నవతెలంగాణ-ఆసిఫాబాద్
జిల్లా కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన మెడికల్ కళాశాలకు సిబ్బందితోపాటు వైద్యులను నియమించాలని ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవలక్ష్మి డిమాండ్ చేశారు. రాష్ట్ర వైద్య శాఖ సెక్రెటరీ క్రిస్టియాన చోంగ్డుకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లా కేంద్రంలోని మెడికల్ కళాశాలకు సిబ్బందితో పాటు వైద్యుల నియమించాలన్నారు. వైద్య కళాశాలలో 114 మంది ఉండాల్సింది కేవలం 7 మంది మాత్రమే ఉన్నారని దీంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాలోని సామాజిక ఆస్పత్రికి శాశ్వత సూపరింటెండెంట్ లేకపోవడంతో పాలన కొరవడిందని, శాశ్వత ప్రాతిపదికన సూపరింటెండెంట్లను నియమించాలని కోరారు. అనేకమంది గర్భిణలు అనీమీయాతో బాధపడుతున్నారని వారికి పౌష్టికాహారం అందించాల్సిన అవసరం ఉందన్నారు. శానిటేషన్ సిబ్బంది ఆరు నెలల నుండి వేతనాలు పెండింగ్‌లో ఉన్నాయని వారికి ఎప్పటికప్పుడు వేతనాలు చెల్లించాలన్నారు.