మహలఖా బాయ్ చందా శౌర్యం సౌందర్యం కవితా సౌరభం

Mahalakha Baru Chanda Shauryaam beauty poetic aurabham”పురుషుడు యుద్ధాన్ని సృష్టిస్తాడు!
స్త్రీ అద్భుతాలను సృష్టిస్తుంది”.!!
ఆమె అపురూప సౌందర్యరాశి. ఇంకా చెప్పాలంటే ఒక్కసారి కనినంతనే అచిరకాలం కనులలో నిలిచిపోయే రూపం ఆమెది. ఆమె హైదరాబాదు సంస్థానంలో 18వ శతాబ్దపు ఉత్తరార్ధంలో ఒక వెలుగు వెలిగిన వనితా శిరోమణి.
గజల్‌ గానం, రచన, నత్యం ఇవి మాత్రమే ఆమె అందానికి మెరుగు లద్దలేదు. నవాబు వెంట కత్తి పట్టి యుద్ధభూమిలో వీరవిహారం చేసిన ధీశాలి ఆమె. ఆమె ”మహలఖాబాయ్ చందా”.
అసఫ్‌ జాహీల కాలంలో మొత్తం హైదరాబాద్‌ స్టేట్‌ ను ప్రభావితం చేసిన మహలఖా బాయ్ చందా 18వ శతాబ్దం ఉత్తరార్థంలో ఇక్కడి సాంస్కతిక రంగంపై తనదైన ముద్ర వేసింది. కవులూ కళాకారుల చూపు హైదరాబాద్‌ను ఆకర్షించడం వందల ఏళ్ల కిందనే జరిగిందనడానికి ఇక్కడికి మహలఖా బాయ్ పూర్వీకుల రాకనే తార్కాణం. నిజానికి మహలఖాబాయి పూర్వీకులది గుజరాత్‌. ఆమె అమ్మమ్మ అహ్మదాబాదులో మొఘల్‌ ప్రభుత్వంలోని ఒక అధికారిని పెళ్లాడింది. ఆ తర్వాత భర్త దూరం కావడంతో తన ముగ్గురు కుమార్తెలతో కలిసి అహ్మదాబాదు నుండి బయలుదేరి సంప్రదాయ, జానపద, భక్తి గీతాలు పాడుతూ, నాట్యం చేస్తూ పలు ప్రాంతాలు తిరిగారు. ఆ సంచారంలో భాగంగా ఒకానొక రాజపుత్ర రాజును ఆశ్రయించి శాస్త్రీయ సంగీత నత్యాలు నేర్చుకున్నారు. అక్కడి నుండి ఆమె తన కూతుళ్లతో బిర్హంపూరుకు తరలింది. కాలక్రమంలో వీరంతా మొఘల్‌ దర్భారులో నాట్యకత్తెలుగా మారారు. వీరినే ఆ కాలంలో ‘తవాయిఫ్‌’ లని పిలిచేవారు.
ఈ కాలంలో మహలఖాబాయ్ తల్లి తన పేరును ”మహతబ్‌ రాజ్‌ కన్వర్‌ బాయి”గా మార్చుకుంది. ”కన్వర్‌ బాయి” అంటే రాజులకు సేవ చేసే నాట్యగత్తె అనే అర్థం వస్తుంది. ఈ కాలంలోనే దక్కన్‌ రాజధాని ఔరంగాబాద్‌ నుండి హైదరాబాదుకు మారింది. రాజ పరివారంతో బాటు రాజ్‌ కన్వర్‌ బృదం కూడా హైదరాబాదుకు చేరుకుంది. హైదరాబాదు వచ్చిన తర్వాత రాజ్‌ కన్వర్‌ జీవితం మలుపు తిరిగిందనే చెప్పవచ్చు.
