– కేంద్ర ప్రభుత్వ విధానాలను నిలువరించాలి
– టీయూసీఐలో ఐఎఫ్టీయూ విలీనం సందర్భంగా జాతీయ ఉపాధ్యక్షులు అలీక్ చక్రవర్తి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
కార్మిక వర్గాన్ని ఐక్యంగా నిలబెట్టటమే ట్రేడ్ యూనియన్ల తక్షణ కర్తవ్యమని టీయూసీఐ జాతీయ ఉపాధ్యక్షులు అలీక్ చక్రవర్తి అన్నారు. ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా (టీయూసీఐ)లో ఐఎఫ్టీయూ విలీనమైన సందర్భంగా ఆదివారం హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సభను నిర్వహించారు. ఈ సందర్భంగా కార్మిక చట్టాలను నవీనీకరణ చేస్తున్నామనే సాకుతో 29 కార్మిక, ప్రయోజన సంక్షేమ చట్టాలను ”4 లేబర్ కోడ్లు”గా మార్చిన కేంద్ర ప్రభుత్వం… కార్మిక హక్కులను హరించేందుకు యత్నించిందని ఆందోళన వ్యక్తం చేశారు. కార్మిక సంఘాన్ని ఏర్పాటు చేస్తేనే సహించని అనేక యజమాన్యాలు నేటికీ దేశంలో ఉన్నాయని చెప్పారు. తమిళనాడులోని శాంసంగ్ కంపెనీ కార్మికులు యూనియన్ ఏర్పాటు చేసుకుంటే వారిని విధుల్లోంచి తొలగించారని గుర్తు చేశారు. ఆ విధంగా ప్రభుత్వాలు యజమాన్యాలకు వత్తాసుగా మారి, కార్మిక వ్మతిరేక విధానాలను అనుసరిస్తున్న నేపథ్యంలో ఆ వర్గం మరింత ఐక్యంగా ఉద్యమించాల్సిన అవసరముందని ఆయన పిలుపునిచ్చారు. టీయూసీఐ జాతీయ ఉపాధ్యక్షులు ఉమాకాంత్ మాట్లాడుతూ తెలంగాణలోని అనేక రంగాల్లో పనిచేస్తున్న ఐఎఫ్టీయూ… టీయూసీఐలో విలీనం కావటం ఆహ్వానించదగిందన్నారు. ప్రస్తుతం దేశంలోని కార్మికులు చాలీచాలని జీతభత్యాలు, భద్రతలేని బతుకులతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. శ్రమజీవులకు సరైన భద్రత, శ్రమకు తగ్గ వేతనాలు, హక్కుల అమలు కోసం ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ఆ పోరాటాలు సంఘటితంగా ఉంటేనే ప్రభుత్వాలు తలొగ్గుతాయని నొక్కి చెప్పారు. కార్యక్రమంలో పాల్గొన్న సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ మాట్లాడుతూ…కేంద్రలో బీజేపీ మూడోసారి అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో కార్మికవర్గం మరింత ఐక్యంగా, సమరశీలంగా పోరాటాలు నిర్వహించాల్సిన అవసరముందని సూచించారు. ఇందుకోసం ట్రేడ్ యూనియన్లు వారిని మరింత చైతన్యపరచాల్సిన అవసరముందని పిలుపునిచ్చారు. ఐఎఫ్టీయూ రాష్ట్ర అధ్యక్షులు వి కృష్ణ అధ్యక్షతన జరిగిన ఈ సభలో టీయూసీఐ జాతీయ కార్యదర్శి దేవబ్రత శర్మ, ఐఎఫ్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సూర్యం, ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాలరాజ్, హెచ్ఎంస్ రాష్ట్ర కార్యదర్శి రెబ్బా రామారావు తదితరులు పాల్గొని ఐక్య ఉద్యమాల ప్రాధాన్యతను వివరించారు.