– ఫడ్నవీస్ వ్యాఖ్యలపై ఖర్గే కౌంటర్
న్యూఢిల్లీ : కాంగ్రెస్ పార్టీ సెక్యులర్ అని ఆ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే వ్యాఖ్యానించారు. సిద్ధాంతాలు, సమస్యలు, రాజ్యాంగం ఆధారంగానే తమ పార్టీ ఓట్ల కోసం విజ్ఞప్తి చేస్తుందని అన్నారు. ప్రతిపక్షాలు ‘ఓటు జిహాద్’ సృష్టిస్తున్నాయని ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై ఖర్గే ఆదివారం ఘాటుగా స్పందించారు.
తమ పార్టీ రాజ్యాంగాన్ని విశ్వసిస్తుందని అన్నారు. రాజ్యాంగంలో పేర్కొన్నట్లుగా కులం, విద్య, మతం, వర్ణం, వర్గం మరియు ఆర్థిక పరిస్థితులతో సంబంధం లేకుండా 18సంవత్సరాల వయస్సు నుండి మరణించే వరకు ప్రతి ఒక్కరికీ ఓటు వేసే హక్కు ఉందని అన్నారు. తమ పార్టీ సిద్ధాంతం లౌకికవాదమని, తాము వారీలా (బీజేపీ) గొడవలు సృష్టించమని, దుష్ప్రచారాలు చేయమని, రాజ్యాంగం ప్రకారం ఓట్లు వేయాలని విజ్ఞప్తి చేస్తున్నామని ఖర్గే పేర్కొన్నారు. ఎన్నికల కమిషన్ (ఈసీ) నోటీసుపై స్పందిస్తూ.. నోటీసును స్వాగతిస్తున్నామని అన్నారు. నవంబర్ 18లోగా సమాధానం పంపిస్తామని అన్నారు.
దేవేంద్ర ఫడ్నవీస్ వ్యాఖ్యలపై ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ కూడా స్పందించారు. ” రైతుల ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. సోయాబీన్, పత్తిధరలు పడిపోతున్నాయని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.విద్యాసంస్థలు పెరుగుతున్నాయి, యువత చదువుకుంటున్నారు కానీ ఉద్యోగాలు లేవు. మహారాష్ట్రలో ఇటువంటి సమస్యలు చాలా ఉన్నాయి. వాటన్నింటినీ పక్కదోవ పట్టిస్తూ.. ఫడ్నవీస్ ఓటు జీహాద్ అనే పదాన్ని ఉపయోగించి మతపరమైన విభేదాలు సృష్టించేందుకు యత్నిస్తున్నారు” అని పవార్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
288 స్థానాలు కలిగిన మహారాష్ట్ర అసెంబ్లీకి నవంబర్ 20 ఎన్నికలు జరగనున్నాయి. నవంబర్ 23న కౌంటింగ్ జరగనుంది.