వినాస్త్రీయ జననం నాస్తి (స్త్రీ లేకపోతే జననం లేదు), వినాస్త్రీయ గమనం నాస్తి (స్త్రీ లేకపోతే గమనం లేదు), వినాస్త్రీయ జీవం నాస్తి (స్త్రీ లేకపోతే సష్టిలో జీవం లేదు), వినాస్త్రీయ సష్టియేవ నాస్తి (స్త్రీ లేకపోతే అసలు సష్టే లేదు) అని సినిమా మాధ్యమాలలో మన కథానాయకులు చెప్పే డైలాగులకు ప్రేక్షకులు కరతాళ ధ్వనులతో బ్రహ్మరథం పట్టిన దశ్యాలను చూస్తుంటేనే అర్థమవుతుంది…
సమాజంలో స్త్రీ పై ఉన్న గౌరవం. ‘యంత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతా’ అంటారు. అంటే ‘ఎక్కడ స్త్రీలు పూజింపబడతారో, అక్కడ దేవతలు సంతోషిస్తారు’ అని అర్థం. కుటుంబమైనా, సమాజమైనా, దేశమైనా స్త్రీని గౌరవిస్తేనే దాని గౌరవం ఇనుమడిస్తుంది. స్త్రీకి వుండే ఉత్తమ వ్యక్తిత్వం, ఉన్నతమైన సంస్కారం, కుటుంబానికే కాదు దేశానికే గర్వకారణమవుతుంది. స్త్రీ పుట్టినప్పటి నుంచి ప్రతి దశలోనూ తనదైనశైలిలో ప్రేమానురాగాలను పంచుతూనే ఉంటుంది. ‘సష్టికర్త ఒక బ్రహ్మ అతనిని సష్టించినదొక అమ్మ…’ అని కవి కలం రాసినది అక్షర సత్యమేగా.
మహిళ ఓ సవ్యసాచి:
అనాటి నుంచి ఈనాటి వరకు సమాజంలో స్త్రీ ఎప్పటికప్పుడు తనను తాను నవీకరించుకుంటూ నిరూపించుకుంటూనే ఉంది. అహంకారంతో కాక ఆపాయతతో పరిపాలించే ఉత్తమ ఇల్లాలుగా, పిల్లలకు తల్లిగా, మొదటి గురువుగా ఉత్తమ గుణాలను నేర్పి, ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్ది ఉన్నతమైన సమాజ నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తుంది. తన ఆలనా పాలనలతో కుటుంబాన్ని తీర్చిదిద్దటమే కాదు, ఆర్థికంగా కూడా కుటుంబాన్ని పోషిస్తుంది నేటి మహిళ. అటు కుటుంబ అభివద్ధిలోనూ, ఇటు సమాజ అభివద్ధిలోనూ తన పాత్రను సమర్థవంతంగా పోషిస్తున్న మహిళ నిజంగానే ఓ సవ్యసాచి.
మహిళ ఓ బహుముఖ ప్రజ్ఞాశాలి:
స్త్రీకి ఎన్నో పరిమితులు ఉన్న ఆరోజుల్లోనే, బ్రిటీష్ వారి అరాచకాలకు వ్యతిరేకంగా సరోజినీ నాయుడు, ఝాన్సీ రాణి లక్ష్మీబాయి, సరళా దేబీ చౌధురాణి, అన్నపూర్ణాదేవి, దువ్వూరి సుబ్బమ్మ లాంటి ఎందరో మహిళలు బ్రిటిష్ పాలకులు ఎన్ని ఇబ్బందులు పెట్టినప్పటికీ ధైర్యంగా స్వాతంత్య్రోద్యమంలో పాల్గొని వారిని దేశం నుంచి వెళ్లగొట్టాలనే గట్టి నిర్ణయంతో ముందుకు సాగి, మహిళలలో ఉన్న ఆత్మస్థైర్యానికి, ధైర్యానికి ప్రతిరూపమై, భవిష్యత్తు తరాలకు ఆదర్శంగా నిలిచారు. ఎంతో సహనంగా వుండే మహిళ అవసరమైతే భద్రకాళిలా భయ పెట్టగలదు, సత్యభామలా దుష్ట శిక్షణ చేయగలదు, రుద్రమదేవిలా యుద్ధమూ చేయగలదు. అందుకే మహిళను ఓ బహుముఖ ప్రజ్ఞాశాలిగా అభివర్ణించవచ్చు.
