కులగణన సర్వే గడువు పొడిగించాలి : డీటీఎఫ్‌

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర కులగణన సర్వే చేయడంలో ఎన్యూమరెేటర్లు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని డీటీఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షులు ఎం సోమయ్య, ప్రధాన కార్యదర్శి టి లింగారెడ్డి తెలిపారు. నిర్ణీత సమయంలో పూర్తయ్యే అవకాశం లేనందున గడువును పొడిగించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని సోమవారం ఒక ప్రకటనలో కోరారు. ఒక్కొక్క కుటుంబానికి 75 అంశాలతో కూడిన ప్రశ్నావళికి సమాచారం సేకరించడానికి చాలా సమయం పడుతున్నదని తెలిపారు. అదేవిధంగా సరైన ప్రచారం లేని కారణం గా కుటుంబాల యజమానులు ఇండ్లలో అందుబాటులో ఉండడం లేదని పేర్కొన్నారు. ఉన్నా కూడా కొందరు సరిగా స్పందించడం లేదనీ, మధ్యాహ్నం, సాయంత్రం వేళలో సర్వే చేయడంలో కూడా అనేక ఇబ్బందులు ఎదురవు తున్నాయని తెలిపారు. ఉదయం పూట సర్వే చేసేటట్టు చర్యలు చేపట్టాలనీ, ఎన్యూమరేటర్ల సంఖ్యను పెంచి, ఇండ్ల సంఖ్యను తగ్గించాలని కోరారు.

Spread the love