1978 నుంచి ప్రపంచ వ్యాప్తంగా ఐక్యరాజ్యసమితి చొరవతో మార్చి 8వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకుంటున్నాం. ప్రపంచ జనాభాలో దాదాపు సగం మంది మహిళలు ఉన్నారు అనే వాస్తవాన్ని మరువరాదు. అయితే నేటికీ అనేక దేశాల్లో మగవారితో సమానంగా మహిళలకు సమాన అవకాశాలు లేవు, సరికదా అనేక విధాలుగా వివక్ష, అణిచివేతకు గురవుతున్నారు. వెనుకబడిన దేశాల్లోనే కాకుండా అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా మహిళలపై వివక్షత, అణిచివేత ధోరణులు ఉండుట గమనార్హం. మరో రెండు రోజుల్లో మహిళా దినోత్సవం జరుపుకోబోతున్న నేపథ్యంలో మహిళల స్థితిగతులను ఓ సారి పరిశీలిద్దాం…
2024 ‘వరల్డ్ ఎకనామిక్ ఫోరం’ రిపోర్ట్ ప్రకారం లింగ సమానత్వంలో ఐస్ లాండ్, ఫిన్లాండ్, న్యూజిలాండ్, స్వీడన్, జర్మనీ వంటి దేశాలు ప్రపంచంలోనే ముందు వరుసలో ఉండుట అభినందనీయం. ఇక మనదేశం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తూ ముందుకు పోతున్నాం అని, త్వరలోనే ప్రపంచంలో మూడో ఆర్థిక వ్యవస్థగా, ఐదు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా రూపొందుతున్నది అని చెబుతున్న నేటి పాలకుల పాలనలో మాత్రం మన భారత్ లింగ సమానత్వంలో 129 స్థానంలో ఉండుట అత్యంత బాధాకరమైన విషయం. ప్రతీ రోజూ దేశంలో మహిళలు లైంగిక దాడులు, రకరకాల వివక్షకు, అణిచివేతకు గురవుతున్నారు. దేశ రాజధాని న్యూఢిల్లీ అత్యాచారాల రాజధానిగా వార్తల్లో నిలుస్తోంది. మహిళలపై జరుగుతున్న జాతీయ క్రైం రేట్ సగటు కంటే దాదాపు మూడు రెట్లు ఎక్కువగా దేశ రాజధాని ఢిల్లీలో, ఉత్తర ప్రదేశ్‌లో నమోదు కావడం ద్వారా మనదేశంలో మహిళల పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
‘వర్క్ ఫోర్స్’లో…
ఇక మనదేశంలో దాదాపు సగం మంది మహిళలు ఉన్నా విద్యా, ఉద్యోగ ఉపాధి అవకాశాల్లో వెనుకబడి ఉన్నారు. దాదాపు 40 శాతం మంది మహిళలకు చదువు లేదు. కేవలం 17.8 శాతం మంది ప్రాధమిక విద్య అభ్యసించారు అని నివేదికలు చెబుతున్నాయి. నేటికీ ‘వర్క్ ఫోర్స్’లో 32.8 శాతం మంది మహిళలు పాల్గొంటున్నారు. నేటికీ 34.7 శాతం మహిళలు ఇంటి పనుల్లో నిమగమై ఉన్నారు. 2023 మహిళా వర్క్‌ఫోర్స్ నివేదికను పరిశీలించగా మనదేశం 32.7 శాతంతో ప్రపంచంలో 165వ స్థానంలో ఉండుట అత్యంత బాధాకరమైన విషయం.
వేతన వ్యత్యాసాల్లో
మనదేశంలో మగవారి కంటే 64.24 శాతం వేతన వ్యత్యాసంతో మహిళలు వెనుకబడి ఉన్నారు అని వివిధ సర్వేలు చెబుతున్నాయి. హిమాచల్ ప్రదేశ్‌లో 15 నుంచి 59 ఏండ్ల మధ్య వయసు మహిళల్లో 76.6 శాతం మహిళలు వర్క్ ఫోర్స్‌లో ముందు వరుసలో ఉండగా, ఆంధ్రప్రదేశ్‌లో 51.5 శాతం మంది, తెలంగాణలో 50.4 శాతం మంది మహిళలు పనిలో నిమగమయ్యారు. మొత్తం దేశంలో వర్క్ ఫోర్స్‌లో మగవారు 61 శాతం ఉండగా, మహిళలు 39 శాతం ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి. పట్టణ మహిళల కంటే గ్రామీణ ప్రాంతాల మహిళలు వర్క్ ఫోర్స్‌లో అధికంగా ఉన్నారు. అలాగే అసంఘటిత రంగంలో ఎక్కువగా పని చేస్తున్నారు. వీరంతా తీవ్రశ్రమ దోపిడీకి గురవుతున్నారు. మహిళా భద్రతా చట్టాలు నామ మాత్రంగా అమలు జరుగుతున్నాయి.