మహిళల విజయాలు – సవాళ్లు – ప్రరిష్కారాలు:
ప్రస్తుత సమాజంలో మహిళల పాత్ర కాలానుగుణంగా మార్పు చెందుతూ పురోగతివైపు దూసుకుపోతుంది. విద్య, ఉద్యోగ, రాజకీయ, సామాజిక చైతన్యంతో వివిధ రంగాల్లో మహిళలు అద్భుతమైన ప్రగతిని సాధిస్తున్నారు. మహిళలు ఉన్నత విద్య అభ్యసిస్తూ ప్రభుత్వ, ప్రైవేటు రంగాలలో శారీరక, మానసిక ఒత్తిడిని సైతం తట్టుకొని పురుషులతో సమానంగా అన్ని రకాల ఉద్యోగాలను చేస్తున్నారు. అంతేకాదు, వ్యాపార, రాజకీయ, క్రీడా, అంతరిక్ష రంగాలలో పురుషులతో పోటీపడి మంచి విజయాలను సాధిస్తున్నారు. మహిళలు విజయాలు సాధిస్తున్నప్పటికీ అప్పుడప్పుడు అక్కడక్కడ కొన్నిసవాళ్లను, అసమానతలను ఎదుర్కొంటూనే ఉన్నారు. గహ హింస, లైంగిక వేధింపులు, లింగ వివక్ష, విద్య, ఉపాధి పొందడంలో అడ్డంకులు, వేతన అసమానతలు వంటి అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నారు.
అసమానతలను రూపుమాపి, మహిళా సాధికారికతను ప్రోత్సహించడానికి, వారు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వాలు వివిధ ఆరోగ్య సంక్షేమ పథకాలను, చట్టాలను, అవగాహన కార్యక్రమాలను రూపొందిస్తున్నాయి. సాధికారికతను ప్రోత్సహించేందుకు విద్య, శిక్షణ, ఆర్థిక సాధికారత, నాయకత్వ అభివద్ధికి సంబంధించిన కార్యక్రమాలను ప్రభుత్వాలు రూపొందిస్తున్నాయి. లింగ-ఆధారిత హింసను నిరోధించడానికి, సమానత్వాన్ని, సమాన వేతనాన్ని ప్రోత్సహించడానికి, చట్టసభలలో మహిళల ప్రాతినిధ్యాన్ని పెంచడానికి ప్రభుత్వాలు అనేక చట్టాలను రూపొందించాయి.
ముగింపు మాటగా… వ్యవస్థాగత అసమానతలను, పక్షపాతాలను, అవరోధాలను, అడ్డంకులను ఛేదించుకుని మహిళా హక్కుల కోసం న్యాయపోరాటాలు చేసి ప్రపంచ వ్యాప్తంగా మహిళలకు గుర్తింపును తీసుకొచ్చిన వీర వనితలందరినీ స్మరించుకుని వారు చేసిన పోరాటాలను, త్యాగాలను కొనియాడుదాం. ముఖ్యంగా, నేటి మహిళ శక్తి యుక్తులను, సాధించిన విజయాలను, సాధిస్తున్న పురోగతిని ఈ సందర్భంగా ప్రశంసిద్దాం. సాధించాలనుకుంటున్న వారి ఆశయాలకు, లక్ష్యాలకు ప్రోత్సాహంగా ఉందాం. ప్రతి స్త్రీ స్వేచ్ఛగా అభివద్ధి చెందగల, గౌరవంగా జీవించగల, హింసా రహిత, వివక్ష లేని సమాజ నిర్మాణానికి ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు, ప్రజలు కలిసి కషి చేయ్యాలి. వంట గదిలో షడ్రుచులను తయారుచేసి అందరికీ అమ్మలా వడ్డించే ఆమె, నేడు ప్రపంచ స్థాయిలో అన్ని రంగాలలో సాధిస్తున్న పురోగతి, అందుకు అనుగుణంగా ఆమె చెందుతున్న రూపాంతరం అమోఘం, అద్భుతం, అభినందనీయం.
– ననుబోలు రాజశేఖర్,
9885739808