గల్లా పెట్టె పై నజర్‌

Nasser on Galla box– ఆర్థిక వనరుల సమీకరణపై సర్కారు దృష్టి
– టీజీఐఐసీ భూముల తనఖా
– ఆ మేరకు బ్యాంకర్లతో సంప్రదింపులు
– రైతు భరోసా, మహిళలకు ఆర్థిక సాయం, వ్యవసాయ కార్మికులకు చేయూతపై సమాలోచనలు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
ఒకవైపు తీవ్రమైన ఆర్థిక కష్టాలు, అప్పులు, వడ్డీలు, కిస్తీలతో సతమతమవుతున్న రాష్ట్ర ప్రభుత్వం…మరోవైపు ఎలాగైనా ఆర్థిక వనరులను సమకరీంచుకోవాలని నిర్ణయించింది. ఇందుకోసం ఉన్న అన్ని వనరులనూ సద్వినియోగం చేసుకోవాలని భావిస్తోంది. రాష్ట్రంలో కాంగ్రెస్‌ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తవటం, ఆ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలపై ప్రజలు ఆశగా ఎదురు చూస్తుండటం తదితర పరిణామాల నేపథ్యంలో ఖజానాను నింపుకోవటంపై సర్కారు సీనియస్‌గా దృష్టి సారించింది. ఇందులో భాగంగా తెలంగాణ ఇండిస్టీయల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (టీజీఐఐసీ) పరిధిలో ఉన్న భూములను తనఖా పెట్టటం ద్వారా రూ.20 వేల నుంచి రూ.30 వేల కోట్ల వరకూ సమీకరించుకునేందుకు ప్రభుత్వం నిర్ణయించినట్టు విశ్వసనీయ సమాచారం. ఇందుకోసం ఆ సంస్థకు చెందిన ఉన్నతాధికారులు కొద్ది రోజుల క్రితం ముంబయి వెళ్లి, పలువురు బ్యాంకర్లతో సమావేశమైనట్టు తెలిసింది. సంక్రాంతి నుంచి రైతు భరోసాను అమల్జేస్తామంటూ ప్రకటించిన సంగతి విదితమే. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకసారి మాత్రమే రైతు భరోసాను విడుదల చేశారు. అందుకు గత బీఆర్‌ఎస్‌ సర్కారు పాటించిన విధి విధానాలనే ప్రామాణికంగా తీసుకున్నారు. ఆ ప్రకారంగా ఎకరాకు రూ.5 వేల చొప్పున్నే రైతుల ఖాతాల్లో జమ చేశారు. కానీ కాంగ్రెస్‌ తన ఎన్నికల హామీల్లో భాగంగా ఎకరాకు రూ.7,500 ఇస్తామంటూ ప్రకటించింది. ఇప్పుడు ఆ వాగ్దానాన్ని విధిగా అమలు చేయాల్సి ఉంది. అందుకోసం సాలీనా రూ.15 వేల కోట్లు అవసరమవుతాయని ఆర్థికశాఖ లెక్కలేసింది. దీంతోపాటు ఒక్కో మహిళకు ఆర్థిక సాయం కింద నెలకు రూ.2,500లు ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. దీనిపై సర్కారు సీరియస్‌గా దృష్టి సారించినట్టు అధికార వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు వ్యవసాయ కార్మికులకు ఏడాదికి రూ.12 వేల ఆర్థిక సాయంలో భాగంగా తొలి విడతగా సంక్రాంతి నుంచి రూ.6 వేలను ఇస్తామంటూ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క… ఇటీవల తన ఖమ్మం పర్యటనలో ప్రకటించారు. ఈ రెండింటిలో మహిళలకు ఆర్థిక సాయం కోసం రూ.3 వేల కోట్లు, వ్యవసాయ కార్మికులకు చేయూత కోసం మరో రూ.5 వేల కోట్లు అవసరమవుతాయని అంచనా. మొత్తంగా రైతు భరోసాతోపాటు ఈ రెండింటికీ కలిపి రూ.20 వేల కోట్ల నుంచి రూ.25 వేల కోట్లు కావాలి. భూములను తనఖా పెట్టటం ద్వారా ఈ మొత్తాన్ని సమకూర్చుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది.
పంచాయతీల్లో పాగా కోసం
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం’ సీఎం రేవంత్‌కు మంచి మార్కులు తెచ్చిపెట్టింది. అయితే రైతు భరోసా, మహిళలు, వ్యవసాయ కార్మికులకు సంబంధించిన హామీల అమల్లో జాప్యం చోటు చేసుకోవటంతో గ్రామీణ ప్రాంతాల్లో కొంత ప్రతికూలత చోటు చేసుకుందనే విషయం ప్రభుత్వ దృష్టికి వెళ్లింది. ఈ నేపథ్యంలో రైతు భరోసా, మహిళలు, వ్యవసాయ కార్మికులకు వీలైనంత త్వరగా ఆర్థిక చేయూతనివ్వటం ద్వారా ఇప్పటిదాకా ఉన్న ప్రతికూలతను సానుకూలతగా మార్చుకోవాలని సీఎం నిర్ణయించారు. ఆ వెంటనే పంచాయతీ ఎన్నికలను నిర్వహిస్తే మెరుగైన ఫలితాలను సాధించవచ్చన్నది ఆయన అంచనాగా ఉన్నట్టు సన్నిహిత వర్గాలు తెలిపాయి.

Spread the love