– మూడు నెల్లకోసారి లైజన్ ఆఫీసర్లతో నిర్వహించాలి
– రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మెన్ బక్కి వెంకటయ్య
-12న ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల లైజన్ సెల్ ప్రారంభం : సింగరేణి సీఎండీ ఎన్. బలరామ్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
సింగరేణి సంస్థలో పని చేస్తున్న ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి మూడు నెల్లకోసారి లైజన్ ఆఫీసర్లతో ప్రత్యేక సమీక్షా సమావేశాన్ని నిర్వహించాలనీ, ప్రమోషన్లు, పోస్టింగులలో ఈ వర్గాలకు ఎటువంటి అన్యాయం జరగకుండా చూడాలని తెలంగాణ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మెన్ బక్కి వెంకటయ్య ఆదేశించారు. సోమవారం హైదరాబాద్‌లోని సింగరేణి భవన్‌లో జరిగిన కమిషన్ సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సమావేశంలో సింగరేణి సంస్థ చైర్మెన్, ఎమ్‌డి ఎన్.బలరామ్, కమిషన్ సభ్యులు, ఎస్సీ, ఎస్టీ లైజన్ ఆఫీసర్లు, ఉద్యోగ సంక్షేమ సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వెంకటయ్య మాట్లాడుతూ అధికారులకు ప్రమోషన్లు కల్పించే కమిటీ, రక్షణ కమిటీల్లోనూ ఎస్సీ, ఎస్టీ కులాల నుంచి కనీసం ఇద్దరిని సభ్యులుగా చేర్చాలని సూచించారు. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ సేవలకు గుర్తింపుగా ఆయన విగ్రహాలను ప్రతీ జీఎం కార్యాలయంలో ఏర్పాటు చేయాలనీ, అవసరమైతే ఈ విషయంలో ప్రభుత్వం తరఫున మాట్లాడి సహకరిస్తామని వివరించారు. కమిషన్ దృష్టికొచ్చిన సమస్యలను కూడా పరిష్కరించాలని సూచించారు. బలరామ్ మాట్లాడుతూ కమిషన్ చైర్మెన్ సూచించిన విధంగా మూడు నెల్లకోసారి సింగరేణీలో ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి సమీక్షా సమావేశాలు నిర్వహిస్తామని హామీ ఇచ్చారు. ప్రతీ సమస్యను నిబంధనలు మేరకు పరిష్కరించేందుకు కృషి చేస్తామని తెలిపారు. సింగరేణి ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల లైజన్ సెల్ కార్యాలయాన్ని కొత్తగూడెం హెడ్ ఆఫీస్‌లో ఏర్పాటు చేశామనీ, వచ్చే నెల 12న దాన్ని ప్రారంభించనున్నట్టు తెలిపారు. సమావేశంలో కమిషన్ సభ్యులు రాంబాబు నాయక్, కొంకటి లక్ష్మీనారాయణ, జిల్లా శంకర్, రేణిగుంట్ల ప్రవీణ్‌తో పాటు సింగరేణి అధికారులు పాల్గొన్నారు.