నిరుపేదల చిత్రాలన్నీ ఒక్క తీరే! బడుగు బతుకుల కష్టాలన్నీ ఒక్క ీరే! శ్రమ దోపిడీకి గురయ్యే బతుకు వేదనలన్నీ కన్నీటి మూటలే! కన్నీరు కార్చటమే సమస్యకు పరిష్కారమైతే ఇట్లాంటి కథలకు అర్థమే లేదు. కన్నీటి నుంచి కసి రగిలించే, దోపిడీ పట్ల పిడికిలి బిగించే, దైన్యం నుంచి ధైర్యం నూరిపోసే, కథలే కావాలిప్పుడు.
డాక్టర్ గీతాంజలి గారి ‘ఉయ్యాల కథలు’ ఈ దేశపు నిర్లక్ష్యపు వురికొయ్యకు వేలాడుతున్న దైన్యపు గాథలు. పాలమూరు ఈ దేశపు ప్రతి మారుమూలకూ ప్రతీక. ఏ పల్లెలో అడుగిడినా కనబడేవి ఉన్న ఊరితో, కన్నతల్లితో పేగు బంధాలు ఛిద్రమై పరాయీకరించుకున్న శ్రమ బంధాల యదార్థ గాధలు. వ్యధార్థ జీవుల పరివేదనలు. నిరంతరం శ్రమ సంబంధాల్లో అడుగడుగునా మోసపోయే బలి పశువుల దీనగాథలు.
ఎటు చూస్తే అటు దగా, వేదన, ఆకలి, దు:ఖం, నిస్సత్తువ, నిస్తేజం, మోసం, నిష్కపటత్వం. అనుక్షణం మోసపోతూ, రెక్కలు ముక్కలు చేసుకుని కల్తీ లేని శ్రమ అందిస్తూ కూడా, కల్తీ ఆహారం తింటూ, కల్తీ మందులు తాగుతూ, కల్తీ విద్యా, కల్తీ వైద్యం, కల్తీ సరుకులు పొందుతూ బతుకు వెళ్ళమార్చడమే జీవితం అనుకుంటే ఈ కథలు వాటికి దర్పణాలు. ఇందులోని ఏడు కథలు ఏడిపించే కథలే. ఏడిపించి వదిలేయడమే కాదు, ఏదో ఒకటి చేయమని గుండెల్లో గుబులు పుట్టించే కథలు. గీతాంజలి గారి కథనాలన్నీ ఏడిపిస్తాయి. అదే సమయంలో పిడికిలి బిగించడాన్ని కూడా నేర్పిస్తాయి. ఈ కూట నీతుల్ని ప్రశ్నించమని అర్థిస్తాయి.
మొగడు పోయిన ఒంటరి ఆడది భాగ్యమ్మ కథ ‘ఎండి గజ్జలు’లో వందల భాగ్యమ్మలు దాగి ఉంటారు. చిరు ఆశల్ని కూడా తీర్చుకోలేని వేల మంగలు వుంటారు. కట్నం కాటుకు బలయ్యే వేల అపర్ణలు వుంటారు. ఇంట్లో కుంపటిలా ఎదుగుతున్న మంగ. చదువుకుంటానని ఒక్కతీరున ఏడ్చే మంగని పూల కొట్టు సేటు దగ్గర పనికి కుదుర్చుతుంది. నెత్తి మీద అప్పులు. మిత్తి కోసం తల వంపులు. ఎండి గజ్జలంటే ప్రాణం పెట్టే మంగను సేటు కొడుకు మాయమాటలతో మోసం చేస్తాడు. ప్రతి గల్లీలో ఉంే ఈ సేట్లు ఎందరో మంగల్ని తాయిలాలతో వశం చేసుకోవడం ఇక్కడ మామూలే.
రెక్కలు విరుచుకొని పని చేసే భాగ్యమ్మకి ఎండి గజ్జెలు బిడ్డకు కొనివ్వకుండా ఆపింది సేటూ, మిత్తీ కట్టేదాకా వదలని షావుకారూ కాదు. అపర్ణ ప్రాణం తీసింది కట్నం కాదు! అయ్యను చంపిందీ, బిడ్డని చంపిందీ, మంగ ఎండి గజ్జల కోసం తన వయసును పణంగా పెట్టిందీ, రేపో మాపో భాగ్యమ్మని చంపేదీ, శ్రమించకుండా బద్దకించినందుకు కాదు! రెక్కలు ముక్కలు చసుకున్న శ్రమంతా దోపిడీ గాడి గాదెల్లో మూలగటానికి వెళ్ళిపోయి చేతిలో చిల్లి గవ్వలు కూడా మిగలక పోవడమే! నెత్తురోడ్చి, పొద్దస్తమానం చిత్తడై, ఛిద్రమై, రూపాయలు వాడికిచ్చి, పైసలతో ఇంటికొస్తే ఆ పైసలు మిత్తీలకు పోయి నోటికాడ కూడు లేకుండా పోయిన దైన్యం కాదా చంపేది? శ్రమ చేయనందుకు కాదు, శ్రమ చేసిన చేతులకి, న్యాయంగా రావాల్సిన ఫలితాన్ని అందకుండా చేయడం వల్లే అని చెప్పటమే అసలు విషయం.
