సర్వే చేసే ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి : తపస్‌

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న కులగణన సర్వేలో ఉపాధ్యాయులు అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తున్నదని తపస్‌ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు హనుమంతరావు, నవాత్‌ సురేష్‌ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. వారి సమస్యలను పరిష్కరించాలని కోరారు. అనేక జిల్లాల కలెక్టర్లు ఉదయం ఏడు నుంచి సాయంత్రం ఏడు గంటల వరకు సర్వే నిర్వహించాలని చెప్పడాన్ని వారు తీవ్రంగా వ్యతిరేకించారు. సర్వేపై ఒత్తిడి తెస్తే వ్యతిరేకించాల్సి వస్తుందనీ, జిల్లాల్లో కలెక్టర్ల ఒత్తిడి వల్ల ఉపాధ్యాయులు మానసిక క్షోభకు గురవుతున్నారని పేర్కొన్నారు. కావున ఒత్తిడి లేకుండా ఉపాధ్యాయులకు స్వేచ్ఛ నివ్వాలనీ, అప్పుడే సర్వే విజయవంతం అవుతుందని తెలిపారు. ఈనెల 15న కార్తీక పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహిస్తారని పేర్కొన్నారు. ఆరోజు సర్వే విధుల నుంచి ఉపాధ్యాయులకు మినహాయింపు ఇవ్వాలని సూచించారు. ఒక్కో కుటుంబ సర్వేకు సుమారు 45 నుంచి 50 నిమిషాల సమయం పడుతున్నదనీ, రోజుకు ఆరు నుంచి ఎనిమిది కుటుంబాలు చేసేందుకు అనుమతించాలని కోరారు. సర్వే గడువును పెంచాలని తెలిపారు. ఉపాధ్యాయులకు మంచి వాతావరణం కల్పించాలనీ, ఒత్తిడి లేకుండా సర్వే జరిగేలా అధికారులను ఆదేశించాలని సూచించారు.

Spread the love