అనాథ పిల్ల‌ల‌కు హోమ్ ఆఫ్ హోప్‌

Home of Hope for orphansకర్నూలు నగరంలోని ఓ మారుమూల ప్రాంతంలో ఓ చిన్న ఆశ్రమం. కానీ అది అసాధారణమైన ప్రయత్నం చేస్తోంది. సుమారు 300 మందికి పైగా అనాథలు, నిరాశ్రయులు, పేద పిల్లలకు ఆశాకిరణంగా మారింది. ఈ గొప్ప ప్రయత్నం వెనుక ఇద్దరు పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ సోదరీమణులు ఉన్నారు. వారే బ్లెస్సీ, బ్లిస్సీ. చనిపోయిన వారి తండ్రి ప్రారంభించిన మిషన్‌ను ముందుకు తీసుకువెళుతున్నారు. ఆయన స్థాపించిన హోప్‌ అనాథాశ్రమాన్ని నిర్వహించడానికి తమ జీవితాలను అంకితం చేసిన ఆ అక్కచెల్లెళ్ల సేవా కార్యక్రమాల గురించి నేటి మానవిలో…
కంపాషన్‌ సొసైటీ పేరుతో 2010లో స్థాపించబడిన ఈ అనాథాశ్రమం రాజభూషణం, అతని భార్య ప్రమీలా దేవి ఆలోచనల నుండి పుట్టుకొచ్చింది. ఇది నిరుపేద పిల్లల కోసం స్థాపించిన ఓ ఆశ్రమం. జగన్నాథ గట్టుకు వెళ్లే దారిలో జి.పుల్లారెడ్డి ఇంజినీరింగ్‌ కళాశాల సమీపంలో ఉన్న ఈ అనాథాశ్రమంలో కుటుంబ వాతావరణాన్ని తలపించేలా బాలబాలికలకు వేర్వేరుగా వసతి ఉంది.
తల్లి మార్గదర్శకత్వంలో
తండ్రి కోవిడ్‌తో మరణించినప్పుడు బ్లెస్సీ, బ్లిస్సీ ఆయన కలను కొనసాగించడానికి గొప్ప సంకల్పంతో అడుగుపెట్టారు. వారి సేవా స్ఫూర్తిని పంచుకునే తల్లి మార్గదర్శకత్వంలో ఈ సోదరీమణులు తమ సేవా కార్యకలాపాలను విస్తరించారు. ‘మా ఆశ్రమానికి వచ్చారంటే ఈ పిల్లలు నిజమైన కుటుంబంలో భాగమైనట్లే. ప్రేమ, విలువైన అనుభూతిని అందించే ఓ అందమైన స్థలాన్ని సృష్టించాలని మేము కోరుకుంటున్నాం’ అని బ్లెస్సీ చెప్పారు. ఆహారం, ఆశ్రమంతో పాటే ఈ హోమ్‌ ఆఫ్‌ హోప్‌ ఖైదీలకు విద్య, వృత్తి శిక్షణ, భావోద్వేగ మద్దతును అందిస్తుంది. వారి భవిష్యత్తును గౌరవం, స్వావలంబన భావంతో రూపొందిస్తుంది. టైలరింగ్‌, క్రాఫ్ట్‌లు వంటి ఇంటి వృత్తిపరమైన కార్యక్రమాలతో పాటు పిల్లలకు అవసరమైన నైపుణ్యాలను కూడా అందిస్తుంది. ఆశ్రమంలోని పిల్లలకు 18 ఏండ్లు నిండిన తర్వాత వారిని స్వతంత్ర జీవితాలకు సిద్ధం చేస్తాయి.
కొత్త జీవితం
ప్రస్తుతం అనాథాశ్రమం పనులు దాని నాలుగు గోడలకు మించి విస్తరించాయి. కొన్నేండ్లుగా ఈ ఆశ్రమం తరపున సుమారు ఐదుగురు యువతులకు వివాహాల జరిపించి వారికంటూ ఓ సొంత కుటుంబాన్ని ఏర్పాటు చేశారు. వారు తమ కొత్త జీవిత ప్రయాణాన్ని ప్రేమ, గౌరవం, భద్రతతో ప్రారంభించేలా చేయూత నిచ్చారు. ‘అనాథలకు సేవ చేయడం గొప్ప బహుమతిగా భావిస్తున్నాం. ప్రతిరోజూ కొత్త వ్యక్తులను కలవడం, వారి జీవితాల్లో శాశ్వత ప్రభావాన్ని చూపడానికి మాకు దొరికిన మంచి అవకాశం ఇది’ అని బ్లిస్సీ పంచుకున్నారు.
కలలను కొనసాగించడంలో…
అక్కచెల్లెళ్ల నిబద్ధత ఆ పిల్లల చిరునవ్వుల్లో ప్రతిబింబిస్తుంది. ప్రియా (పేరు మార్చాం) అనే అమ్మాయి గుర్తు చేసుకుంటూ ‘నేను ఇక్కడికి వచ్చిన రోజును ఎప్పటికీ మరచిపోలేను. ఈ ఇల్లు నాకు కుటుంబాన్ని ఇచ్చింది. నా కలలను కొనసాగించడంలో నాకు సహాయపడింది. హోమ్‌ ఆఫ్‌ హోప్‌ లేకుంటే ఈరోజు నేను ఇలా మిగిలేదాన్ని కాదు’ అంటూ పంచుకుంది. ఆరేండ్ల పాటు హోం ఇన్‌చార్జిగా పనిచేసిన బి సతీష్‌ మాట్లాడుతూ ‘మేము వారిని మా సొంత పిల్లల్లాగే చూస్తాము. వారు ప్రపంచంలోకి అడుగు పెట్టడానికి ముందు వారు మానసికంగా, సామాజికంగా, ఆర్థికంగా సిద్ధంగా ఉన్నారని మేము నిర్ధారిస్తాము’ అని పంచుకున్నారు.

Spread the love