
నవతెలంగాణ – ఆళ్ళపల్లి : మండల పరిధిలోని కిచెనపల్లి గ్రామానికి చెందిన గొగ్గెల లక్ష్మినారాయణ(45) బుధవారం పురుగు మందు తాగి బలవన్మరణానికి యత్నించిన విషయం తెలిసిందే. లక్ష్మినారాయణ ఆరోగ్య పరిస్తితి విషమంగా ఉండటంతో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి వైద్యాధికారి కెవి.సంఘమిత్ర వెంటనే కొత్తగూడెం ఏరియా ఆసుపత్రికి రిఫర్ చేయడం విదితమే. అక్కడి వైద్యులు బుధవారం రాత్రి లక్ష్మీనారాయణ చికిత్స అందించారు. అతడి ఆరోగ్యం మరింతగా క్షీణిస్తుండటంతో పరీక్షించిన వైద్యులు ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి రిఫర్ చేశారు. ఖమ్మంలో వైద్యులు లక్ష్మినారాయణ ఆరోగ్యాన్ని పరీక్షించేటప్పటికే మృతి చెందినట్లు చెప్పారని స్థానికులు తెలిపారు. విషయం తెలుసుకున్న ఆళ్ళపల్లి పోలీస్ స్టేషన్ ఎస్సై ఈ.రతీష్ కేసు నమోదు చేసి, ఖమ్మం నుంచి ఇల్లందు పట్టణానికి లక్ష్మినారాయణ మృతదేహాన్ని పోలీసుల సహకారంతో తీసుకొచ్చారు. అక్కడి ప్రభుత్వ ఆసుపత్రిలో మృతుడి పోస్ట్ మార్టం నిర్వహించి, కుటుంబ సభ్యులకు మృతదేహాన్ని అప్పగించామని ఎస్సై తెలిపారు. మృతుడి భార్య సత్యవతి, కొడుకులు శ్రీకృష్ణ, శ్రీనాథ్ కన్నీటి పర్యంతం అయ్యారు.