బూడిద పూలు.. కవిగుండెల్లో నిప్పుల సాగు..

కవిత్వంలో నిఖార్సైన అగ్గిసెగలు.. ”నిజం” ఇవి నిప్పు కొమ్మలకు పూసిన, వాడని బూడిదపూలు… ఈ కవి ఓ అక్షారాల అగ్గికొమ్మల అడవి.. సామాజిక రుగ్మతలు అణచివేతలు, అసమానతలు తనలో రగిలిన రవ్వలు… భావ సంఘర్షణల రాపిడిలో రాజుకున్న నిప్పుకొమ్మల దహనమిది.. లావా ఎగసి శిలాజమైనట్టు ఈ కవి అంతరంగ అగ్నిఘోష ఇలా కవిత్వ శిల్పంగా మన కళ్లముందుంది.
భాషని ఇంత బలంగా వాడొచ్చా అని ఈ కవి కవిత్వం చదివాక అనిపించింది… వివరణంతా కుల, మత, ప్రాంత రాజకీయ విద్వేషాలతో పాటు సామాన్య జనం లోపల విచ్ఛిన్నమైన మానసిక బంధాలను విప్పి చెప్పడమే, కప్పి చెప్పేదే కవిత్వం అయినప్పుడు విప్పి ఎలా చెబుతారని అడక్కండి. శ్రీరామమూర్తి కవిత్వం చదివాక క్లుప్తత, సరళత, సాంద్రత మీకు బోధపడతాయి. ఒకవైపు సామాజిక సృహ మరోవైపు తీరని వ్యధ.
అధివాస్తవికత పాళ్లు ఎక్కువ ఉన్నప్పుడే శిల్పం కొత్త పుంతలు తొక్కుతుందన్నది ఒప్పుకోలేని నిజం… కల్పనను, కొన్ని అల్యూజన్స్‌ నీ సర్రియలిస్ట్‌ పంథాలో రాయడం ”నిజం” కవి చేసిన మొదటి, చివరి ప్రయత్నం…
శ్రీరామమూర్తి నాకు ఫేస్‌బుక్‌లో పరిచయం, టb గోడల మీద రెండు మాటలు రాసేసి వెళ్ళిపోయి మనల్ని అబ్బుర పరుస్తుంటారు. అయితే ఆయన వయసురీత్యా తన కవిత్వ పలక దిద్దుతున్నప్పటికీ నేనింకా పుట్టానో లేదో తెలీదు కానీ, ఆయన కవిత్వాన్ని చదవడం మాత్రం నేను కవిగా పుట్టాకే జరిగింది…
సమాజపు లోటుపాట్లను, అవకతవకలను, వ్యంగ్యంగా, వాస్తవిక కాల్పనిక సమ్మేళనంతో కవిత్వం రాయడం ఈ నిజం కవి గొప్పతనం… కవిత్వ సిద్ధాంతాల గురించి నేను పెద్దగా చర్చించను గానీ ఈ బూడిద చెట్ల పూల దండలు గుచ్చి మన మెడలో వేసి వెళ్ళిపోతారు కవి..
వాటిని ఆస్వాదించాలంటే కచ్చితంగా మనలో నిజాన్ని ఒప్పుకునే నిజాయితీ, తర్కాన్ని విభేదించలేని మెచ్యూరిటీ, స్వయంకృతాపరాధానికి తల్లడిల్లిన మనసు వుండాలి…
కరోనా కల్లోలమే కాదు, పాలకుల వ్యవస్థల క్రూర రాజకీయ ఎత్తుగడలనీ ఆయన మాటల్లో చెబుతారు… ఇలా చెబుతూనే సుతిమెత్తని సీతాకోక నవ్వుల్ని.. పసిపాపల జోల పాటల్ని…. రంగురంగుల హరివిల్లుల అందాల్ని కూడా హాయిగా చెబుతారు..
మనసు మైల పడి/ అంతస్తుల అడుగు జారి / కింద పడతామని వీదులని మేల్కొలిపే చీపురును ద్వేషించడం మనకెంతో హాయి/ బిక్కు బిక్కు రైళ్లు/ రాజుని మోసి జనాన్ని ద్వేషించే/ వ్యాపారిని ప్రేమించి వ్యాక్సిన్ను చెట్టెక్కించే/ విషవానల ఆకాశం కింద/ అనాధ విత్తుల పైరులై విరగ పండుతారు/ బూడిద చెట్ల పూలు/ శవాలను మోస్తూ జీవచ్ఛవాలను చూసి/ ఒలుకుతున్న కన్నులతో/ ప్రాణాలరచేత పట్టుకొని/ పరుగులు తీస్తున్న నదులు/ కొంగ రంగస్థలం/ లోపల నుండి గడియలు బిగించుకున్న / లోగిళ్ళు బిగిపిడికిళ్లను కలగంటున్నాయి/ దుఃఖ నదిలో పుష్ప పడవ / సకాలంలో కాపాడలేకపోయిన చేతకానితనానికి/ సమాధి కట్టమని / మరణానికి గౌరవాగౌరవాలుండవని/ గంధపు చెక్కలతో కాల్చినా/ అయ్యేది బూడిద అదేనని/ నిండు నిజాల స్మశాన మీటుతున్నాయి/ కట్టె కాలడం లేదు/ మనుషులను మృత దేహాలు మోస్తున్నాయి/ మధ్య మధ్య దయ్యపు బువ్వ పెడుతున్నాయి/ వల్లకాటి వాగ్మూలం/ ఇలా / వీరదాసు/ నది వీడిన నేల/ అప్పుడే ఎక్కడికి
ఇలా ఎన్నో కవితలు కరోనా కల్లోల అక్షరీకరణే, అయితే కోవిడ్‌ వైపరీత్యాలను అక్షరం చేయని కవులు తక్కువే కానీ ఇలా పుస్తకం చేసిన చాలా కొంతమందిలో శ్రీరామమూర్తి ఒకరు..
