పిల్లల కోసం రంగుల కథల జండా

పిల్లల కోసం రంగుల కథల జండా‘దేశమంటే మట్టి కాదోరు – దేశమంటే మనుషులోరు!’ అన్న గురజాడ వారి గేయం పసి మనస్సుల్లో సైతం దేశం పట్ల ప్రేమను, గౌరవాన్ని కలిగిస్తుంది. మువ్వన్నెల జెండాకు సలాం కొట్టిస్తుంది. చేయి చేయి పట్టుకుని కలిసి నడిచే స్ఫూర్తిని కలిగిస్తుంది. మనిషి అంటే ఇలా నడుచుకోవాలన్న మార్గాన్ని చూపిస్తుంది. కారణాలు ఏవైనా నేడు మనం ఇలాంటి గేయాల్ని పాడుకోవటం ఆపేశాం. దేశమంటే మనుషులన్న సంగతి కూడా మర్చిపోయామేమో అనిపిస్తుంది. ‘దేశమంటే వ్యవస్థ’గా చూసే స్థాయికి మనం పురోగమించాం. వ్యవస్థలో పని చేసే యంత్రాలుగా కాలచక్రంలో పడి తిరుగుతున్నాం. ఏ అసాంఘిక ఘటనో, ప్రకతి వైపరీత్యాలో, ఉగ్రవాద దాడులో జరిగినప్పుడు మాత్రమే ఉలిక్కిపడతాం. మనకేదైనా అయితేనన్న భయమే మనం మనుషులమన్న సంగతి గుర్తుచేస్తుంది. అప్పుడు సమాజంలో మంచిచెడుల గురించి, దేశ స్థితిగతుల గురించి, ముఖ్యంగా పిల్లల భవిత గురించి మాట్లాడతాం. అప్పుడు మాత్రమే దేశమంటే మట్టి కాదని… మనుష్యులని గుర్తుకొస్తుంది. ఆ మనుష్యులలో మనం కూడా ఉన్నామని మరిచిపోతాం. దేశ పౌరుల హక్కుగా ప్రభుత్వాల్ని దుయ్యబడతాం. వ్యక్తుల్ని దూషిస్తాం. దేశం పట్ల మన బాధ్యతని మాత్రం విస్మరిస్తాం.
మహావక్షాలు సైతం మొక్క దశ నుండే ఎదుగుతాయి. సమాజంలో మంచిచెడులు కూడా అంతే! నేటి దేశ భవితను నిర్ణయించేది నిన్నటి బాల్యమే. బాల్యమే భావి జీవితానికి పునాది. అందమైన బాల్యం అంటే అడిగినవన్నీ కొనివ్వడం కాదు. రేపటి జీవితాన్ని స్వతంత్రంగా, బాధ్యతగా జీవించే భరోసానిచ్చే బాల్యాన్ని అందివ్వగలగాలి. అందుకే గురజాడ వంటి మహాకవులు బాల్యంలోనే పిల్లల మనస్సులో దేశభక్తికి బీజం వేసి, మువ్వన్నెల జెండాను చేత పట్టే పౌరులుగా చేయడం కోసం గేయాల రూపంలో బాలసాహిత్య సజన చేశారు. బాల సాహిత్యం నేటి బాల్యంలో వినోదాన్ని, విజ్ఞానాన్ని పంచితే రేపటి భవితలో విలువలను, విషయజ్ఞానాన్ని పెంపొందిస్తుంది. ఈ విషయాలన్నీటినీ దష్టిలో పెట్టుకుని డా. అమరవాది నీరజ ‘ఏడు రంగుల జెండా’ కథల సంపుటిని బాలల చేతిలో పెట్టారు. దీనిని రచయిత్రి బాలల కోసం ‘వినోదం, విజ్ఞానం, విద్య, వికాసం, విలువలు, వినయవిధేయతలు, విశాల దక్పథం’ అనే అంశాలను ఏడు రంగులుగా ఎంచుకుని ఈ కథల సంపుటిని ముస్తాబు చేశారు.