నిజాం సర్కారులోని ఖజానా విభాగంలో పనిచేసే ఒక ఉన్నతాధికారిని పెళ్లి చేసుకున్న రాజ్‌ కన్వర్‌ 1768 ఏప్రిల్‌ 7న చంద్రబింబం వంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. హైదరాబాదులో తను అత్యంత భక్తితో విశ్వసించే హజరత్‌ అలీ (దర్గా) ఆశీస్సులతో ఈ బిడ్డ పుట్టిందని ఆమె గట్టిగా నమ్మేవారు. ఇంకా చెప్పాలంటే మాహ్ లఖా బాయి జననమే ఒక వింత కథ. ఆమె తల్లి ఆర్నెల్ల గర్భ వతిగా ఉన్నప్పుడు మౌలాలీ గుట్ట మీద ఉన్న ఒక సూఫీ సాధువు దర్గా సందర్శనకు పోయింది. మెట్లు ఎక్కుతున్న ప్పుడు ఆ కష్టం భరించలేక గర్భవిచ్చిత్తి జరిగే సూచనలు కనిపించినై. భర్త తాజ్‌ అలీషా ఒక్కడే పరిగెత్తి పైకి పోయి అక్కడి ప్రసాదాన్ని తెచ్చి ఆమెకు తినిపించగానే ప్రమాదం తప్పిపోయింది. తొమ్మిది నెలలు నిండిన తర్వాత పండంటి బిడ్డ ‘మాహ్ లఖా బాయి’ని కన్నది. ఆమె అసలు పేరు ‘చాందా బీబీ’.
మహతబ్‌ కన్వర్‌బాయి పెంపకంలో, నిజాం అధికారి రుక్నుద్దౌలా అంతఃపురం కల్పించిన అవకాశాలతో విదుషీ మణిగా ఎదిగిందామె. మహలఖా ఉర్దూ, పర్షియన్‌, అరబిక్‌ భాషలలో లోతైన అధ్యయనం చేసి, అపారమైన భాషా పాండిత్యాన్ని సంపాదించుకున్నది. ”చందా” అనే కలం పేరుతో దక్కని ఉర్దూలో ఆమె అనేక పద్యాలు, గజల్లు రాశారు. తను రాసిన గజల్లను స్వయంగా పాడే వారు కూడా. చందా అన్న తకల్లూస్‌తో (కలం పేరు) ఆనాటి దక్కన్‌లోనే పేరు ప్రఖ్యాతులు గడిచిన కళా వంతురాలు ఆమె. ఇక చిన్ననాటి నుంచే నాట్యం, సంగీతాలను అలవోకగా నేర్చుకున్నది మహలఖా. షియా సంగీతకారుడు, ధపద్‌, ఖయాల్‌ రాగాలను అవపోసన పట్టిన ఖుషాల్‌ఖాన్‌ ఆమెకు తనదైన సంగీత సంప్రదా యాన్ని అందించాడు. ప్రముఖ కవి, చిత్రకారుడూ అయిన తాజ్‌ ఆలీ స్నేహం ఆమెకు సాహిత్య కళారంగపు దారులు పరిచింది. మరో పార్శ్యంలో నాటి రెండో నిజాం ప్రభువు నిజాం అలీఖాన్‌ అసఫ్‌ ఝా దగ్గర ప్రధానిగా పనిచేస్తున్న అరిస్తుజా మహలఖాలో నిబడీకతమై ఉన్న ప్రతిభా వ్యుత్పత్తులను గుర్తించి ఆమెను ప్రోత్సహించాడు. రెండో నిజాంకు పరిచయం చేశాడు. నిజాం ఆమెకు తమ ఆ స్థానంలో రాజనర్తకి హోదా కల్పించారు. క్రమంగా ఆమె నిజాంకు నమ్మకమైన సలహాదారుగా మారింది. ఇంతలో జాన్‌ మాల్కమ్‌ అనే హైదరాబాదు రెసిడెన్సీలో పనిచేస్తున్న అధికారితో ఆమె ప్రేమలో పడింది. మరో వైపు సాక్షాత్తు నిజాం ప్రభువే ఆమెపై మనసుపడ్డాడు. కానీ ఆమె తను జీవితాన్ని స్వేచ్ఛగా గడిపడానికే ఇష్టపడింది.
”పువ్వుగా వికసించాలని ప్రతిమొగ్గ
తన ఆత్మను పిడికిలిలో దాచుకుంటుంది!”

