భారత జీడీపీ అంచనాలకు కోత

India's GDP estimates cut– 2025-26లో 6.5 శాతమే
– ఎస్‌అండ్‌పీ గ్లోబల్‌ అంచనా
న్యూఢిల్లీ : భారత జీడీపీ అంచనాలకు ఎస్‌అండ్‌పీ గ్లోబల్‌ రేటింగ్స్‌ కోత పెట్టింది. వచ్చే ఆర్ధిక సంవత్సరం (2025-26)లో భారత వృద్ధి రేటు 6.5 శాతానికే పరిమితం కావొచ్చని అంచనా వేసింది. అమెరికా టారీఫ్‌ విధానాలు వర్ధమాన దేశాలపై ప్రతికూల ప్రభావం చూపనుందని విశ్లేషించింది. ఈ నేపథ్యంలోనే భారత వినిమయ డిమాండ్‌ను దెబ్బతీయనుందని పేర్కొంది. ”2026 మార్చి 31తో ముగియనున్న ఆర్ధిక సంవత్సరంలో భారత జీడీపీ 6.5 శాతానికి పరిమితం కావొచ్చు. ఇంతక్రితం ఈ అంచనా 6.7 శాతంగా ఉంది. వచ్చే వర్షాకాలం సీజన్‌ సాధారణంగా ఉండొచ్చు. అదే విధంగా కమోడిటీ, చమురు ధరలు సానుకూలంగా నమోదు కావొచ్చు.” అని ఎస్‌అండ్‌పీ పేర్కొంది. ”ఆసియా, ఫసిపిక్‌ రీజియన్‌లోని సెంట్రల్‌ బ్యాంక్‌ వడ్డీ రేట్లను తగ్గించొచ్చని అంచనా. రిజర్వు బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా మరో 75-100 బేసిస్‌ పాయింట్ల మేర వడ్డీ రేట్లను కోత పెట్టొచ్చు. అహార ధరలు తగ్గొచ్చు. వచ్చే 2025-26లో రిటైల్‌ ద్రవ్యోల్బణం 4 శాతంగా ఉండొచ్చు.” అని ఎస్‌అండ్‌పీ తెలిపింది.
ఆర్బీఐ ఇటీవల విధాన సమీక్షలో రెపోరేటును 25 బేసిస్‌ పాయింట్లు తగ్గించి 6.50 శాతం నుంచి 6.25 శాతానికి కోత పెట్టింది. ప్రస్తుత ఆర్ధిక సంవత్సరం (2024-25)లో భారత జీడీపీ 6.4 శాతానికి పరిమితం కావొచ్చని ఇటీవల నేషనల్‌ గణంకాల శాఖ (ఎన్‌ఎస్‌ఒ) అంచనా వేసింది. ఇది నాలుగేండ్లలోనే అత్యంత కనిష్ట స్థాయి కావడం ఆందోళనకరం. ఇంతక్రితం 2023-24లో జీడీపీ 8.2 శాతం పెరిగింది. 2024-25లో 6.6 శాతం వృద్ధి ఉండొచ్చని ఆర్బీఐ ఇటీవల అంచనా వేసింది. వీటితో ఎస్‌అండ్‌పీ అంచనాలు పోల్చితే ప్రస్తుత, వచ్చే ఆర్ధిక సంవత్సరంలో గొప్ప ఆశాజనక వృద్ధి రేటు కానరాకపోవడం ఆందోళనకరం.

Spread the love