– గాజాపై ట్రంప్ తాజా బెదిరింపులు
– శాశ్వత శాంతితోనే మిగిలిన బందీల విడుదల
– బెదిరింపులను కొట్టిపారేసిన హమాస్
వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గాజాపై బెదిరింపులకు దిగారు. మిగిలిన బందీలందరినీ తక్షణమే విడుదల చేయాలని, అలాగే ఇప్పటివరకు మీరు హతమార్చిన వారి మృతదేహాలను అప్పగించాలని లేనిపక్షంలో మీ అంతు చూస్తామని ట్రంప్ బుధవారం హమాస్ నేతలను బెదిరించారు. హమాస్ నేతలందరూ గాజా విడిచి పారిపోవాలని హుకుం జారీ చేశారు. గాజాపై విధ్వంసానికి దిగిన ఇజ్రాయిల్‌కు మద్దతు ప్రకటిస్తూ, పని పూర్తి చేయడానికి ఇజ్రాయిల్‌కు అవసరమైన ఆయుథాలను పంపుతామని హామీ ఇచ్చారు.ఈ మేరకు ట్రంప్ తన సోషల్ మీడియా ఖాతా ట్రూత్‌లో పేర్కొన్నారు. ఇటీవల విడుదలైన బందీలను కలిసిన తర్వాత ఆయన ఈ ప్రకటన చేశారు. ”ఇదే మీకు చివరి హెచ్చరిక. గాజాను వదిలి వెళ్లాల్సిన సమయం వచ్చింది” అని హమాస్ నేతలను బెదిరించారు. ‘ గాజా ప్రజల కోసం మంచి భవిష్యత్తు ఎదురు చూస్తోందని, కానీ మీరు బందీలను విడుదల చేయకుంటే గాజా అంతటా పరిణామాలు తీవ్రంగా వుంటాయి.’ అని అన్నారు.
మిగిలిన బందీలను హమాస్ అప్పగించకపోతే ఊహించలేని పరిణామాలు వుంటాయని ఇజ్రాయిల్ ప్రధాని నెతన్యాహూ చేసిన హెచ్చరికల నేపథ్యంలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు.
కొట్టిపారేసిన హమాస్
ట్రంప్ తాజా బెదిరింపులను హమాస్ గురువారం కొట్టిపారేసింది. గాజాలో శాశ్వత శాంతి నెలకొంటేనే మిగిలిన బందీలను విడుదల చేస్తామని పునరుద్ఘాటించింది. జనవరిలో కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం నుండి బయటకు వెళ్ళిపోవాలని ట్రంప్, నెతన్యాహులు ప్రయత్నిస్తున్నారని హమాస్ విమర్శించింది. మరింత మంది పాలస్తీనియన్ ఖైదీలను విడుదల చేసి, గాజాలో శాశ్వత కాల్పుల విరమణ, గాజా నుండి ఇజ్రాయిల్ బలగాల ఉపసంహరణ జరిగితే బందీలను విడుదల చేస్తామని, ఇందుకోసం రెండో దశ కాల్పుల విరమణ ఒప్పందంపై చర్చలు జరగాలని ఆనాటి ఒప్పందం పిలుపిస్తోంది. రెండో దశపై చర్చలు జరపడమే మిగిలిన బందీల విడుదలకు ఉత్తమ మార్గమని హమాస్ ప్రతినిధి అబ్దుల్ లతీఫ్ అల్ కనువా తెలిపారు. ఫిబ్రవరి మొదటి వారంలోనే ఈ చర్చలు జరగాల్సి వుందని, కానీ ఇప్పటివరకు కేవలం సన్నాహక చర్చలు మాత్రమే జరిగాయన్నారు. హమాస్ వద్ద ఇంకా 24మంది బందీలు సజీవంగా వున్నారని భావిస్తున్నారు. అలాగే హత్యచేసిన 34మంది బందీల మృతదేహాలు కూడా తన వద్దనే అట్టిపెట్టుకుంది.