భగత్‌సింగ్ భౌతికంగా కన్నుమూసి శతాబ్దం సమీపిస్తున్నా, ఆయన త్యాగం వెదజల్లిన పరిమ ళాలు ఈ దేశాన్ని తడుముతూనే ఉంటాయి. ఆయన భావాలు వాస్తవరూపం దాల్చితే తప్ప ఈ దేశానికి భవిష్యత్తు లేదు. గాంధీకి ముందు, తర్వాత స్వాతంత్య్ర సమరయోధుల బ్రిటిష్ వ్యతిరేక పోరాట లక్ష్యం స్వతంత్ర సాధనతో పరిసమాప్తి అయ్యింది. బ్రిటిష్ పాలన స్థానంలో భారతీయ ధనవంతుల పాలన పేద శ్రామిక వర్గ ప్రజలను మభ్యపెట్టడానికి, తద్వారా ధనవంతులకు సేవచేయటంలోనే తృప్తి చెందుతుంది కదా! పరాయిపాలన స్థానంలో సొంతపాలన గొప్ప విషయమే కానీ గడిచిన కాలంలో ప్రజల జీవితాలు భంగపడ్డాయి. పరాయివాడి పీడనే కాదు, సొంత దేశ పీడకుల విముక్తి కూడా జరగాలని కోరుకున్నాడు భగత్‌సింగ్. అందుకే ఆయన ఆలోచన మిగతా నాయకులకన్నా భిన్నం. అందుకే ఆయన జయంతులు, వర్థంతులు ప్రభుత్వాలకు పెద్దగా పట్టవు.
భగత్‌సింగ్ అతిచిన్న వయస్సులో చూపిన దూరదృష్టి, తెగువ, భిన్నమైన ఆలోచన నాటి ప్రధాన స్రవంతి రాజకీయాలను బలంగా ప్రభావితం చేసింది. అయన లేవనెత్తేనాటికి కాంగ్రెస్ డొమినియన్ స్టేటస్ వద్దే ఆగిపోయింది. అయన లేవదీసిన సంపూర్ణ స్వతంత్రం కాంగ్రెసుకు సైతం అనివార్యతలోకి నెట్టింది. స్వతంత్రం ఈ దేశ మౌలిక సమస్యలకు మార్గం కావాలని కోరుకున్న అయన ఆశలు, ఆశయాలు సంపూర్తి కాలేదు. స్వతంత్రం సిద్ధించి ఎనిమిది దశాబ్దాలవుతున్నా అసమానతలు పోకపోగా మరింత పెరుగుతున్న పరిస్థితి ఉంది. దేశ సంపద పిడికెడుమంది చేతిలో కేంద్రీకృతమౌతున్నది. యువతకు ఉపాధి పగటికలగా మిగిలింది. వాళ్లు వాస్తవాలను తెలుసుకోకుండా వ్యసనపరులను చేస్తున్నవి ప్రభుత్వాలు. చిన్నచిన్న దేశాలు క్రీడల్లో దూసుకుపోతుంటే మన పాలకగణం వారిని వేధిస్తున్నది. ప్రజలకోసం పనిచేయటం కన్నా దేశ వనరులను కొద్దీ మందికి కట్టబెట్టే ప్రయివేటు ఏజెన్సీలా మారిపోయాయి ప్రభుత్వాలు. దేశంలో మహిళల భద్రత, గౌరవం అనుక్షణం మంటగలుస్తున్నా పాలకులకు పట్టడం లేదు. శాస్త్ర, సాంకేతికతలను శ్మశానానికి నెట్టి మూఢత్వాన్ని ఊరేగిస్తున్నారు. వ్యవసాయానికి ఉరేసి కార్మికవర్గాన్ని యథేచ్ఛగా దోపిడీ చేసేందుకు చట్టబద్దం చేస్తున్నారు. మత ఉన్మాదాన్ని పాలకులు పశుపతాస్త్రంగా మలుచుకున్నారు. వారిని విభేదిస్తే దేశాన్నే అవమానపరుస్తున్నారనే స్థాయికి దిగ్గొట్టారు. దేశం కోసం పోరాడినవారు దేశ ద్రోహులయ్యారు, బ్రిటిష్ వారితో చేతులు కలిపినవారు దేశభక్తులయ్యారు. జాతీయజెండాను వ్యతిరేకించినవారు అపర దేశభక్తులై ఎవరు దేశభక్తులో సర్టిఫికెట్లు జారిజేస్తున్నారు.ముందుకు నడపాల్సిన అధికారం వెనక్కి లాగుతున్నది. ఇది ఈ దేశ ముఖచిత్రం. భగత్‌సింగ్ ఆశయాలు నెరవేరకపోగా నీరుగారుతున్నాయి. భగత్‌సింగ్ ఆశయాలు నెరవేర్చకుండా ఈ దేశ భవిష్యత్తులో ఎలాంటి మార్పు ఉండదు.
