– రణదివే వర్థంతిలో సీఐటీయూ సీనియర్ నాయకులు పి.రాజారావు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
కార్మికోద్యమానికి, కార్మిక సంఘాల నాయకత్వానికి బి.టి.రణదివే బోధనలు, రచనలు స్ఫూర్తిదాయకమని సీఐటీయూ సీనియర్ నాయకులు పి.రాజారావు చెప్పారు. ఆదివారం హైదరాబాద్‌లోని సీఐటీయూ రాష్ట్ర కార్యాలయంలో బి.టి.రణదివే వర్థంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా రణదివే చిత్రపటానికి ఆయన పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..సీఐటీయూ వ్యవస్థాపక అధ్యక్షులుగా సుదీర్ఘకాలం కార్మికోద్యమానికి నాయకత్వం వహించారన్నారనీ, కమ్యూనిస్టు ఉద్యమంలోకి 1928లో వచ్చి 1990 వరకు కొనసాగారని గుర్తుచేశారు. కార్మికోద్యమంలో కుల, మత, ప్రాంతీయ ఉద్యమాల ప్రభావం గురించి ఆయన విశ్లేషించారని తెలిపారు. శ్రామిక మహిళలను ఆర్గనైజ్ చేయాల్సిన ప్రాధ్యానతను నొక్కి చెప్పారని గుర్తుచేశారు. ప్రపంచ కార్మికోద్యమంలో రెండో ఇంటర్నేషన్‌లో కూడా భాగస్వామిగా ఉన్నారని చెప్పారు. సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు భూపాల్ మాట్లాడుతూ బీటీఆర్ స్ఫూర్తితో నేడు కార్మికవర్గ ఐక్యత కోసం కృషి చేయాలన్నారు. రాష్ట్ర కార్యదర్శి జె. వెంకటేష్ మాట్లాడుతూ రాష్ట్రంలో సీఐటీయూ ఆధ్వర్యంలో ఆదివారం నుంచి 14 వరకు రాష్ట్ర వ్యాప్తంగా జరుగనున్న సామాజిక న్యాయ వారోత్సవాలను జయ ప్రదం చేయాలని కోరారు. కార్యక్రమంలో సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు వీఎస్.రావు, ