వరుణుడిదే పైచేయి!

Rains– వర్షంతో ఐదో రోజు సాగని ఆట
– ఉత్కంఠభరిత గబ్బా టెస్టు డ్రా
– బోర్డర్‌ గవాస్కర్‌ ట్రోఫీ 2024
ఉత్కంఠ రేపిన భారత్‌, ఆస్ట్రేలియా మూడో టెస్టులో వరుణుడిదే పైచేయిగా మారింది. గబ్బాలో తొలి రోజు, ఆఖరు రోజు వర్షంతో ఆట సాగలేదు. దీంతో బోర్డర్‌ గవాస్కర్‌ ట్రోఫీ మూడో మ్యాచ్‌ డ్రాగా ముగిసింది. ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌ను 89/7 వద్ద డిక్లరేషన్‌ ప్రకటించి.. భారత్‌కు 275 పరుగుల ఊరించే లక్ష్యాన్ని నిర్దేశించింది. ఛేదనలో భారత్‌ 8/0తో ఉండగా వెలుతురు లేమి, ఆపై భారీ వర్షంతో ఆట సాగలేదు. భారత్‌, ఆస్ట్రేలియా బాక్సింగ్‌ డే టెస్టు మెల్‌బోర్న్‌లో 26 నుంచి ఆరంభం కానుంది.
నవతెలంగాణ-బ్రిస్బేన్‌
భారత్‌, ఆస్ట్రేలియా మూడో టెస్టు డ్రాగా ముగిసింది. ఆఖరు రోజు ఆటలో ఫలితం కోసం ఇరు జట్లు సవాల్‌ ఎదుర్కొనేందుకు సిద్ధపడ్డాయి. రెండో ఇన్నింగ్స్‌ను ఆస్ట్రేలియా 89/7 వద్ద డిక్లరేషన్‌ ప్రకటించింది. పేస్‌ దళపతి జశ్‌ప్రీత్‌ బుమ్రా (3/18), మహ్మద్‌ సిరాజ్‌ (2/36), ఆకాశ్‌ దీప్‌ (2/28) నిప్పులు చెరిగారు. 275 పరుగుల ఛేదనలో భారత్‌ 2.1 ఓవర్లలో 8/0తో నిలిచింది. యశస్వి జైస్వాల్‌ (4 నాటౌట్‌, 6 బంతుల్లో), కెఎల్‌ రాహుల్‌ (4 నాటౌట్‌, 7 బంతుల్లో) అజేయంగా నిలిచారు. భారత రెండో ఇన్నింగ్స్‌ ఆరంభం కాగానే వెలుతురు లేమితో మ్యాచ్‌ నిలిచిపోగా.. ఆ తర్వాత ఎడతెరపి లేకుండా వర్షం కురిసింది. దీంతో మూడో టెస్టు డ్రాగా ముగిసింది. తొలి ఇన్నింగ్స్‌లో ధనాధన్‌ సెంచరీతో చెలరేగిన ఆసీస్‌ బ్యాటర్‌ ట్రావిశ్‌ హెడ్‌ ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’గా నిలిచాడు. బోర్డర్‌ గవాస్కర్‌ ట్రోఫీలో భారత్‌, ఆస్ట్రేలియాలు 1-1తో సమవుజ్జీలుగా కొనసాగుతున్నాయి. భారత్‌, ఆస్ట్రేలియా నాల్గో టెస్టు 26 నుంచి మెల్‌బోర్న్‌లో ఆరంభం కానుంది.
పేసర్ల దూకుడు
భారత పేస్‌ త్రయం చెలరేగింది. తొలి ఇన్నింగ్స్‌లో జశ్‌ప్రీత్‌ బుమ్రా ఒక్కడే ఆరు వికెట్లతో పోరాటం చేయగా.. రెండో ఇన్నింగ్స్‌లో మహ్మద్‌ సిరాజ్‌, ఆకాశ్‌ దీప్‌ సైతం జత కలిశారు. ఆస్ట్రేలియా సైతం వేగంగా పరుగులు చేయాలనే ప్రణాళికతో బ్యాటింగ్‌కు వచ్చింది. మిచెల్‌ మార్ష్‌, ట్రావిశ్‌ హెడ్‌ను బ్యాటింగ్‌ ఆర్డర్‌లో ముందుకు పంపించింది. కానీ ఆసీస్‌ టాప్‌ ఆర్డర్‌ను భారత పేసర్లు బోల్తా కొట్టించారు. నాథన్‌ మెక్‌స్వీనీ (4), ఉస్మాన్‌ ఖవాజా (8), మార్నస్‌ లబుషేన్‌ (1), మిచెల్‌ మార్ష్‌ (2)లను బుమ్రా, ఆకాశ్‌ దీప్‌లు సాగనంపారు. ట్రావిశ్‌ హెడ్‌ (17, 19 బంతుల్లో 2 ఫోర్లు) రెండు బౌండరీలతో మెరిశాడు. స్టీవ్‌ స్మిత్‌ (4) త్వరగా అవుటవగా.. అలెక్స్‌ కేరీ (20 నాటౌట్‌, 20 బంతుల్లో 2 ఫోర్లు), పాట్‌ కమిన్స్‌ (22, 10 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) వేగంగా పరుగులు పిండుకున్నారు. 18 ఓవర్లలో 4.94 రన్‌రేట్‌తో ఆసీస్‌ 89 పరుగులు చేసింది. ఇన్నింగ్స్‌ను డిక్లరేషన్‌ను ప్రకటించిన ఆసీస్‌ భారత్‌కు 275 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.
260 ఆలౌట్‌
ఆకాశ్‌ దీప్‌ (31, 44 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్‌), జశ్‌ప్రీత్‌ బుమ్రా (10 నాటౌట్‌, 38 బంతుల్లో 1 సిక్స్‌) ఆఖరు వికెట్‌కు విలువైన భాగస్వామ్యం నమోదు చేశారు. ఓవర్‌నైట్‌ స్కోరు ఎనిమిది పరుగులు జోడించిన భారత్‌.. 260 పరుగులకు కుప్పకూలింది. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 185 పరుగుల ఆధిక్యం దక్కించుకుంది. ఆస్ట్రేలియా బౌలర్లలో పాట్‌ కమిన్స్‌ (4/81), మిచెల్‌ స్టార్క్‌ (3/83) రాణించారు. ట్రావిశ్‌ హెడ్‌, నాథన్‌ లయాన్‌లు సైతం చెరో వికెట్‌ ఖాతాలో వేసుకున్నారు. ఛేదనలో భారత్‌ 2.1 ఓవర్లలో మెరుగ్గా కనిపించింది. యశస్వి జైస్వాల్‌ (4 నాటౌట్‌), కెఎల్‌ రాహుల్‌ (4 నాటౌట్‌) నాలుగేసి పరుగులు సాధించారు. భారత్‌ 8/0తో ఉండగా వెలుతురు లేమితో ఆట ఆగిపోయింది. ఆ తర్వాత ఇరు జట్ల కెప్టెన్లు డ్రాకు అంగీకరించారు.
స్కోరు వివరాలు
ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌ : 445/10
భారత్‌ తొలి ఇన్నింగ్స్‌ : 260/10
ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌ : నాథన్‌ మెక్‌స్వీనీ (సి) పంత్‌ (బి) ఆకాశ్‌ దీప్‌ 4, ఉస్మాన్‌ ఖవాజా (బి) బుమ్రా 8, మార్నస్‌ లబుషేన్‌ (సి) పంత్‌ (బి) బుమ్రా 1, మిచెల్‌ మార్ష్‌ (సి) పంత్‌ (బి) ఆకాశ్‌ దీప్‌ 2, ట్రావిశ్‌ హెడ్‌ (సి) పంత్‌ (బి) సిరాజ్‌ 17, స్టీవ్‌ స్మిత్‌ (సి) పంత్‌ (బి) సిరాజ్‌ 4, అలెక్స్‌ కేరీ నాటౌట్‌ 20, పాట్‌ కమిన్స్‌ (సి) రాహుల్‌ (బి) బుమ్రా 22, మిచెల్‌ స్టార్క్‌ నాటౌట్‌ 2, ఎక్స్‌ట్రాలు : 9, మొత్తం : (18 ఓవర్లలో 7 వికెట్లకు) 89 డిక్లేర్డ్‌.
వికెట్ల పతనం : 1-11, 2-16, 3-16, 4-28, 5-33, 6-60, 7-85.
బౌలింగ్‌ : జశ్‌ప్రీత్‌ బుమ్రా 6-1-18-3, మహ్మద్‌ సిరాజ్‌ 7-0-36-2, ఆకాశ్‌ దీప్‌ 5-1-28-2.
భారత్‌ రెండో ఇన్నింగ్స్‌ : యశస్వి జైస్వాల్‌ నాటౌట్‌ 4, కెఎల్‌ రాహుల్‌ నాటౌట్‌ 4, ఎక్స్‌ట్రాలు : 0, మొత్తం : (2.1 ఓవర్లలో) 8.
బౌలింగ్‌ : మిచెల్‌ స్టార్క్‌ 1.1-0-4-0, పాట్‌ కమిన్స్‌ 1-0-4-0.

Spread the love