జీవితపు లోతుల్ని తెలిపే ‘ఖుర్బాని’

'Qurbani' reveals the depths of lifeసమాజంలోని అసమానతల గూర్చి తెలియజేస్తూ రాసిన కథె ”హంస”. ప్రతి సంవత్సరం ప్రభుత్వాలు ఎన్నోకోట్లు వార్షిక బడ్జెట్లో విద్యపై ఖర్చు పెడుతుంటారు. కానీ అవి ఎంతవరకు సక్సెస్‌ అవుతున్నాయి అనేది మాత్రం ఇక్కడ ఒక ప్రశ్నగానే మిగిలిపోతుంది. దేశంలో ఎంతోమంది పేద ప్రజలు ఉన్నారు, సంచార జాతుల వారు ఉన్నారు. వీరిలో ఎవరికీ కూడా విద్య అన్నది ఒక అందని ద్రాక్షగానే మిగిలిపోతుంది. ఎందుకంటే వారి కుటుంబ పోషణ, వారి పోషణకే పొద్దున లేచిన నుండి పడుకునే వరకు ఏదో ఒక పని చేస్తూ ఉంటేనే వారి జీవితం గడిచిపోతుంది. మనసులో చదువుకోవాలని ఎంత ఉన్నా కడుపేదరికం వల్ల విద్యకు దూరమవుతు బతికీడుస్తున్న అనేకమందిని సమాజంలో చూస్తుంటాం. చదువుకొని మంచి ఉద్యోగం చేసి ఉన్నతంగా బ్రతకాలని ‘హంస’ పాత్ర మలచిన తీరు బావుంది.
‘ప్రశ్నించే నీడ’ ఈ కథ చదువుతుంటే ఆకలి మనిషిని ఏ పనైనా చేయడానికి సిద్ధపడుతుంది అని తెలియజేసే కథ. ఈ కథలో 20 సంవత్సరాలు ఉన్న ఒక స్త్రీ సరి అయిన వస్త్రాలు లేకుండా చేతిలో ఒక చిప్ప పట్టుకుని ‘అన్నం పెట్టండి ఆకలవుతుంది, పుణ్యం వస్తుంది మీకు’ అని ఎంతో దీనంగా అర్థిస్తూ ఇల్లు ఇల్లు తిరుగుతుంది. ఒక ఇంటి యజమాని ఆమెను కసురుకుంటూ నానా బూతులు తిడుతూ ఆమెను అక్కడి నుండి పంపించేస్తాడు. ఆ ఇంటి యజమాని వాళ్ళ ఆవిడ పుట్టింటికి వెళ్తుంది ఒకరోజు, అదే రోజు రాత్రి ఆ యజమాని ఒక స్త్రీని తీసుకుని వచ్చి ఇంటిలో తన కోరిక తీర్చుకుంటాడు. ఇదంతా ఇంటి పైన అద్దెకు ఉన్న అతను గమనిస్తుంటాడు. చివరికి ఆమె వెళుతుంటే ఎవరై ఉంటారని ఈ అద్దెకున్న అతను చూసేసరికి పొద్దున్నే గేటు ముందట ఆడుక్కోవడానికి వచ్చిన ఆ స్త్రీయే. హదయాన్ని కలచివేసే కథ.
‘నషా’ ఈ కథ అందరి మనసులను ఆలోచింపజేసే కథ. తాగుడుకు బానిసైతే కుటుంబం ఎంత నష్టపోతుంది అదే తాగుడు బంద్‌ చేస్తే కుటుంబం ఎంత బాగుంటుంది అని తెలియజేసే కథ. ఈ కథను కుల మతాల చట్రంలో ఇరుక్కుని మత విద్వేషాలు పెంపొందించే వారికి కనువిప్పు కలిగించే విధంగా, అందరూ సమానమే అని తెలియజేస్తూ కులమతాల పట్టింపు లేకుండా కోపతాపాలు మరిచి మనుషుల్ని మనుషులుగా ప్రేమించాలి అని చాలా చక్కగా చెప్పే కథ.