నేను చూపిన ఈ కవిత్వ పాదాలే కాదు బూడిద చెట్ల పూల పుస్తకపు దారిలో చాలా అడుగులు కరోనా కాలంలో జరిగిన సంఘటలకు చలించిపోయి రాసినవే… సంకలనంలో ఎన్ని వాక్యాలను కోట్‌ చేసినా ఇంకొకటి మిగిలే ఉంటుంది… కిరసనాయిలు పోసి పుల్లగీసినా అంటుకోడం లేదని వేదన చెందడం.. అరచేత్తో పాచిని తొలగించి తాజా దనాన్ని అద్దే మనిషిని రానియ్యట్లేదని వాపోవడం, దారెప్పుడు ఒకే తను మనస్సుల సంచారి కాదని తత్వాన్ని అవలీలగా చెప్పడం అన్ని శ్రీరామమూర్తి కవిత్వ పరిమళాలే…
కుంచించుకుపోతున్న మానవత్వాన్ని, కురచైపోతున్న మనిషితనాన్ని, ఇమేజెస్‌తో, అల్యుజన్స్‌తో, మెటాఫర్లతో ఇంత సుమధుర కవిత్వం అందించడం నిజంగా కొత్త సృష్టే…
ఒకవైపు ప్రోస్‌ మరోవైపు పోయెట్రీ.. రెండు పడవల మీద కాళ్ళు పెట్టీ పయనం సాగించడం కష్టతరమైనా ఆయనకు చాలా ఇష్టతరమైంది…
మబ్బుల్ని మడత పెట్టి / మోసుకుపోతున్న వాణ్ణి ఆపండి / కిరాయికైనా నాలుగు మంచి చినుకులు / కురిపిస్తాడేమో అడుగుదాం / తరుణోపాయం / ఆటలో వైరానికి మాటలు మానేసిన బంధు స్నేహితుడు, / బడి పంతులు పంపగా / నాన్నతో అవసరం కోసం ఇంటికొచ్చినప్పుడు / ఆప్యాయంగా పలకరిస్తే / ముఖం తిప్పుకున్నప్పటి గాయం / నేటికీ తియ్యగా కబుర్లు చెబుతుంది / తిరిగి అక్కడికే / రేణువై ఎగరడం కంటే స్థానువై ఉండడమే మంచిది / కొమ్మలు విరిచి కట్టిన చెట్టులా, / రెమ్మలు తుంచేసిన పువ్వులా, / కదలిక ప్రాణాంతకం, / చైతన్యం మృత్యు సంతకం / చావు బాకీ
వలస పోవడం కొన్ని ప్రాణాలకు అతి మామూలు విషయం కానీ కోవిడ్‌ సమయంలో వలస కార్మికుల దీన గాథ ప్రపంచం మొత్తం చూసింది.. ఎవరు తీర్చలేని, ఎక్కడా పూడ్చలేని నరకయాతన.. ఇప్పటికిప్పుడు ఇంటికి పొమ్మంటే అప్పటికప్పుడు ఇల్లు ఖాళీ చేయడం అంటే బతుకు కిటికిలో నుంచి ఎగిరి ఏ చెట్టుకో పుట్టకో వలస వెళ్ళడమే కాదా… అలాంటి వలస కార్మికుల గాధల్ని అధ్భుతంగా చిత్రించారు మూర్తి.. విషధాన్ని వివరణాత్మక ధోరణిలో సాగించడం కూడా ఒక కవిత్వ పటుత్వమే… అలాగే ప్రతి కవిత్వ శీర్షిక చాలా కొత్తగ ఎవరు కాపీ కొట్టలేనిదిగా ఊహించడానికి కూడా వీలు లేనిదిగా ఉంటుంటే ఒక కవి పరమార్థాన్ని చెబుతుంది…
రాత్రి ఆసుపత్రి, / వడిసెల / క్రూర రంగస్థలం / మాటలు దూకే బావి / అది తాకని చోటు రోబోటు
ఫుల్‌ పోయెట్రీ లా.. పూర్తి సిమిలిలతో అల్లుకున్న పద్యాలు ఇవి… ఒక్క పోలికను చూపడమే కష్టమైన ఈ రోజుల్లో ఇన్ని సిమిలారిటీస్‌తో పోయెట్రీ రాయడం చాలా కష్టతరం.. అస్థిత్వ రోదనని, ఆవాంచనీయ సంఘటనల రూపాన్ని ప్రతీకలుగా మలిచి చెప్పడం ఈ కవిత్వం ప్రత్యేకత…
అయితే కవిత్వం మీద అవగాహన, సాధికారత లేకుండా ఇంత కవిత్వాన్ని రాయడం సులువు కాదు… ఇప్పటి యువత పాటించాల్సిన ఎన్నో ధోరణులు ఈ కవిత్వంలో నేను గమనించాను…
పెనుగులాట జీవిత తర్కం అయితే ఆ పెనుగులాటను గుచ్చం చేసి బూడిద చెట్ల పూలని మనకు అందించడం… వాటిని చదువుతూ ఎంతో కొంత మనల్ని మనం ఊరట వైపు మల్లించుకోడం తుదిమెరుగు…
పోరాటాన్ని వీడని ఏ వాక్యమైన కవిత్వమే అవుతుంది అంటాను నేను… అలాంటి పోరాట పటిమ ఉన్న శ్రీరామమూర్తి కవిత్వానికి నా సలాములూ…
– సుభాషిణి తోట, 9502818774

Spread the love