భగత్‌సింగ్ సమూల మార్పువాది. అయన ఆశయాల సాధనకు, దేశాన్ని కొత్త ఆలోచనలోకి నెట్టడానికి తన ప్రాణాన్నే ఆయుధంగా వాడాడు. ఆయన ఆలోచనలో పరిపక్వత కోసం తీవ్రంగా అధ్యయనం చేశాడు. తాను పొందిన చైతన్యాన్ని ఆచరణలో మార్పునకు కృషిచేశాడు. తుపాకులు, బాంబులు విప్లవాన్ని సృష్టించవని, విప్లవం అనే కత్తి, ఆలోచనల అనే పదునుపెట్టే రాయిపై పదును పెట్టబడుతుందని నమ్మాడు. నేటికీ ఆయనను ఒక తీవ్రవాదిగా చూపించే కుత్సిత బుద్ధి దేశ పాలకుల్లో కనపడుతూనే ఉన్నది. అయన ప్రారంభించిన నవజవాన్ భారత్ సభ, హిందుస్థాన్ రిపబ్లికన్ అసోసియేషన్‌కు స్పష్టత అద్దాడు. హెచ్ఎస్ఆర్ఏగా మార్పు చేయడం ఆయన ఆలోచన విధానానికి సూచిక. ఆ విధానాన్ని వివిధ సందర్భాల్లో వ్యక్తం చేశాడు. ఆయనకు పడిన ఉరిశిక్షను తగ్గించడానికి తన తండ్రి చేసిన ప్రయత్నాన్ని తీవ్రంగా నిరసించాడు. సిద్ధాంతాలకన్నా తన జీవితం గొప్పది కాదన్నాడు. బ్రిటిష్ రాజ్యాన్ని కూలగొట్టాలనే సంకల్పం ఉన్నదని, దేశద్రోహ కుట్ర కేసు మోపారు.అది నేరమని భావిస్తే తమను ఉరి తీయటం కన్నా తుపాకీతో కాల్చమని ఉత్తరం రాశాడు. పురోగతి కోసం నిలబడే ఏ వ్యక్తి అయినా పాత విశ్వాసంలోని ప్రతి అంశాన్ని విమర్శించాలి, అవిశ్వాసం పెట్టాలి, సవాలు చేయాలి. ఇదే అయన ఆలోచన విధానం, ఎంతటి విప్లవాత్మకం? ”ప్రజలు స్థిరపడిన విషయాల క్రమానికి అలవాటు పడతారు, మార్పు అనే ఆలోచనతో వణికిపోతారు. ఈ బద్ధకమైన స్ఫూర్తిని విప్లవాత్మక స్ఫూర్తితో భర్తీ చేయాలి” అనే భావన ఆయనలో సామాజిక స్థితిగతుల్ని అధ్యయనాన్ని ప్రతిబింబిస్తున్నది. ”నా వేడితో బూడిదలోని ప్రతి చిన్న అణువు కూడా చలనంలో ఉన్నట్టు, జైలులో కూడా నేను స్వేచ్ఛగా ఉన్నాను. తత్వశాస్త్రం అనేది మానవ బలహీనత లేదా జ్ఞానం పరిమితి ఫలితం” అన్న అయన మాటలు తనలోని తాత్వికతకు అద్దం పడతాయి. ప్రభుత్వం పట్ల ప్రజల పోరాట పంథా విషయంలో అయన చెప్పిన మాటలకు ఎంత ప్రసంగికత ఉన్నదో! చెవిటివారు వినవలసి వస్తే, శబ్దం చాలా బిగ్గరగా ఉండాలన్నదే ఆ పంథా.
