వెట్టి‌పై పోరాట‌మై క‌దిలింది

Vetti struggled and movedకట్కూరు సుశీలాదేవి… చిన్నతనం నుండి కమ్యూనిస్టు భావాలు అలవర్చుకున్నారు. అభ్యుదయ కుటుంబంలో పుట్టి వెట్టికి వ్యతిరేకంగా పోరాడాలని నిర్ణయించుకున్నారు. గర్భిణిగా ఉండి జైలు జీవితం అనుభవించారు. ధనిక కుటుంబంలో పుట్టినా పేదల పక్షం నిలిచినందుకు అష్టకష్టాలు అనుభవించారు. అయినా ఉద్యమాన్ని మాత్రం వీడలేదు.
సుశీలమ్మది భువనగిరి తాలుకాలోని శరభనానాపురం గ్రామం. తల్లి సుందరమ్మ, తండ్రి కొమిరెడ్డి రాంరెడ్డి. వీరిది మధ్యతరగతి భూస్వామ్య కుటుంబం. ఈమే ఇంట్లో తొలి సంతానం. అప్పట్లో స్త్రీలు(ఉన్నత వర్గాలకు చెందిన వారు) బయటికి వెళ్లాలంటే ఘోషా పాటించేవారు. నిజాం ఏలుబడిలో వున్నందున ఉన్నత వర్గం వారంతా ముస్లింల సంప్రదాయాన్నే పాటించేవారు. ఆ రోజుల్లో స్త్రీలలో చైతన్యం తక్కువ. అందుకు భిన్నమైన వాతావరణంలో పెరిగారు సుశీల. తండ్రి ప్రోత్సాహంతో చిన్ననాటినుండి ఎక్కడికైనా ఒంటరిగా వెళ్లేవారు. ఆమె తండ్రి నిజాం ప్రభుత్వాన్ని వ్యతిరేకించేవారు. అభ్యుదయవాది అయిన ఆయన పిల్లల్ని బాగా చదివించారు.
రెడ్డి హాస్టల్లో చదువు
ఆరుట్ల రామచంద్రారెడ్డి, ఆరుట్ల లక్ష్మీనర్సింహ్మారెడ్డి, రావి నారాయణరెడ్డి వంటి వారితో వీరి కుటుంబానికి పరిచయాలుండేవి. సుశీల ఎనిమిదవ తరగతి చదివేందుకు హైదరాబాద్‌లోని రెడ్డి హాస్టల్లో ఉన్నారు. అక్కడ ఈమెతో పాటు జతగా రావి నారాయణరెడ్డి కూతురు భారతి కూడా చదివేవారు. ఆ రోజుల్లో కమ్యూనిస్టుపార్టీ గ్రామాల్లో ఆంధ్రమహాసభ పేరుతో వెట్టికి వ్యతిరేకంగా ఉద్యమం ప్రారంభించింది. పార్టీని అప్పట్లో సంఘంగా చెప్పుకునేవారు. ఖమ్మంలోని చిలకుర్తిలో ఆంధ్రమహాసభకు, భువనగిరి మహాసభలకు సుశీల వాలంటీర్‌గా వెళ్లారు. ప్రతినిధులకు నీళ్లు అందించడం, ఇతర సదుపాయాలు కల్పించడం వంటివి చేసేవారు. అలా ఆమె రాజకీయ జీవితం మొదలైంది. తరువాత హైదరాబాద్లో జరిగిన సభకు కూడా హాజరయ్యారు.
ప్రాథమిక చికిత్సలో శిక్షణ
1947 నాటికి ఉద్యమ పరిస్థితుల్లో మార్పులు వచ్చాయి. గ్రామాల్లో ఉద్యమాలు పెరిగాయి. ఆమె తండ్రి కూడా వీటిలో పాల్గొనేవారు. హైదరాబాద్‌ నగరంలో స్కూళ్లల్లో నిరసన, బంద్‌ కార్యక్రమాలు జరిగేవి. అందులో వీరూ పాల్గొనేవారు. ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొనడంతో నిజాం సర్కారు ఈమె తండ్రిపై నిఘా పెంచింది. దాడులు కూడా చేసేవారు. అట్లాంటి పరిస్థితుల్లో వీరి మకాం గుంటూరులోని మందపాడుకు మారింది. అక్కడి నుండి విజయవాడలో డాక్టర్‌ అచ్చమాంబ వద్దకు వెళ్లారు. అక్కడే సుశీల ప్రాథమిక చికిత్సలో శిక్షణ తీసుకున్నారు. అప్పటికే కట్కూరు రామచంద్రారెడ్డి ఉద్యమంలో చురుకుగ్గా పాల్గొనేవారు. ఈయనతో సుశీల పెండ్లి గురించి రావి నారాయణరెడ్డి అప్పటికే ఆమె తండ్రితో చెప్పారట. ఆయనకు ఇష్టమే అయినా సుశీలతో మాట్లాడిన తర్వాత చెబుతానన్నారంట.
