యువర్ స్టోరేజ్ ఈజ్ ఫుల్
ఖాళీ చెయ్.. లేకుంటే
ఊడదు.. చిగురు మొలవదు
ఇనర్షియా.. జడత్వమేదో ఒక మంచుసముద్రమై
లోపల ఘనీభవిస్తూ ఘనీభవిస్తూ
కొంత అంతర్దనమేదో జరిగి జరిగి, ఆత్మ కరిగి కరిగి
దుఃఖంతో, విముక్త కాంక్షతో
లోపలి నుండి ఒక ఊదారంగు పావురం
రెక్కల చప్పుడు టపటపా టపటపా
మౌనరాత్రి.. జ్ఞాపకాలు పక్షుల గుంపులవలె మేల్కొని
పదునైన ముక్కులతో హృదయాన్ని పొడుస్తూ పొడుస్తూ
జీవితం.. నిజానికి అనుభవంగా మిగుల్తున్న ఒకేఒక దీర్ఘానుభూతేనా-
అప్పుడప్పుడు అమ్మ కనబడ్తుంది చేతులు దాచి
తర్వాత నగంగా హత్తుకుని ఒడిలో రాత్రంతా ఒదిగి
కన్నీటితో కరిగించిన ‘ఆమె’ కనిపిస్తుంది
మనుషుల్లోనుండి రోడ్లు, నదులు, మొలకెత్తే ఆకాశాలు పొటమరిస్తూంటాయి
నన్ను నేను ఖాళీ చేసుకోవాలనుకుంటున్నపుడు
ఏ పుస్తకాన్నని పారేయగలను.. ప్రతిపుటా జ్వలితామృత బిందువే
‘డై ఎమీ కాదు.. లివ్ ఎన్టీ’
ఖాళీ ఐ ఎప్పటికప్పుడు లోపలి చెత్తను కాలబెట్టుకుంటూ
స్వయం శుద్ధున్నా తూ విస్తరించగలనా
ఏమీ తోచని అస్థిరత్వంలో నుండి మొలకెత్తుతూండగా
‘పర్చేజ్ న్యూ స్టోరేజ్’ అని ఒక సూచన
కొత్త సూర్యుడు.. కొత్త మెలకువ.. కొత్త దృష్టి
కొత్త జీవితం
గుడ్డు లోపల శిశుపక్షి ముక్కుతో పైపెంకును పగులగొడ్తూ
టక్ టక్ టక్.. కొత్త జన్మ కోసం నిశ్శబ్ద శబ్దం
– రామా చంద్రమౌళి, 9390109993