– పది నుంచి హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌కు అవకాశం : టీజీపీఎస్సీ కార్యదర్శి నవీన్ నికోలస్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలో గ్రూప్-3 పోస్టుల భర్తీకి సంబంధించి వచ్చేనెల 17,18 తేదీల్లో రాతపరీక్షలను నిర్వహించనున్నట్టు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) ప్రకటించింది. ఈ మేరకు టీజీపీఎస్సీ కార్యదర్శి ఈ నవీన్ నికోలస్ బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. వచ్చేనెల 17న రెండు విడతల్లో ఉదయం, మధ్యాహ్నం, 18న ఒకే విడత ఉదయం మాత్రమే రాతపరీక్షలను నిర్వహిస్తామని తెలిపారు. అదేనెల పదో తేదీ నుంచి టీజీపీఎస్సీ వెబ్సైట్ ద్వారా హాల్‌టికెట్లను డౌన్లోడ్ చేసుకునేందుకు అవకాశముం దని వివరించారు.
వచ్చేనెల 17న మొదటి పరీక్ష ప్రారంభమయ్యే వరకు హాల్‌టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చని సూచించారు. మొదటి విడతలో ఉదయం పది నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్షను నిర్వహిస్తామని వివరించారు. ఉదయం 8.30 నుంచి పరీక్షా కేంద్రాల్లోకి అభ్యర్థులకు అనుమతి ఉంటుందని తెలిపారు. ఉదయం 9.30 గంటలకు గేట్లు మూసివేస్తామని పేర్కొన్నారు. ఆ తర్వాత వచ్చిన అభ్యర్థులను పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించబోమని స్పష్టం చేశారు. రెండో విడత మధ్యాహ్నం మూడు నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు జరుగుతుందని తెలిపారు. మధ్యాహ్నం ఒకటిన్నర నుంచి అభ్యర్థులకు పరీక్షా కేంద్రాల్లోకి అనుమతి ఉంటుందని పేర్కొన్నారు. మధ్యాహ్నం 2.30 గంటల వరకే అభ్యర్థులను అనుమతిస్తామనీ, ఆ తర్వాత వచ్చిన వారికి అనుమతి ఉండబోదని స్పష్టం చేశారు. మొదటి రోజు తెచ్చిన హాల్‌టికెట్‌ను మిగతా రోజు జరిగే పరీక్షకు తేవాలని సూచించారు. నిబంధనలను పాటించాలని కోరారు. సాంకేతికంగా ఏమైనా సమస్యలుంటే టీజీపీఎస్సీ హెల్ప్‌డెస్క్ 040-23542185, 040-23542187 నెంబర్లతోపాటు [email protected] ను సంప్రదించాలని సూచించారు. తెలంగాణ తొలి గ్రూప్-3 ద్వారా 1,388 పోస్టుల భర్తీకి టీఎస్పీఎస్సీ 2022, డిసెంబర్ 30న నోటిఫికేషన్‌ను విడుదల చేసిన విషయం తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 5,36,477 మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారు.