ఈ నెల 29న నిర్వహించే తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం (కేజీకేఎస్) జిల్లా సదస్సును జయప్రదం చేయాలని ఆ సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు గుణగంటి మోహన్ గౌడ్ పిలుపునిచ్చారు. కేజీకేఎస్ జిల్లా సదస్సు పోస్టర్ ను గీతా కార్మికులతో కలిసి బుధవారం మండల కేంద్రంలో ఆవిష్కరించారు. అనంతరం కల్లు గీత కార్మిక సంఘం మండల అధ్యక్షుడు అనపురం రవి గౌడ్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మహబూబాబాద్ జిల్లా సదస్సు 29న సిరోలు మండలంలోని చింతపల్లిలో జరుగుతుందని తెలిపారు. గీతా కార్మికులకు ప్రస్తుతం ఇస్తున్న పెన్షన్ లో ఎలాంటి షరతులు లేకుండా 50 సంవత్సరాల నిండిన ప్రతి గీత కార్మికునికి చేయూత పథకం ద్వారా రూ.4000 ఇవ్వాలన్నారు. రాష్ట్రంలో బెల్ట్ షాపులను పూర్తిగా నిషేధించాలని, కల్లులోని పోషకాలను, ఔషధ గుణాలను ప్రభుత్వమే ప్రచారం చేసి మార్కెట్ సౌకర్యం కల్పించాలన్నారు. వృత్తి రీత్యా గీతాన్నలకు ప్రమాద నివారణ చర్యలు చేపట్టి, సేఫ్టీ మోకులను ఉచితంగా ప్రభుత్వమే పంపిణీ చేయాలన్నారు. ప్రతి గ్రామంలో కల్లుగీత కమ్యూనిటీ భవనం నిర్మించాలని, కులగణన చేపట్టి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు చేయాలని కోరారు. రాష్ట్ర బడ్జెట్లో గీతా కార్మికుల సంక్షేమానికి రూ. ఐదువేల కోట్లు కేటాయించి, టాడి కార్పొరేషన్ ను సమర్థవంతంగా నిర్వహించాలన్నారు. తాటి, ఈత చెట్లను నరికిన వారిపై కఠిన చర్యలు తీసుకునే విధంగా కొత్త చట్టం తీసుకురావాలన్నారు. ప్రమాదానికి గురై మృతి చెందిన గీత కుటుంబాలకు, శాశ్వత వికలాంగులకు రూ.10 లక్షలు ఎక్స్గ్రేషియా చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మండలంలోని అన్ని గ్రామాల కల్లుగీత కార్మిక సంఘం నాయకులు భారీ ఎత్తున తరలివచ్చి కేజీకేఎస్ జిల్లా సదస్సును విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో మండల గీతా కార్మిక సంఘం ఉపాధ్యక్షుడు తాండాల అయోధ్య, అనపురం మల్లయ్య, అనపురం అంజయ్య, బండి లక్ష్మయ్య, బండి మల్లేష్, ఎరుకలి యాకయ్య, మద్దెల వెంకన్న, అనపురం సోమేంద్రి, దీకొండ కమలాకర్, మద్దెల సోమయ్య, రాయిపల్లి యాకయ్య, మందపూరి ప్రవీణ్, సారయ్య, రాజు తదితరులు పాల్గొన్నారు.