– వరల్డ్ ట్రావెల్ ఈవెంట్‌లో మంత్రి జూపల్లి పిలుపు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
తెలంగాణ పర్యాటక రంగంలో విరివిగా పెట్టుబడులు పెట్టాలని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పిలుపునిచ్చారు. మంగళవారం లండన్‌లో ప్రారంభమైన వరల్డ్ ట్రావెల్ మార్కెట్ ఈవెంట్‌లో యూకేలో భారత హై కమిషనర్ విక్రమ్ దురైస్వామి, కేంద్ర పర్యాటక శాఖ డీజీ ముగ్ధ సిన్హాతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఎన్నో చారిత్రక, సహజ సిద్ద పర్యాటక కేంద్రాలను గుర్తించి అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని చెప్పారు. ఈ కార్య క్రమంలో భాగస్వామ్యం కావాలని కోరారు. లండన్ టీ ఎక్ఛ్సేంజ్ చైర్మెన్ ఆల్యూర్ రెహ మాన్‌తో మంత్రి జూపల్లి ఈ సందర్భంగా ప్రత్యేకంగా భేటీ అయ్యారు. పెట్టుబడులు, హైదరాబాద్ లో టీ ఎక్స్చేంజ్ ఔట్‌లెట్, లండన్ ఐ తరహాలో హైదరా బాద్‌లో జాయింట్ వీల్ ఏర్పాటు తదితర అంశాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మెన్ పటేల్ రమేష్‌రెడ్డి, ఎమ్మెల్యేలు బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, కసిరెడ్డి నారాయణరెడ్డి, డా.వంశీకృష్ణ, డా.రాజేష్‌రెడ్డి, అనిరుద్‌రెడ్డి పర్యాటక శాఖ ముఖ్య కార్యదర్శి ఎన్ శ్రీధర్, మేనేజింగ్ డైరెక్టర్ ప్రకాష్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.