ఇంటర్‌నెట్‌ సేవలు ఇంకెప్పుడు..?

Internet services when again..?– ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రజల ఇబ్బందులు
– వ్యాపారస్తులకు తగ్గిన గిరాకీ
– ఆర్థిక ఇబ్బందుల్లో ఆన్‌లైన్‌ సెంటర్ల నిర్వాహకులు
నవతెలంగాణ-ఆసిఫాబాద్‌
ప్రస్తుతం పెరుగుతున్న ఆన్‌లైన్‌ విధానంతో పాటు ఇంటర్‌నెట్‌ ఉపయోగం నేపథ్యంలో మనిషి ప్రతి వ్యవహారం ఇంటనెట్‌తో ముడిపడి ఉందనేది జగమెరిగిన సత్యం. ప్రస్తుతం ఇదే ఏజెన్సీ ప్రాంతాల్లో శాపంగా మారింది. రానున్న రెండు రోజుల్లో ఇంటర్నెట్‌ సేవలు పునరుద్ధరించడం జరుగుతుందని అధికారులు శనివారం ప్రకటించారు. 26 రోజులుగా ఇంటర్‌నెట్‌ సేవలు లేకపోవడంతో ప్రజల అవస్థలు పడుతున్నారు.
ఇంటర్నెట్‌ సేవలు ఇంకెప్పుడు..?
జిల్లాలోని జైనుర్‌లో ఈ నెల 4న జరిగిన సంఘటన నేపథ్యంలో సామాజిక మాధ్యమాలపై నియంత్రణలో భాగంగా జిల్లా అధికారులు జిల్లా వ్యాప్తంగా ఇంటర్‌నెట్‌ సేవలు నిలిపివేశారు. తర్వాత ఐదు రోజుల్లో కాగజ్‌నగర్‌ డివిజన్‌తో పాటు ఆసిఫాబాద్‌, రెబ్బెన, వాంకిడి మండలాల్లో ఇంటర్‌నెట్‌ సేవలు పునరుద్ధరించిన ఏజెన్సీ మండలాల్లో నేటికీ సేవలు పునరుద్ధరించకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. శనివారం జోడేఘాట్‌లో జరిగిన భీమ్‌ వర్ధంతి వేడుకల సన్నాహక సమావేశంలో ఎమ్మెల్యే కోవలక్ష్మి కూడా ఇదే విషయం ప్రస్తావనకు తీసుకురాగా, రెండు రోజుల్లో పునరుద్ధరిస్తామని జిల్లా అధికారులు తెలిపారు.
ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రజల ఇబ్బందులు
ప్రపంచం ఎంతో ముందుకు పోతున్న తరుణంలో అభివృద్ధికి ఆమడ దూరంలో ఏజెన్సీ ప్రాంతాలుంటున్నాయి. ప్రస్తుతం ఇంటర్‌నెట్‌ సేవలు కూడా నిలిపివేయడంతో బాహ్య ప్రపంచంలో ఏం జరుగుతుందో కూడా ఆ ప్రాంతంలో తెలియకపోవడంతో మునిగే నక్కపై తాటికాయ పడ్డట్టు ఏజెన్సీ ప్రాంతాల పరిస్థితి తయారైంది. ఇంటర్‌నెట్‌ సేవలు నిలిపేయడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
వ్యాపారస్తులకు తగ్గిన గిరాకులు
ప్రతి వస్తువుకు సంబంధించి ఆన్‌లైన్‌ మార్కెట్‌ పెరగడంతో పాటు ప్రభుత్వం పేపర్‌ మనీ వాడకం తగ్గించే ఉద్దేశంతో నగదు సేవలన్నింటిని ఆన్‌లైన్‌లోకి తీసుకువచ్చి ఫోన్‌ పే, గూగుల్‌ పే లాంటిది అలవాటు చేసింది. దీంతో ప్రస్తుతం చిన్న పండ్ల వ్యాపారి దగ్గర నుండి పెద్ద దుకాణాల వరకు వీటిపైన ఆధారపడుతున్నాయి. ఆన్‌లైన్‌ సేవలు లేకపోవడంతో అత్యావసరమైతేనే ప్రజలు పేపర్‌ మనీ వాడడంతో గిరాకులు తగ్గినట్లు ఏజెన్సీ ప్రాంతాల్లోని వ్యాపారస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఆర్థిక ఇబ్బందుల్లో ఆన్‌లైన్‌ సెంటర్‌ నిర్వాహకులు
ఇంటర్‌నెట్‌ సేవలు నిలిపివేత ఇతర వ్యాపారాలపై ఒక 50 నుండి 60శాతం ప్రభావం చూపెడితే, ఆన్‌లైన్‌ సెంటర్లపై 100శాతం ప్రభావం చూపెట్టాయి. 26 రోజులుగా సెంటర్లను నిర్వాహకులు తెరవడం లేదు. వీటిపైనే ఆధారపడి జీవిస్తున్న ఏజెన్సీ ప్రాంత నిర్వహకులు ఆర్థిక ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయంపై ఇప్పటికే ఎస్పీ డీవీ శ్రీనివాసరావును కలిసి వినతిపత్రం కూడా అందజేశారు. మీసేవ, ఆన్‌లైన్‌ సెంటర్ల నిర్వాహకుల బాధలు వర్ణనాతీతంగా మారాయి.
ఇంటర్నెట్‌ సేవలు పునరుద్దరించాలి
అదే శంకర్‌, ఆన్‌లైన్‌ సెంటర్‌, నిర్వాహకుడు
26 రోజులుగా ఇంటర్‌నెట్‌ సేవలు నిలిపివేయడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. దీనిపైన ఆధారపడి జీవిస్తున్నాం. అధికారులు ప్రజాప్రతినిధులు స్పందించి ఇంటర్‌నెట్‌ సేవలు వెంటనే పునరుద్ధరించేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం.

Spread the love