తల్లిదండ్రులు లేకుండానే పెండ్లి
సుశీల పెండ్లి పార్టీ ఆధ్వర్యంలో రాంచంద్రారెడ్డితో జరిగింది. అయితే నిర్బంధం వల్ల పెండ్లికి ఆమె తల్లిదండ్రులు రాలేకపోయారు. ‘నాన్న వచ్చేవరకు ఆగుదాము’ అని ఆమె అంటే ‘ఆయన రాలేని పరిస్థితిలో ఉన్నారు. పెళ్లి కానిద్దాం’ అని పార్టీ పెద్దలు చెప్పడంతో కాదనలేక ఒప్పుకున్నారు. అలా ఆమె కుటుంబసభ్యులు లేకుండానే 1948 సెప్టెంబర్‌ 16న సాలూరులో వీరి వివాహం అయిపోయింది. అప్పుడే కొణిపాకిలో కొండ మాధవులు అనే కామ్రేడ్‌ను చంపేశారనే కబురొచ్చింది. దీంతో వీరు సాలూరులో నిరసనసభ పెట్టారు. అప్పటికే తెలంగాణాలో యూనియన్‌ సైన్యాలు ప్రవేశించాయి. కమ్యూనిస్టులపై ఒత్తిడి రోజురోజుకూ పెరుగుతోంది. అరెస్టులకు ప్రయత్నిస్తున్నారు. దీపావళి పండుగకు సుశీల పుట్టింటికి వెళ్లారు. అక్కడే సుశీలను ఆమె భర్తను, తండ్రిని పోలీసులు అరెస్టు చేశారు. ఆ సమయంలో అనేక కష్టాలు అనుభవించారు. ఆలేరు నుండి జనగాం స్టేషన్‌ వరకు నడిపించుకుంటూ తీసుకెళ్లారు. 15 రోజుల తర్వాత శరభనాపురం చేరుకున్నారు. అరెస్టు చేసినవారందరినీ గుల్బర్గా జైలుకు తరలించారు.
ఆదరించేవారు లేక
వాస్తవానికి ఉద్యమ ప్రచారంలో పాల్గొన్నందుకే ప్రభుత్వం వీరిని అరెస్టు చేసింది. కానీ తన రక్షణార్ధం ఒక చిన్న తుపాకి సుశీల దగ్గర వుండేది. అది ఎప్పుడూ పేల్చిందే లేదు. ఆ తుపాకి వుందనే కారణం చూపి పోలీసులు ఆమెను అరెస్టుచేశారు. తొమ్మిది నెలలు జైల్లోనే ఉన్నారు. అప్పుడు సుశీల గర్భవతి. జైలు వాతావరణం, అక్కడి తిండివల్ల బాగా బలహీనమయ్యారు. ప్రసవం కోసం జైలు నుండి విడుదల చేశారు. అప్పుడు ఆమె పరిస్థితి చెప్పలేని విధంగా వుండేది. ఆదరించేవారు లేరు. మందులిచ్చి ఆదుకునేవారు. ఎందుకంటే వీరికి సహకరిస్తే ఏమౌతుందోనన్న భయం ప్రజల్లోవుండేది. తీవ్ర రక్తస్రావం జరిగి ఎంతో బలహీనమైనా, చావుబతుకుల మధ్యే సుశీల కొడుక్కు జన్మనిచ్చారు. అప్పటికీ భర్త జైల్లోనే వున్నారు. కొన్ని రోజుల విశ్రాంతి తర్వాత మళ్లీ ఉద్యమంలో పాలుపంచుకున్నాను.
ఉద్యమాన్ని వీడలేదు
సైన్యం నిర్బంధం, దాడులకు వ్యతిరేకంగా సంతకాలు సేకరించడం, కరపత్రాలు వేయడం, రచ్చబండ మీటింగ్‌లు పెట్టడం వంటివి చేసేవారు. మూడేండ్ల తర్వాత మిగతా కామ్రేడ్స్‌తో పాటు ఆమె భర్త కూడా విడుదలయ్యారు. ‘ఇన్ని కష్టాలు అనుభవించినా ఉద్యమం వైపునకు మరలడానికి కారణం నాడు వెట్టిచాకిరిపై పోరాడి రద్దుచేయగలగడమే. దీంతో ఎంతో మంది పేద, బలహీనవర్గాల వారు స్వేచ్ఛగా గాలి పీల్చుకున్నారు’ అంటారు ఆమె. రావి నారాయణరెడ్డి, ఆరుట్ల రామచంద్రారెడ్డి, రాజ్బాహుదూర్గెర్‌, బద్దం ఎల్లారెడ్డి తదితరులతో ఆమెకు బాగా పరిచయం. నాగలక్ష్మి, కృష్ణమూర్తి, భారతి, ఆరుట్ల కమలాదేవి ఈమె సహచరులు.

Spread the love