కులాలు మతాలు ప్రాంతాలు కాదు మనిషిలోని మంచితనం గుర్తించడానికి. ఆపదలో ఉన్న వ్యక్తికి సహాయం చేయడమే మంచి కులం మంచి మతం అనిపించుకుంటుంది. దేవున్ని ఆరాధించడానికి వస్తువులో, మూగజీవాలనో లేక డబ్బునో సమర్పించడం కాదు కానీ పూర్ణ హదయాన్ని దేవుని ముందట అర్పించడం. అదే కదా దేవునికి నిజమైన అర్పణ. మానవసేవయే మాధవసేవ అనే నానుడి నుండి చక్కని ‘ఖుర్భాని’ కథను రాశారు. ఈ కథలోని పాత్రలైనా బిలాల్‌, రాములమ్మ మరియు మల్లయ్య పాత్రలను చాలా చక్కగా ఎలివేట్‌ చేశారు. ఇంటి పక్కనే ఉన్న రాములమ్మను బిలాల్‌ సొంత అక్కలా భావిస్తాడు. రాములమ్మ బిడ్డ జయమ్మకు పురిటి నొప్పులు రావడంతో పెద్ద ఆసుపత్రికి వెళ్లి డెలివరీ చేయించుకోవడానికి డబ్బులు లేకపోవడంతో దీనంగా సాయం కోసం ఎదురుచూస్తున్న సమయంలో విషయం తెలుసుకున్న బిల్లాల్‌ తన దగ్గర డబ్బు లేకపోవడంతో బక్రీద్‌ కొరకు తీసుకొచ్చిన యాటపోతును అమ్మి మరికొంత డబ్బు తన దగ్గర ఉన్నది తీసుకొని బిలాల్‌, బిలాల్‌ భార్య తో కలిసి ఆటోలో రాములమ్మను మరియు జయమ్మను తీసుకొని పక్కన ఉన్న పటనానికి వెళ్లి ఆపరేషన్‌ చేపిస్తాడు. రాములమ్మ అన్న మల్లయ్య జరిగిందంతా తెలుసుకొని బిలాల్‌ చేసిన సహాయాన్ని గుర్తించి మంచి మనసుకు ఖుషీగా బిలాల్‌కి డబ్బిస్తాడు. ఇరువురు మధ్యన జరిగిన సంభాషణలు చదువుతున్నప్పుడు హదయం ఎంతో బరువెక్కిపోతుంది. ఎంతో ఆర్ధత నిండిన కథ కుర్బానీ.
‘ఉల్టా బాజా’ కథలో గూడెంలో పుట్టి పెరిగి అనాధగా మిగిలిపోయిన మట్టన్న శవాన్ని దహన సంస్కారం చేయడానికి ఊర్లోని వారు ఎవరు కూడా ముందుకు రారు. తక్కువ కులంలో పుట్టాడని నెపంతో హిందూ స్మశాన వాటికలో కూడా బొంద పెట్టడానికి ఒప్పుకోరు ఊరి జనాలు. చివరికి చిన్ననాటి స్నేహితుడు గోరిమియా తన పొలంలోనే మట్టన్నకు ధహన సంస్కారాలు నిర్వహిస్తాడు. మట్టన్న పెంచుకున్న కుక్కపిల్ల మాత్రం మట్టన్న కోసం తల్లడిల్లడం చూస్తాం. ఈ కథలో కుక్కకున్న విశ్వాసం మనుషులకు లేదేమిటి అని ఎంతో చక్కగా కథనాన్ని నడిపించారు రచయిత.