తెలుగునేల మీదే కాదు ఇవ్వాళ్ళ దేశ వ్యాప్తంగా అన్ని భారతీయ భాషల్లో బాల సాహిత్యం ఇప్పుడు బాగా వస్తోంది. ఇది బాలలకు, బాలల గురించి ఆలోచించే వారికి శుభవార్తే కాదు, చక్కని సందర్భం కూడా. ఇతర భాషల్లో ముఖ్యంగా ఇంగ్లీష్‌, బెంగాళీ, మలయాళం, మన పక్కనే ఉన్న కన్నడ భాషల్లో వస్తున్న వాటిలో ఎక్కువగా ఫాంటసీలను దాటి వాస్తవ సంఘటనలు, పిల్లలు ప్రతి రోజు వారివారి నిజ జీవితాల్లో చూస్తున్న సంఘటనలు ఇతివృత్తాలుగా ఉండడం వంటివి ఉంటున్నాయి. మానసిక శాస్త్రవేత్తలు, బాల సాహితీవేత్తల అభిప్రాయం ప్రకారం ఈ కోవలోని రచనలు బాలలను ఎక్కువగా ఆలోచింప జేయడమే కాక దృఢపరుస్తాయి కూడా. తెలుగులోనూ ఈ ట్రెండ్‌ ఇటీవల బాగా కనిపిస్తోంది.
కథ అంటే తమను నవ్వించాలని, మురిపించాలని, ముచ్చట్లు చెప్పాలని పిల్లలు ఆశ పడతారు. పేజీలో ఎనభై శాతం బొమ్మలతో పిల్లల్ని ఆకట్టుకునే చక్కని కథల పుస్తకం ఇది. కథలో వస్తువు పిల్లల మనసుని మెప్పించాలి. ఉగ్గుతో రుచి చూపిస్తేనే కదా అన్నానికి అలవాటు పడేది. కథను వినోదభరితంగా నడిపిస్తూ విషయ జ్ఞానాన్ని కలిగించేలా రాయడంలో రచయిత్రి నేర్పరితనం కనిపిస్తుంది. ‘ఆటల్లో అరటిపండు’ కథా శీర్షికతో పిల్లల్ని ఆకర్షించి కథలో ఒక పిల్లవాడి మనస్తత్వాన్ని ఆవిష్కరించారు. ఆటల్లో వచ్చే సమస్యను ఎదుర్కొనే రీతిని తార్కికంగా తెలియపరిచారు. ఇదే కదా నేటి పిల్లలు ప్రధానంగా నేర్చుకోవలసినది! ఆట పట్టిస్తూ ఏడిపించే వాళ్ళను ఎదుర్కోలేక, నలుగురితో కలవలేక అమ్మ కొంగుచాటున కన్నీళ్ళతో నిలబడుతున్న చిన్నారులెందరో ఉన్నారు. వాళ్ళకు ఇలాంటి కథల ద్వారా ధైర్యాన్నివ్వాల్సిన బాధ్యత మనపై ఉంది.
పిల్లల మనోవికాసానికి చదువుతో పాటు ఆటలూ అంతే ముఖ్యమనే విషయం అందరికీ తెలుసు. కానీ పిల్లల్ని ప్రోత్సహించే సంస్కతి మాత్రం మన దగ్గర లేదు. ఒలింపిక్స్‌లో గెలిచిన వాళ్ళకు చప్పట్లు కొడతాం గానీ మనతో పాటు ‘గెలుపు చప్పట్లు’ వింటున్న పిల్లల గుండె చప్పుడు మనకు వినపడదు. వాళ్ళకు ఏ ఆట ఇష్టమో తెలియదు. ఎందులో నైపుణ్యం ఉన్నా మనకు అనవసరం. కాగితాల్లో కనపడే రాతలే వాళ్ళ రాతను నిర్ణయిస్తాయని ఈ సాంకేతిక యుగంలో కూడా నమ్ముతున్నాం. పిల్లల ఇష్టాన్ని ఒక్కసారి నమ్మి వాళ్ళను ఆటల్లో కూడా ప్రోత్సహించాలని తెలిపే ‘గెలుపు చప్పట్లు’ కథకు మనస్ఫూర్తిగా చప్పట్లు. మన కళ్ళ ముందు పుట్టిన పిల్లలకు ఏమీ తెలియదనే భ్రమలో గడపడానికే మనం ఓటేస్తాం. కానీ పెద్దవాళ్ళకు కూడా లేని సునిశిత పరిశీలన పిల్లలకుంటుంది. వాళ్ళ వ్యక్తికరణలో స్పష్టత ఉండదేమో గానీ ఆలోచనలు మాత్రం చాలా స్పష్టంగా ఉంటాయి. కుటుంబం అంటే అమ్మానాన్న మాత్రమే కాదు తాతయ్యలు, నానమ్మలు, అమ్మమ్మలు కూడా ఉండాలనే ఒక పిల్లాడి ఆలోచనని కథగా మలిచి ‘బహుమతి’ రూపంలో పిల్లలకు అందించారు రచయిత్రి. ఉమ్మడి కుటుంబాల ఉనికి మన దేశ సంస్కతికి పునాది అని పిల్లల్లో నాటుకుపోయే కథ.