ఈ ఏడాది థీమ్
2025కు గాను ‘ఎంపౌరింగ్ ఎన్వైర్మెంట్, ఉమెన్ లీడింగ్ చేంజ్ ఇన్ అవర్ కమ్యూనిటీస్’ అనే థీమ్‌తో మహిళా దినోత్సవం జరుపుకుంటున్న సమయంలో, ప్రపంచ మహిళల అభివృద్ధికి ప్రత్యేక కృషి చేయాలి. అంతర్జాతీయ సంస్థలు, అభివృద్ధి చెందిన దేశాలు ఆర్థికంగా, సామాజికంగా మహిళా అభివృద్ధికి కృషి చేయాలి. యుద్ద సమయంలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలు దాడుల నుంచి రక్షించేందుకు చర్యలు చేపట్టాలి. వెనుకబడిన దేశాల్లోనే కాకుండా గిరిజన, మైనారిటీ మహిళల రక్షణకు, అభివృద్ధికి ప్రత్యేక చర్యలు చేపట్టాలి. ముఖ్యంగా మన దేశంలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలపై కఠిన చర్యలు చేపట్టాలి. దోషులను త్వరగా పట్టుకోవాలి. చట్టాలు కపడ్బందిగా అమలు చేయాలి. ఫోక్సో, నిర్భయ చట్టాలు, గృహ హింస నిరోధక చట్టం తదితర చట్టాలు సక్రమంగా అమలు చేయాలి. మహిళలకు అవగాహన కల్పించేందుకు కృషి చేయాలి. టోల్ ఫ్రీ నెంబర్, దిశ యాప్, మహిళా పోలీస్ స్టేషన్, మహిళా చట్టాలపై తరచూ ప్రభుత్వాలు, న్యాయ స్థానాలు, పోలీస్ శాఖ, సామాజిక మాధ్యమాలు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా, ఉపాధ్యాయులు, అంగన్వాడీ కేంద్రాలు, స్వచ్ఛంద సంస్థలు అవగాహన కల్పించేందుకు కృషి చేయాలి.
స్త్రీల అభివృద్ధితోనే…
సమాజ మనుగడ, పురోగతి స్త్రీల అభివృద్ధితోనే ముడిపడి ఉంది అనే వాస్తవాన్ని మరువరాదు. అందుచేతనే మన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ‘దేశ అభివృద్ధి మహిళల అభివృద్ధి’పై ఆధారపడి ఉంటుంది అని ఆనాడే చెప్పారు. ఆ మాటకు వస్తే ప్రపంచ అభివృద్ధి కూడా మహిళల అభివృద్ధితోనే ముడిపడి ఉంది. మహిళా సాధికారత అంటే మహిళలు స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోవడం ద్వారా అభివృద్ధిలో ముందుకు సాగటం అని గ్రహించాలి. క్లారా జెట్కిన్, సావిత్రి బారు ఫూలే, సరోజినీ నాయుడు, దుర్గాబాయి దేశముఖ్, శ్రీమతి ఇందిరాగాంధీ, అరుణా అసఫ్ అలీ, కెప్టెన్ లక్ష్మీ సెహగల్ వంటి ఎందరో మహిళలు అనేక రంగాల్లో రాణించి ఆదర్శంగా నిలిచారు. క్రీడల్లో వారిపై జరుగుతున్న అఘాయిత్యాలు అమానుష ఘటనలపై అనేక మంది క్రీడాకారిణులు ఇటీవల న్యూఢిల్లీలో అవిశ్రాంత పోరా టం చేసిన సంగతి మరువరాదు. హక్కు ల కోసం, సమానత్వం కోసం మహిళలు ఉద్యమాల్లో పాల్గొనాలి. ప్రజాస్వామ్య పద్ధతిలో పోరాడాలి. అభ్యుదయ భావాలు కలిగిన వారు, ప్రజాస్వామ్య వాదులు సహాయ, సహకారాలు అందించాలి. మహిళల అభివృద్ధితోనే మానవాళి అభివృద్ధి ఆధారపడి ఉంది అనే విషయాన్ని అందరూ గ్రహించాలి. మహిళా అభ్యున్నతికి కుటుంబ స్థాయి నుంచి అందరూ సహకరించాలి అని కోరుకుందాం…
