప్రశ్నిస్తే, ప్రమాణ రహిత కవిత్వం కుప్పలు తెప్పలుగా వస్తున్నది. సామాజిక మాధ్యమాల్లోనైతే మరీను. కొంతమంది కవులు ఎటువంటి ఆర్భాటాలకు పోకుండా ఉత్తమ సాహిత్య సజన చేస్తున్నారు. కాకపోతే వారికి ఆదరణ దొరకటం లేదు. శ్రీశ్రీ, తిలక్, శేషేంద్రశర్మ, కాళోజి లాంటివారి కవిత్వంలా భావితరాల వారు ఉటంకించుకునే పరిస్థితి నేటి కవుల కవిత్వంలో మగ్యం.
ఇలాంటి విపత్కర స్థితిలో ప్రామాణికమైన కవిత్వాన్ని అందిస్తూ, తమకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న వారు లేకపోలేదు. వారిలో సిక్కోలుకు చెందిన ‘కంచరాన భుజంగ రావు’ ఒకరు. ఇటీవల ‘నీటి గింజల పంట’ అనే ఉత్తమ కవిత్వాన్ని సాహిత్య లోకానికి పరిచయం చేశారు. కవిత్వానికి రుచి ఉంటుంది. అది రెండు మూడు నిమిషాల్లో పొయ్యి మీద నుంచి దించేయాలనుకున్న ఇగురు కూరలా వేడిగా, రుచిగా ఉండాలి. ఫ్రిజ్‌లో పెట్టి చల్లబడిన కూరలా అరుచిగా ఉండకూడదు. కవిత్వం తన రుచిలో స్వాభావికతను ఎప్పుడూ కోల్పోకూడదు. ప్రియంగా ఆస్వాదించేలా ఉండాలి. అలాంటి రుచిని తన కవిత్వంలో పుష్కలంగా నింపినవారు భుజంగరావు.
స్త్రీల రక్షణకు చట్టాలు ఉన్నా, వివక్షత యథేచ్చగా సాగుతున్నది. కడుపులోనున్న బిడ్డ ఆడపిల్లని తెలుసుకొని మరుక్షణమే భ్రూణహత్యలకు వెనుకాడని లోకమిది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ కవి ఆడబిడ్డ కలిగి ఉండడాన్ని అపురూపంగా భావిస్తూ, ఆమెపై తనకు గల అవ్యాజ ప్రేమను ప్రకటించడం ఈ ‘మా మిఠాయి పంట’ లో చూడొచ్చిలా. ‘మా జీవితాలను శోభాయమానం చేసిన/ పండోరా కాంతిధార/ ఏడు మల్లెలెత్తు సౌకుమార్యం/ పదహారణాల లావణ్యం/ అసలు తూకానికే పెడితే/ మా మనసెత్తు తులాభారం తను/ ఆ పూలబొమ్మ తోటిదే లోకం వర్ణార్ణవం/ తనే మా బతుకు పొలంలో/ మిఠాయి పంటయి జనించి ఉండకపోయుంటే/ ఏమైపోయేవాళ్ళమో’
‘నీటిగింజల పంట’ కైత సిక్కోలు రైతును ఆవిష్కరి స్తున్నది. అతివష్టి, అనావష్టితో విలవిలలాడుతున్న జనం బతుకుతెరువు నిమిత్తం నగరాలకు వలసపోతున్నారు. వారు పల్లెలో ఉన్న ప్పుడు అనేక కష్టాలు పడితే, పట్నం వెళ్ళాక కూడా సుఖపడడంలేదు. అంటే ఏదో తెలియని దుఃఖంలో మగ్గిపోతున్నారు. ఇలాంటి దయ నీయ స్థితిలో కూడా ఉత్త రాంధ్ర ప్రజలు మొక్కవోని ధైర్యం తో తమ విధులను అక్కడ నిర్వర్తిస్తూ, శ్రామికఫలాలు అందరికీ అందించే త్యాగ మూర్తులుగా నిలుస్తున్నారు.
‘సూర్యుడు నిదురలేవాలన్నా/ పరగడుపున మా చెమట చుక్కలు కొన్ని/ అతడి గొంతులో పడాల్సిందే/ మా రెక్కల్ని మేం నమ్ముకోవాలేగానీ/ నింగినీదడం పెద్ద కష్టమేంగాదు మాకు’
మట్టి గొప్పతనాన్ని ఎంతో అర్థవంతంగా కవి వివరిస్తు న్నారు ‘మౌనమే మట్టి రహస్యం’లో. పువ్వులు, ఆకులు, బండరాళ్లు, నీళ్లు గొప్పవిగా బడాయి పలుకుతున్నాయి. కానీ తమ ఉదాత్తతకు హేతువైన మట్టిని మాత్రం అహం భావంతో అవి గౌరవించలేకపోతున్నాయి. కానీ సమస్త జీవులకు జవ సత్వాలు ఇచ్చే రవిబింబం మాత్రం మట్టి విలువ తెలిసి నిరాడంబర జీవిగా కనబడుతున్నది. అంటే అన్ని పదా ర్థాలకు మూలం మట్టేనన్న ఎరుక తో ప్రేమగా మట్టిని స్పర్శిస్తున్న దిలా. ‘మట్టి మౌనంగా ఒదిగిపోయింది/ సష్టికి జీవం పోస్తూ’
‘వర్చువల్ వాగులో ఒంటరి పక్షి’లో కవి అర్ధరాత్రి అపరాత్రి అనక స్మార్ట్‌ఫోన్ వీక్షణం చేస్తున్న యువతను ఎండ గడతాడు. ఈ అల వాటు వారి ఆరోగ్యాన్ని అంతకంతకూ క్షీణింప జేస్తున్నది. లక్ష్యాల సాధనలో తడబాటుకు గురిచేస్తూ, జీవితాల్ని చిందరవందర చేస్తు న్నది. మానవ వికాసానికి జ్ఞానం మూలం. ఆ జ్ఞానాన్ని పొందటంలో పుస్తకమే ప్రధానం కావాలి. అంతర్జాలం ఎంతమాత్రమూ దానికి ప్రత్యామ్నాయం కాదనే సత్యాన్ని కవి ఎరుకు పరుస్తున్నాడు. ‘కుటుంబమనుకొని కలిసున్న వాళ్లంతా/ సర్వేంద్రియానం స్మార్ట్ ఫోన్ ప్రధానం అనుకొని/ తలో దిక్కు తపనల్లో మునిగి పోయాక/ మెలిసుండలేని గాచ్చారం నేను’
రాజకీయాలలో హుందాతనం నశించడాన్ని ‘మార్చుకోండి ప్లీజ్’లో నిరసిస్తాడు. పవిత్ర వేదికలపై నిర్మాణాత్మక చర్చ చేపట్టాల్సిన స్థానంలో అశ్లీల పదాలు దొర్లడం పట్ల ఏవగించు కుంటాడు. ఏ ఒక్కరి నోటా సంప్రదాయం, సామ్యవాదం ఒలకదు. దొందూదొందే అన్న చందంగా ఉన్నదంటాడు. ధనమదంతో కరడు గట్టిన కుల వాదం, మనువాదం ఎగజిమ్ముతూ, మానవవాదాన్ని మంట గలపడాన్ని గుర్తుచేస్తాడు కవి. ‘కొత్త తరహా అశ్లీల ఇతిహాసం/ ఖద్దరు గొంతులో/ జబ్బలు చరుచుకుంటూనే ఉంది/ నేలబారుగా ఢకొీట్టి/ మైకులు నోరు జారుతున్న కొద్దీ/ భాష నిలువెల్లా/ మ్యాన్ హోల్‌లో కూరుకుపోతోంది’