రచయిత్రి నీరజ తెలుగు సాహిత్యంలో ఆధునిక అంశాలపై పరిశోధనలు చేసినప్పటికీ ప్రాయికంగా బాల సాహితీవేత్త. మాంటిస్సోరి నిపుణురాలు. తల్లిగా పిల్లల గురించి వాళ్ళ మనస్తత్వం గురించి అనుభవైకమే అయినప్పటికీ తాను చదివిన మనోవైజ్ఞానిక దృష్టి కోణాన్ని తన ప్రతి కథలో చూపిస్తారు. అంబాడే వయసులో పిల్లల్ని ముద్దు చేసినట్టు ఆడుకునే వయసులో గారం చేయం. వయసును బట్టి పెంపకంలో మార్పులు చోటు చేసుకుంటాయి. మనకు అవి పెద్ద మార్పులుగా అనిపించవు గానీ పిల్లల మనస్సులో పెను తుఫాన్లే సష్టిస్తాయి. లేత మనసుల్ని ఒత్తిడి చేసి వాళ్ళను ఇబ్బంది పెడుతుంటాయి. ఇలాంటి చిన్న చిన్న అభద్రతా భావాలను స్పశిస్తూ సజించిన కథ ‘ఏడు రంగుల జెండా’. ఇందులో ఒడిదుడుకులను తట్టుకుని నిలబడితే ఇంద్రధనుస్సులా జీవితం మెరుస్తుందని చెప్పడం చాలా బాగుంది. ఇంకా ఎదుగుతున్న పిల్లల ఆలోచనలు, అపోహలు, భయాలు అన్నీటినీ విశ్లేషించి వాటికి సమాధానాలను కథల రూపంలో చెప్పిన నేర్పు మనకు ప్రతీ కథలోనూ కనిపిస్తుంది. రచయిత్రి ఉపాధ్యాయురాలు కావడంతో పిల్లల మనసుల్ని బాగా అర్ధం చేసుకుని ఈ కథల సంపుటిని రూపొందించారనడానికి నిదర్శనం.
ఎవరికివారే యమునా తీరే అన్న రీతిలో గడుస్తున్న మన దైనందిక జీవితాల వలన పిల్లలు కూడా ఒక్కరే గడపడానికి ఇష్టపడుతున్నారు. ఇతరులతో కలవలేకపోవడం, వాళ్ళ మాటే నెగ్గాలన్న పట్టుదలతో స్నేహలను కోల్పోయి ఒంటరితనంలో దొరకని సంతోషాన్ని వెతుకుతూ నీరసపడుతున్నారు. ‘కలసి ఉంటే కలదు సుఖం’ అనే పాత సామెతలో సారాన్ని ‘మ్యాజిక్‌ పుస్తక’ కథలో గమ్మత్తుగా చెప్పారు. పదేళ్ళు దాటిన పిల్లల సమగ్ర వికాసానికి అవసరమయ్యే ప్రతీ అంశాన్ని కథా వస్తువుగా ఎంచుకుని ‘ఏడు రంగుల జెండా’ను అందంగా అలంకరించారు. ఏడేళ్ల వయసులో ఈ ‘ఏడు రంగుల జెండా’ను చేత బట్టిన బాలలు రేపు మువ్వన్నెల జెండాను పట్టే బాధ్యతగల పౌరులవుతారానడంలో సందేహం లేదు. ఈ దిశగా తన అక్షరాన్ని, ఆలోచనలను, ఆశలు, ఆశయాలను బాలల పరం చేసిన, చేస్తున్న డా. అమరవాది నీరజ కథలు బాలలకు అచ్చంగా వెన్నుతట్టే మాటలు… దారిచూపే చుక్కలు…. రేపటి కోసం చూపునిచ్చే సులోచనాలు.
– డా. హారిక చెరుకుపల్లి 9000559913

Spread the love