– ఐ.ప్రసాదరావు, 6305682733
పెరుగుతున్న దాడులు
మహిళలపై అధిక సంఖ్యలో దాడులు జరుగుతున్నాయని నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో చెబుతుంది. ప్రతీ ఏడాది సగటున దాదాపు ఐదు లక్షల కేసులు నమోదు అవుతున్నాయి. మహిళలపై దాడులు, హింస ఎక్కువగా భర్త, వారి కుటుంబ సభ్యులపై నమోదు అవుతున్నాయి. వరకట్నం వేధింపులు తాళలేక అనేక మంది మహిళలు తనువు చాలిస్తున్నారు. అఘాయిత్యాలు రోజురోజుకి పెచ్చరిల్లిపోతున్నాయి. కుల, మత వివక్షత అణిచివేత ధోరణులు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి. కోవిడ్ అనంతరం అనేక మంది ఉద్యోగ ఉపాధి అవకాశాలు కోల్పోయారు. అంతే కాకుండా జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ప్రకారం మహిళల్లో చాలామంది పౌష్టికాహారం లోపంతో బాధపడుతున్నారు. శారీరక మానసిక అనారోగ్యాలతో సతమతం అవుతున్నారు. పేదరికం, నిరుద్యోగం పెరుగుతుంది. ఇలా అనేక రుగ్మతలతో మన దేశంలో మహిళలు సతమతం అవుతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మహిళా అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలి. చట్టాలు సక్రమంగా అమలు చేయాలి. విద్యా, ఆరోగ్యానికి పెద్ద పీట వేయాలి.
చట్టసభల్లో స్థానం…
దేశానికి స్వాతంత్య్రం వచ్చి 77 ఏండ్లు పూర్తి అవుతున్నా, ఏ రంగంలో కూడా మహిళలు ఆశించిన స్థాయిలో అభివృద్ధి చెందలేదు అనే విషయాన్ని గ్రహించాలి. ముఖ్యంగా చట్ట సభల్లో ప్రాతినిధ్యం కూడా అతి తక్కువగా ఉంటుంది. తాజాగా 2024లో జరిగిన భారత పార్లమెంటు ఎన్నికల్లో లోక్‌సభకు ఎన్నికైన మహిళా పార్లమెంటు సభ్యులు కేవలం 74 మంది అనగా 13.63 శాతంగా నమోదైంది.. అంటే 33 శాతం కేటాయించినా, దీంట్లో కనీసం సగ శాతం కూడా లేకపోవడం గమనార్హం. ఆర్జేడీ నుంచి ఒకే ఒక మహిళ ఎం.పి ఎన్నికైనారు. కొన్ని పార్టీలు మహిళలకు టికెట్లు కూడా ఇవ్వడం లేదు. ప్రస్తుతం దేశంలో దాదాపు 20 రాష్ట్రాల్లో బిజెపి, ఈ కూటమి పార్టీలు అధికారంలో ఉన్నా ఒకే ఒక మహిళ సి.యమ్ (ఢిల్లీ ముఖ్యమంత్రి) మినహా మరి ఏ రాష్ట్రంలో కూడా మహిళా ముఖ్యమంత్రులు లేరు. మహిళా రిజర్వేషన్ చట్టం పార్లమెంటు ఆమోదం పొందినా, అమలు మాత్రం వచ్చే లోక్ సభ ఎన్నికలు 2029 నుంచి మాత్రమే అని తెలుపుటలోనే నేటి పాలకులకు మహిళలపై చిత్తశుద్ధి ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు.
సమాజ అభివృద్ధిలో మహిళల పాత్ర కీలకం
9:57 pm