మేస్త్రీ మోసంతో రైలెక్కిన కూలీలు ఎన్నడూ చూడని మంచునేలమీద అడుగిడి, రాజధాని వీధుల్లో చేతులు చాపి, బిడ్డని అమ్ముకునే కర్మలు అనుభవించి, కష్ణమ్మ ఒడ్డున పుట్లు పండించి, వట్టి చేతులతో ఇంటికి పోలేని దైన్యం పాలమూరు నుంచి కాశ్మీరు కథ. కన్న వూరిని వదిలేయడం అంటే మృత్యు వేదనే!
టిప్పర్ బోల్తా కొట్టి రెక్కలు విరిగి చావుబతుకుల్లో కొట్టుకొనే వార్తలు ఈ దేశంలో వినని రోజుంటుందా? దేశం గాని దేశంలో పనికెళ్లి బతుకుపోరులో కృష్ణమ్మ తనువు చాలించి శవమై ఇంటికొస్తుంది. బొందిలో ప్రాణం ఉన్నంత కాలం పుట్టిన వూరుతో బంధం పెనవేసుకొని వుంటుంది. అయినా అందరికీ ఆ అదృష్టం ఉండదు. కొందరికి చస్తే తప్ప! హృదయ విదారకమైన ఈ వేదనలన్నీ వలస బతుకుల్లో సర్వసాధారణమైపోయాయి. కృష్ణమ్మ కథ గుండెల్ని పిలుస్తుంది. సరిగ్గా ఇదే వేదనతో కనీసం ఇంటికి కూడా చేరలేని వలస కూలి బాలయ్య కథ ప్లాట్ఫారం నెంబర్ 34 కంటతడి పెట్టిస్తుంది.
్త్రీ స్వేచ్ఛల జెండా రెపరెపలు అంతర్జాతీయ వేదికల్లో ఎగురుతుంటాయి ఓ వైపు. అయినా సరే ఈ దేశపు దళితవాడల్లో తన మాంసాన్ని తన ఇష్టం లేకుండానే పందారం చేసే అనసూయ లాంటి జోగినిలు ఈ దేశపు గుండెల మీద బర్త్ మార్క్‌లా సిగ్గు కోసం కప్పుకున్న వలువ పక్కకు తప్పుకున్నప్పుడల్లా కనబడుతూ వుంటారు విచిత్రంగా! ఉయ్యాల మీద ఆసేతు హిమాచలం శవమై నగంగా ఊగుతూ పోగొట్టుకున్న ఈ దేశపు పరువును నిరంతరం ప్రశ్నిస్తూనే ఉంటుంది.
పోలేపల్లి పీనుగ ఈ దేశపు అంతరాత్మ! ఆత్మ వంచనా శిల్పం. హస్కు కొట్టే పందుల దొడ్లకు కోట్ల కొద్ది ప్రజాధనాన్ని వెచ్చించటం నేరం కాదని అనుకోవడమే పెద్ద నేరం. నిలబడటానికీ, చస్తే పాతి పెట్టడానికీ, నిరంతరం అదే నేలతో మమేకమై బతికే ఈ జీవచ్ఛవాల కోసం ఆరడుగుల నేల కూడా లేకుండా చేసి కోటి పీనుగల్ని ఒకేసారి తగలేసేటంత సెజ్జులను వాడేసుకునే బతికున్న పీనుగుల కథ ఇది! నేలతల్లి గుండెల మీద నల్ల తారు పూయడమే అభివృద్ధి ఎలా అవుతుందో ఈ కథ అడుగుతుంది.
సంపదలు సృష్టించి, ఈ దేశపు వెన్నెముకను నిటారుగా నిలబెట్టడం కోసం తామెలా వెన్ను విరుచుకొని కొవ్వత్తిలా కరుగుతారో ఈ కథలోని కృష్ణమ్మలు, చంద్రమ్మలు, భాగ్యమ్మలు, ఎల్లమ్మలు, అనసూయమ్మలు, రషీదాలు చెబుతారు. ఎవరికీ పట్టని ఈ అమాయకపు జీవుల నెత్తుటి కూడుని నిర్లజ్జగా మేసే ధనికస్వామ్యం పతనం కావలసిన అవసరాన్ని ఈ కథల్లో ప్రతిభావంతంగా చెప్తార.
– వి.విజయకుమార్