పొట్టకూటి కోసం హిజ్రాలుగా మారుతున్న ఎంతోమంది గురించి, జీవనోపాధి కొరకు ఊరిలో సరియైన అవకాశాలు లేక నగరానికి వస్తున్న నిరుద్యోగ యువత, అనాథల జీవితాలను బేస్‌ చేసుకొని వ్యంగంగా రాసిన కథే ‘మాసిపోని మరకలు’. మరో సామాజిక అంశం అయినా గూడెం బతుకుల గురించి రాసిన కతే ‘పరిష్కారం’. గూడెంలో ఇప్పటికి ఆ గుడిసెల్లోనే ఎందుకు వారి జీవితాలు మగ్గిపోతున్నాయి అని, దీనంతటికీ సరియైన విద్య లేకపోవడం మరియు ఎలక్షన్లలో ఓటుకు నోటుకో లేదా మద్యానికో అమ్ముడుపోయి వారికి ఓట్లేయడమే కారణమంటూ బతుకులు మారాలంటే విద్య మరియు సరైన నాయకున్ని ఎన్నుకోవడమే సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది అని మంచి సామాజిక అంశాన్ని ఎత్తుకొని కథను రాశారు.
”మూడో నెల” ఈ కథ భలే ఉంటది. మొదటగా సీరియస్‌ గానే కథ మొదలవుతుంది. లోకనాథం అలివేలుకి పెళ్లయి 15 సంవత్సరాలు అయినా పిల్లలు కాకుండా పోవడంతో ఇద్దరిలో పిల్లలు కాలేరు అనే బాధ ఉంటుంది. అలివేలు పక్కింటి ఆవిడతో ఒకరోజు మూడో నెల అని చెబుతుండడం విన్న లోకనాథం నాకు చెప్పకుండా పక్కింటి ఆవిడకి చెప్పిందని బాధకు గురవుతాడు. ఉన్నట్టుండి మూడు రోజులు లోకనాథం కనిపించకపోవడంతో అలివేలులో దుఃఖ%శీ% మొదలవుతుంది. చుట్టాలందరూ వచ్చి ఇంట్లో చేరుతారు. పోలీస్‌ స్టేషన్లో కూడా కంప్లైంట్‌ చేస్తారు. ఇంటినిండా చుట్టాలు తెలిసిన వారందరూ టెన్షన్‌ కి గురవుతుండగా దేవుని మాల వేసుకుని లోకనాథం ఇంటికి వస్తాడు. అందరూ ఆశ్చర్యపోయి ఎటు వెళ్ళావని లోకనాథం పై కోపంకి వస్తారు. జరిగినదంతా లోకనాథం అలివేలు చెప్పడంతో అందరి ముఖాలలో నవ్వులు పూస్తాయి. అసలు మూడో నెల అంటే ఆ మూడో నెల కాదు కానీ పోస్ట్‌ ఆఫీస్‌ లో ‘సమద్ధి యోజన పథకంలో’ చేరి మూడు నెలలు అవుతుంది అని చెప్పడంతో సీరియస్‌ గా సాగుతున్న కథ, హాస్యభరిత కథగా ముగుస్తుంది. బండి కదిలింది, రంగుల వల, కలవరింత, ఒకనాటి మాట కాదు మొదలైన చాలా కథలు వైవిధ్యంగా వున్నాయి.
ఈ పుస్తకంలోని కథలన్నీ తెలంగాణ యాసలోనే కొనసాగుతాయి. ప్రతి కథ మన చుట్టూరా జరిగిన సన్నివేశాలు మన కళ్ళ ముందు కదలాడినట్టు ఆ కథలో మనము ఉన్నట్టు అనిపిస్తుంది. కథలో ఎక్కడా కూడా వివక్షకు గాని మత విద్వేషాలు గానీ వాటి జోలికి పోకుండా మనుషుల మధ్య ప్రేమపూర్వకమైన వాతావరణాన్ని నెలకొల్పేలా కొనసాగుతాయి. సమాజాన్ని ఎంతో ఆలోచింప చేసే విధంగా ఈ కథలను రాసిన సయ్యద్‌ గఫార్‌కు అభినందనలు.
– గాజోజి శ్రీనివాస్‌, 9948483560

Spread the love