కష్టపడి పండించిన పంట
అల్ప పీడనాల సుడిగుండంలో పడిపోతే
ఆ రైతుకి ఎంత కష్టం?
కడుపు కాలు కట్టకొని
అప్పుల వంతెన మీద కత్తుల నడకతో
నిత్యం కన్నీరు కార్చినా
చేతికందివచ్చే సమయంలో
ఉరుములేని పిడుగులా
అకాల సకల వర్షం కుంభ వృష్టిగా మారితే
ఇక కన్నీటి వరదల్లో కొట్టుకుపోయేను
కల్తీ ఎరువులనించి దళారి దోపీడీలనుంచి
అడవి జంతువుల విధ్వంసం నుంచి
కన్న బిడ్డలా కాపాడుకున్నా
తీరం దాటని తుఫానొకటి బలి తీసుకుంది
ప్రభుత్వాలెన్ని మారినా
సగటు రైతు బతుకు ఎప్పుడు నీటి మీద రాతనే
వాగ్దానాలు చసి గద్దె ఎక్కినా
వాడి బతుకు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే.
ప్రతి రంగానికి హక్కులు ఉంటాయి
ఒక్క రైతుకి మాత్రమే బాధ్యతలు
నోరున్న మూగ జీవి
గొంతు ఎత్తలేక కంట నీరుతో విలపిస్తున్నాడు
ప్రతి కాలం పరీక్షలు పెడుతూ రైతు ఉసురు తీస్తుంది
కొన్ని వేల సార్లు చస్తూ బతుకుతూ
రేపటిపై ఆశతో ముందుకు సాగుతాడు ..
ఇంత అన్నం పెట్టే రైతుని
వరదలు కబళించకుండా కాపాడుకొంటేనే
వాడు మిగులుతాడు
లేదంటే వరదల్లో కొట్టుకుపోయిన
ఒక అనాధ శవమే వాడిది ..
– పుష్యమీ సాగర్, 7997072896