రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్న కేంద్ర ప్రభుత్వం

The central government is causing trouble to the farmers– కలెక్టరేట్ ఎదుట అఖిలపక్షం రైతు సంఘం ధర్నా
– తేమ మినహాయింపుతో కొనుగోలు చేయాలి
– సంఘం కన్వీనర్ బండి దత్తాత్రి
నవతెలంగాణ – ఆదిలాబాద్ టౌన్
పత్తి రైతులకు కనీస మద్దతు ఇవ్వకుండా కేంద్ర ప్రభుత్వం ఇబ్బందులకు గురి చేస్తుందని అఖిల పక్షం రైతు సంఘం కన్వీనర్ బండి దత్తాత్రి అన్నారు. తేమ మినహయింపుతో పత్తిని కొనుగోళు చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం కలెక్టర్ కార్యాలయం ఎదుట టెంట్ వేసుకొని ధర్నా నిర్వహించారు. ఆయా పార్టీల రైతు సంఘాల నాయకులు పాల్గొని పత్తికి మద్దతు ధరతో పాటు తేమ శాతం సడలించాలని కోరారు. ఈ సందర్భంగా అఖిలపక్షం రైతు సంఘం కన్వీనర్ బండి దత్తాత్రి మాట్లాడుతూ.. జిల్లాలో గత నెల 25న పత్తి కొనుగోళ్లు ప్రారంభమయ్యాయని, కానీ తేమ శాతం కారణంగా రైతులు మద్దతు ధర పొందలేకపోతున్నారని అన్నారు. తేమను సడలించడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసాను వెంటనే ఇవ్వాలన్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా స్వామినాథన్ కమిషన్ ను బెఖాతారు చేస్తుందన్నారు. ప్రభుత్వ వైఖరి కారణంగా పత్తి రైతులు వాటిని అమ్ముకునేందుకు ఇబ్బందులు పడుతున్నారన్నారు. గుజరాత్ లో ఓ విధంగా తెలంగాణలో ఓ విధంగా కొనుగోల్లు జరుగుతున్నాయన్నారు. ప్రభుత్వం రైతులను గుజరాత్ కు తీసుకెళ్లి అక్కడి ధరల గురించి తెలియజేయాలన్నారు. రైతుల పక్షాన సంఘం తరుపున ఉద్యమిస్తామని స్పష్టం చేశారు. మద్దత్తు ధర ఇప్పించడంలో అధికార పార్టీ, ఎమ్మెల్యే లు అధికారులు పూర్తిగా విఫలం అయ్యారని రైతులను పూర్తిగా దగా చేస్తూ మద్దతు ధర లేకుండా పత్తి కనుగొళ్ళు చేపడుతున్నారని దుయ్యాబట్టారు. తక్షణమే ఎలాంటి తేమ షరతులు లేకుండా మద్దత్తు ధరతో పత్తిని కొనాలని దానికోసం  కేంద్ర ప్రభుత్వం జిల్లా యంత్రాంగం ఎమ్మెల్యే, ఎంపీ లు కృషి చేయాలని డిమాండ్ చేశారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా ఇస్తామని హామీ ఇచ్చిన ప్రకారం ఎకరానికి 15 వేల చొప్పున రెండు విడతల రైతు భరోసా డబ్బులను రైతుల ఖాతాలో వేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో నాయకులు లోకారి పోశెట్టి, నారాయణ, పరమేశ్వర్, గండ్రత్ రమేష్, జగదీష్, చిల్క దేవిదాస్, లక్ష్మణ్, ప్రహ్లాద్, శంకర్, గోవర్ధన్, రమేష్, జగన్ సింగ్, నంది రామయ్య పాల్గొన్నారు.
Spread the love