డెడికేటెడ్‌ కమిషన్‌ చైర్మెన్‌గా రిటైర్డ్‌ ఐఏఎస్‌ వెంకటేశ్వరరావు

– రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ
నవతెలంగాణ బ్యూరో- హైదరాబాద్‌
బీసీ రిజర్వేషన్ల ఖరారు కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక డెడికేటెడ్‌ కమిషన్‌కు చైర్మెన్‌గా రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి బూసాని వెంకటేశ్వరరావును ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం సోమవారం జీవో నెంబర్‌ 49 జారీ చేశారు. హైకోర్టు ఆదేశాల మేరకు కమిషన్‌ ఏర్పాటు చేస్తున్నట్టు ఉత్తర్వుల్లో వెల్లడించింది. రాష్ట్రంలో ఈ నెల 6నుంచి కుల గణన సర్వే ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో బీసీ రిజర్వేషన్లకు సంబంధించి భవిష్యత్తులో ఇబ్బందులు రాకుండా, న్యాయపరమైన చిక్కులు తలెత్తకుండా సర్కార్‌ కమిషన్‌ను ఏర్పాటు చేసింది. కులగణన, స్థానిక సంస్థల రిజర్వేషన్ల విషయంలో హైకోర్టు లేవనెత్తిన అంశాలపై ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన సమీక్షించిన విషయం విదితమే. ప్రభుత్వానికి ఎలాంటి భేషజాలు లేవనీ, స్థానిక సంస్థల రిజర్వేషన్ల విషయంలోనూ పారదర్శకంగా వ్యవహరించాలని సీఎం అధికారులకు సూచించిన నేపథ్యంలోనే డెడికేటెడ్‌ కమిషన్‌ను ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. కాగా నెల రోజుల వ్యవధిలో కమిషన్‌ రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక అందించనుంది.

Spread the love