‘నాగలి వెంట నడిచే కవి’లో చాలామంది కవులకు, కర్షకుల బాధలు కనబడవని ఆక్షేపిస్తాడు. సైరికుల సమస్యలే ప్రధానమై కవిత్వాన్ని రాస్తున్న కవులకు కవి జేజేలు పలుకుతున్నాడు. ‘ఈ కవి గారికి ఒకసారి/ తను తినే అన్నం మెతుకు మీద/ నాగలి కనిపెట్టిన వాడి/ అస్తిపంజరం కనిపించిందట/ అప్పటి నుండి అతడు/ నాగలి వెంటే నడుస్తున్నాడు’
‘అమతమెవరికి’ కైతలో అమతోత్సవ భారతావనిలో ఎవరికి అమతం దక్కింది? ఎవరికి హాలాహలం? అందిం దనే ప్రశ్న వేస్తున్నాడు కవి. లక్షల కోట్ల రుణమాఫీలు కార్పొ రేట్లకే దక్కుతున్నవి. కర్షకులు, కూలీలకు మాత్రం నయాపైసా నజరానా దక్కటం లేదు. అప్పులు ఎగ్గొట్టిన కార్పొరేట్లు యథేచ్ఛగా విదేశాలకు పోతుంటే, పరువు కోసం పాకులాడే రైతులు ఉరికొయ్యల పాలౌతున్నారు. ఇది ఎంత మాత్రమూ సమ్మతం కాదంటాడు కవి. ‘చిన్న గొట్టంతో బస్తా పొట్టలోకి పొడిచి/ కొన్ని కేజీల బియ్యం కాజేసినంత లాఘవంగా/ బడ్జెట్ దేహం నుండే నేరుగా కొన్ని జలగలు/ చెమట నెత్తురు పీల్చుకుంటాయి’
ఉత్తరాంధ్ర వెనుకబాటు, వనరుల వినియోగంలో ప్రభుత్వ నిర్లక్ష్యం, ప్రపంచీకరణ ప్రభావం, భూమి పరాయీ కరణ కావడం, ప్రత్యేక ప్యాకేజీలు లేకపోవడం, వలసలు, ప్రజారోగ్యం కోసం చాలామంది రాస్తున్నారు. అవన్నీ అవస రమే. అయితే, సమస్యల్ని సాహిత్యం ద్వారా తెలియజేస్తే సరి పోతుందా? ఈ సమస్యల్ని నిర్దిష్ట రాజకీయాలకి ముడిపెట నవసరం లేదా? అన్నవి ప్రశ్నలు. ఈ వెనకబాటుకు ఆర్థిక విధానాలు ఎంత కారణమైనప్పటికీ, ఆ విధానాలు అమలు చేస్తున్న రూలింగ్ క్లాస్ స్వప్రయోజనాలు కూడా ఉన్నాయి. సమస్యని చెప్పడం ఎంత అవసరమో, ఆ సమస్యపై రాజ కీయంగా ఆలోచించేలా చేయడం కూడా అంతే అవసరం.
ప్రాంతీయ అసమానతలకి రాజకీయ-ఆర్థిక దక్పథంతో కూడిన సమకాలీన రాజకీయ అస్తిత్వం పరిభాష ఉండ వలసిన అవసరం లేదా! ఆ పరిభాషను సాహిత్యం ఇవ్వ గలదు. కానీ, ఆ విషయంలో తెలంగాణ, రాయలసీమ ప్రాంతాలతో పోల్చుకుంటే ఉత్తరాంధ్ర వెనకే ఉన్నట్లుగా కనిపిస్తుంది.
ఉత్తరాంధ్ర వెనుకబాటు, వనరుల వినియోగంలో ప్రభుత్వ నిర్లక్ష్యం, ప్రపంచీకరణ ప్రభావం, భూమి పరాయీ కరణ కావడం, ప్రత్యేక ప్యాకేజీలు లేకపోవడం, వలసలు, ప్రజారోగ్యం కోసం చాలామంది రాస్తున్నారు. అవన్నీ అవస రమే. అయితే, సమస్యల్ని సాహిత్యం ద్వారా తెలియజేస్తే సరి పోతుందా? ఈ సమస్యల్ని నిర్దిష్ట రాజకీయాలకి ముడిపెట నవసరం లేదా? అన్నవి ప్రశ్నలు
– పిల్లా తిరుపతిరావు, 7095184846