పార్టీలకు అతీతంగా అభివృద్ధికి కృషి చేస్తా: ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి

నవతెలంగాణ ఆర్మూర్ 

పార్టీలకు అతీతంగా అభివృద్ధికి కృషి చేస్తానని ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి అన్నారు. పట్టణంలోని జంబి హనుమాన్ ఆలయ ప్రాంగణంలో దసరా ఉత్సవాలలో భాగంగా శనివారం రాత్రి జరిగిన కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. పట్టణ సర్వ సమాజ్ నిర్వహించిన వెంకటేశ్వర స్వామి రథోత్సవ కార్యక్రమంలో భాగంగా మున్సిపల్ చైర్ పర్సన్ వన్నెల్ దేవి లావణ్య అయ్యప్ప శ్రీనివాస్ కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. ఈ రథోత్సవం జెండా బాలాజీ మందిరం నుండి ప్రారంభమై అశోక్ నగర్, కింది బజార్ ద్వారా జంబియన్ మాన్ వరకు కొనసాగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలను పక్కకు పెట్టి ప్రజల సమస్యలను తీర్చేందుకు కృషి చేస్తానని అన్నారు. కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ చార్జ్ పొద్దుటూరి వినయ్ రెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గంలో 100 కోట్లతో ఇంటిగ్రేటెడ్ పాఠశాలలు తీసుకువచ్చేందుకు కృషి చేస్తానని, ఇట్టి విషయమై ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లినట్టు, గతంలో పట్టణానికి రేవంత్ రెడ్డి వచ్చి రైతు దీక్షలో పాల్గొన్న తర్వాత పిసిసి అధ్యక్షునిగా పదవి బాధ్యతలు స్వీకరించినారని, రైతన్నల సంక్షేమానికి ప్రభుత్వం తీవ్ర కృషి చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్లు, ఆలయ కమిటీ చైర్మన్ సత్యనారాయణ, మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లి , పెర్కిట్ ల కు చెందిన ప్రజల సైతం పాల్గొన్నారు. కాగా ఏ లాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా రూరల్ సీఐ శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో గట్టి పోలీస్ బందోబస్తు ఏర్పాట్లు చేసినారు.

Spread the love