నిజాయితీగా పనిచేసే నాయకున్ని ఎన్నుకోండి

 Adilabad– సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు మల్లికార్జున్‌
నవతెలంగాణ-కాగజ్‌నగర్‌
మోసపూరిత వాగ్దానాలు చేసే రాజకీయ నాయకుల ఉచ్చులో పడి మోసపోకుండా నిజాయితీగా కార్మికులలో పనిచేసే నాయకుడిని ఎన్నుకొవాలని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మల్లికార్జున్‌ అన్నారు. సిర్పూర్‌ పేపర్‌ మిల్‌ మజ్దూర్‌ యూనియన్‌ (సీఐటీయూ) రన్‌ గ్రాండ్‌ లాడ్జిలో నిర్వహించిన కార్మికుల జనరల్‌ బాడీ సమావేశానికి హాజరై కార్మికులకు మొదట అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మికులలో పనిచేసే ట్రేడ్‌ యూనియన్‌ నాయకులకు యజమాన్యంతో బేరమాడే శక్తితో పాటు విషయ పరిజ్ఞానం, నిజాయితీ ఉండాలన్నారు. పేపర్‌ మిల్లు చరిత్ర చాలా గొప్పదని ఇప్పటివరకు కార్మిక నాయకులుగా గెలిచినవారు కూడ పెద్దపెద్ద నాయకులు అయి ఉంటారని, మళ్లీ సంజీవరెడ్డిని అధ్యక్షుడిగా పోటీ చేయమని రమ్మంటే వస్తాడని తెలిపారు. మరొక నాయకుడు అధ్యక్షునిగా గెలిపిస్తే భద్రాచలం పేపర్‌ మిల్లు వేతనాలు ఇప్పిస్తానని అంటున్నాడని అతను గతంలో ఇదే మిల్లులో అధ్యక్షునిగా గెలిచినప్పుడు భద్రాచలం పేపర్‌ మిల్లు లేదా అని ప్రశ్నించారు. అప్పుడు ఇప్పించని భద్రాచలం వేతనాలు ఇప్పుడు ఇప్పిస్తాడా..? మోసపూరిత మాటలు, వాగ్దానాలకు కార్మికులు మోసపోవద్దని కోరారు. ట్రేడ్‌ యూనియన్‌లో అనుభవం లేని రాజకీయ నాయకులను, ఎంపీలు, ఎమ్మెల్యేలుగా ఉన్న వారిని గెలిపిస్తే మోస పోతారని, గతంలో పెద్దపెద్ద నాయకులను గెలిపించుకొని మోసపోయారని గుర్తు చేశారు. దేశంలోని జెకె పేపర్‌ మిల్లు కార్మికుల వేతనాలతో పాటు ఇతర పేపర్‌ మిల్లు కంపెనీల వేతనాలు మన సిర్పూర్‌ పేపర్‌ మిల్లు కార్మికులకు తెలిసి ఉండాలని, సీఐటీయూని ఆదరించి గెలిపిస్తే ఆ సమాచారం మీ ముందు ఉంచి మెరుగైన వేతనాలు ఇప్పిస్తామన్నారు. మిల్లు మూత బడి తిరిగి తెరుచు కున్నప్పుడు పాత కార్మికులందరిని దశలవారీగా అందరినీ వీధిలోకి తీసుకోవాల్సి ఉండగా కొంతమంది కార్మికులను విధుల్లోకి తీసుకోలేదని, వారి స్థానాలలో కాంట్రాక్ట్‌ కార్మికులను నియమించటం చట్టవిరుద్దమన్నారు. ఒక కంపెనీలో ఒకసారి గెలిచిన యూనియన్‌ రెండవసారి గెలవటమే కష్టమని నేను వరుసగా నాలుగు సార్లు గెలిచి కార్మికులకు మెరుగైన వేతనం ఇప్పించి వారి జీవితాలలో వెలుగులు నింపానని, అందుకే తనను ఆదరించి వరుసగా గెలిపిస్తున్నారని, సిర్పూర్‌ పేపర్‌ మిల్లులో కూడా సీఐటీయూ జెండాను ఎగరవేసి మెరుగైన వేతనాలు పొందాలని కార్మికులకు సూచించారు. సమావేశంలో సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు భూపాల్‌, రాష్ట్ర కోశాధికారి వంగూరి రాములు, ఎస్పీఎం మజ్దూర్‌ యూనియన్‌ ప్రధాన కార్యదర్శి కూశన రాజన్న, ఉపాధ్యక్షులు ముంజం శ్రీనివాస్‌, అంగల శ్రీనివాస్‌, రాజన్న, గడమళ్ళ మహేష్‌, రమేష్‌. రాజేందర్‌, సిర్పూర్‌ పేపర్‌ మిల్లు కార్మికులు పాల్గొన్నారు.

Spread the love