భగత్‌సింగ్ రాజీలేని దేశభక్త కుటుంబం నేపథ్యం కలవాడు. పంజాబ్‌ను బ్రిటీష్‌వారు స్వాధీనం చేసుకున్నాక వచ్చిన కరువు కాటకాలు, ఆంగ్లేయులు పెంచిన నీటితీరువ అనేక రేట్లు పెంచి భారాలు మోపినప్పుడు జరిగిన రైతాంగ పోరాటాలకు భగత్‌సింగ్ బాబారు అజిత్‌సింగ్ నాయకత్వం వహించాడు. తీవ్ర జైలుశిక్ష అనంతరం ప్రవాసజీవితం గడిపాడు. నాన్న కిషన్ సింగ్ రైతాంగ పోరాటాలతో మమేకమైన వ్యక్తే. చిన్నతనంలోనే కార్తర్సింగ్ త్యాగాన్ని, ప్రతికూల పరిస్థితుల్లో నమ్మిన ఆశయం కోసం నిలబడిన గదర్ వారసత్వం పుణికిపుచ్చుకున్నాడు. కర్తార్ సింగ్ శరభకు భగత్‌సింగ్‌కి అనేక పోలికలు కనపడతాయి. కర్తర్సింగ్ శరభ మొదటి లాహోర్ కుట్ర కేసులో ఉరితీయబడితే, భగత్‌సింగ్ రెండో లాహోర్ కుట్ర కేసులో ఉరితీయబడ్డాడు. కామగటమరు ఘటన తర్వాత లేవదిద్దామనుకున్న రెండో సిపాయిల తిరుగుబాటు కోసం కర్తర్సింగ్ శరభ, సచీంద్రనాథ్ సన్యాల్, విష్ణుగణేష్ పింగళే, రస్బిహారీ బోస్ తదితరులతో కష్టకాలంలో సంబంధాలు పెట్టుకుని కృషిచేసినట్టే. కాకోరి ఘటన అనంతరం వెనుకపట్టుపట్టిన విప్లవ కార్యకరమాలను చంద్రశేఖర్ ఆజాద్, భగవతిచరణ్ వోహ్రా, జాతీనదాస్, శివవర్మ, సుఖదేవ్, రాజగురు తదితరులతో ముందుకు నడిపాడు. బాంబులు, యాక్షన్ ప్లాన్ల ఆరాధన నుండి హిందూస్థాన్ రిపబ్లిక్ ఆర్మీని హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లిక్ అసోషియన్గా మార్పు చేశాడు. సోషలిస్ట్ విప్లవమే సమూలమార్పునకు అవసరం అనే దశకు చేర్చింది తన అధ్యయనం. కమ్యూనిస్టు నాయకులు బకునిన్, దోస్త్వస్కీ, మార్క్స్, లెనిన్లను అధ్యయనం చేశాడు. అతి పిన్న వయసులోనే గాంధీకున్న ప్రజాధరణను పొందగలిగాడు.
భగత్సింగ్పౖౖె బ్రిటిష్‌వారు మోపిన దేశద్రోహ కేసులు నేటికీ ‘ఎలుకలకు’ నచ్చని వాళ్లపై మోపుతూనే ఉన్నారు. పొద్దునే లేస్తే పక్కదేశంపై, పక్క మతస్తునిపై, పక్క కులస్తునిపై, పక్క భాషవాసిపై ద్వేషం నింపే పనిలో ప్రజలను నిమగం చేస్తున్నారు. కానీ ‘ఇంటివాడు’ మోపుతున్న భారాలు, ఎగ్గొడుతున్న రుణాలు, కొల్లగొడుతున్న వనరులు కనిపించకుండా చేయటానికే ఇదంతా అనేది తెలుస్తూనే ఉంది. ఇప్పుడు మతం పేర గతం పేర ఉన్మాదంతో ప్రజల్ని మభ్యపెట్టే పనిలో ఉన్నారు ఏలికలు. అనేక సారూప్యతలు, పరిమితులు ఉండి ఒకేసారి స్వతంత్రం సాధించిన చైనా, ఇండియాలు అనేక రంగాల్లో పరస్పర అభిముఖంగా ప్రయాణం చేస్తున్న విషయాన్ని ప్రజలు గమనిస్తూనే ఉన్నారు.
(నేడు భగత్‌సింగ్ వర్థంతి)
– కాడిగల్ల భాస్కర్, 9491118822