సూర్యచంద్రులతోపాటు
నింగీ, నేలా, గాలి, నీరు, నిప్పు
అత్యవసర సమావేశం ఏర్పాటు చేసుకొన్నాయి
దుఃఖపడినంతసేపు దుఃఖపడి
ఒక్కసారిగా తలలు పైకెత్తి నినదించాయి
ఆగిపోయిన రెండుచక్రాల కుర్చీకి తామే కాళ్ళుగా మారి
అనేకానేక పాదాలుగా విస్తరించి
వయసుతోపాటు ఎదగని
అజ్ఞానపు మేధ మెదళ్ళలో
జ్ఞాన వక్షాలను నాటాలని
ఏకగ్రీవ తీర్మానం చేసుకున్నాయి
బాధాతప్త దేహాలకు భరోసావాక్యాన్నిచ్చాయి
ఒంటరితనాన్ని జయించిన ఆ రెండు కళ్ళు,
చచ్చుబడిన రెండు కాళ్ళు
సగం దేహం-
నిబంధిత నిశ్శబ్దాన్ని ఛేదించుకొని
అగాధపు ఆకసాల్లోంచి
పునరుత్థానం పొందిన
జీవనదిలా ప్రవహిస్తున్నాయిప్పుడు.
(ప్రొఫెసర్ కె.యన్. సాయిబాబా స్మతిలో)
– విల్సన్‌రావు కొమ్మవరపు, 8985435515