”ప్రేమబాణం కత్తి కంటే హంతకమైనది!!
ఇది ఎందరో ప్రేమికుల రక్తాన్ని చిందించింది!!”

”కొవ్వొత్తిని నీచెంపతో
ఎలా పోల్చగలను?
కళ్ళలోని కొవ్వుతో
కొవ్వొత్తి గుడ్డిది!”

”చందా పెదవి పొడిగా ఎలా ఉంటుంది!
స్వర్గపు ప్రేమగీతమా!
ఆమె నీ మధు పాత్రను హరించింది.”
మహలఖా బాయి సంగీత వేదికపై ఘజల్‌, ఖయాల్‌ ఏది గానం చేసినా అది సంగీత సరస్వతి ప్రత్యక్ష ప్రదర్శ నమే అయ్యేది. రాజాస్థానంలో ఆమె నాట్యం దర్బారుకే అదనపు సొబగు అయ్యేది. 1801లో రాజదర్బారులో జరిగిన వసంతోత్సవంలో ఆమె చేసిన నాట్య విన్యాసం సభకుల ”వహ్వా”లతో మారుమ్రోగింది. అందరూ మంత్ర ముగ్ధులయ్యారు. అదే సభలో ఆమె ”మహలఖాబాయి’ అనే బిరుదును సగర్వంగా అందుకుంది. ఆ తరువాత అదే పేరుతో కవయిత్రిగా, గాయనిగా విఖ్యాతి గాంచింది. నిజాం ఆంతరంగికురాలిగా రాజాస్థాన ఉద్యోగినిగా, వేట వినోదాల్లో మాత్రమేగాక యుద్ధవిద్యలలోనూ ఆరితేరింది. నిజాంతో కలిసి యుద్ధాలు చేసి విజయాలకు మూల కారణమైంది. ఫలితంగా నిజాం ఆమెకు అనేక సౌకర్యాలు కల్పించారు. అపారమైన భూ సంపదను ఆమెకు స్వంతం చేశారు. అంతా ఆమెను ”మేడమ్‌ మూన్‌చీక్‌” అని అత్యంత గౌరవం గా పిలుచుకునేవారు. ఆనాడు ఒక్క నిజాం సంస్థానంలోనే కాదు మరో ఆరు సంస్థానాలతో ఆమెకు సాంస్కతిక సంబంధాలుండేవి.
చందా రాజనీతిజ్ఞురాలిగా రాటుదేలి రాజకీయ, తత్త్వశాస్త్రాల్లో పట్టు సాధించింది. నాటి నిజాం ప్రధాని అరస్తు ఝా ఆ కాలపు అరిస్టాటిల్‌గా పేరుగాంచారు. ఆయన శిష్యరికంలో పాలనా సంబంధమైన అన్ని లోతుపాతులను తెలుసుకుని నిజాంకి ఆంతరంగిక సలహాదారు అయింది. యుద్ధాలు చేసి నవాబు గెలుపుకు కారణమైంది. తనదైన రాయ బారాలు, యుక్తులతో ఎన్నో యుద్ధాలను చేయకుండానే గెలిపించిన ధీశాలి మహలఖా చందా. మీర్‌ అలీ విజయాలన్నీ ఆమె సాధించిపెట్టినవే. నవాబు తీసుకునే ప్రతి నిర్ణయంలోనూ మహలఖా ప్రమేయం ఉండేది. ఆమె సేవలకు నిజాం నవాబు నాంపల్లిలోని నిజాం రాజప్రాసాదం, పురానీహవేలీ దగ్గరలోని జాగీరు ను బహుమానంగా ఇచ్చారు. ఇప్పటి ఉస్మానియా విశ్వవిద్యాలయం, అడిక్‌మెట్‌ భూములన్నీ ఒకనాటి మహలఖా ఎస్టేట్‌వే.
ఒక తవాయిఫ్‌ కడుపున పుట్టి, నిజాం రాచరికపు వ్యవస్థలో అత్యంత కీలక భూమిక పోషించి, తనదంటూ ఒక భిన్నమైన జీవన శైలిని అవలంభించిన మహలఖా బాయి తెలంగాణ సమాజపు తొలి స్త్రీ చైతన్య కెరటం. తన 24 ఏటనే తల్లి రాజ్‌ కన్వర్‌ మరణించగా మౌలాలీ లోని తన ఎస్టేట్లోనే ఆమె సమాధిని నిర్మింపజేసింది.
నిజాం మహాలఖా బాయ్ కి కానుకగా ఇచ్చిన భూము లలో నేడు నగరంలో ఉన్న పురానా హవేలీ, ఉస్మానియా యూనివర్సిటీ ప్రాంతం, నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ న్యూట్రిషన్‌ కార్యాలయ ప్రదే శాలు, ఆంధ్ర మహిళా కళాశాల, నేటి భాగ్‌ లింగం పల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రం ఒకప్పటి మహాలఖా బాయి ఎస్టేట్‌లే. ఆమె తన జీవిత కాలంలో మౌలాలీ గుట్టపై ‘ఉర్సులను’ ప్రతి యేటా ఘనంగా జరిపించేది. గుట్ట కింద ఒక పెద్ద పూలతోటను నిర్మించింది. ఉస్మానియా యూని వర్సిటీలోని ఇఫ్లూ వద్ద మహలకా చంద మెట్లబావి ఉంది. చుట్టూ ఉండే భవనం మధ్యలో బావి ఆకారంలో ఉండటం దీని ప్రత్యేకత.
సుమారు రెండు దశాబ్దాలకు పైగా రెండవ నిజాం పాలనలో కీలకపాత్ర వహించిన మహలఖా చుట్టూ వంద మందికి పైగా అప్పట్లో అంగరక్షకు ఉండేవారంటే ఆమె స్థాయి ఎంతగొప్పదో అర్ధమవుతుంది. ఆ మహావిదుషీ మణి 1824 ఆగస్టులో హైదరాబాదులో 56వ ఏట తన జీవన యాత్రను ముగించింది. మౌలాలీలో తల్లి పక్కనే ఆమె సమాధిని నిర్మించారు. తెలంగాణ లో తొలి మహిళా సాధికారతకు సంకేతంగా చెప్పుకునబడే మహలఖా బాయ్ చందా కీర్తి అజరామరం. ఆచంద్రతారార్కం.
– హెచ్‌.రమేష్‌ బాబు, 7780736386

Spread the love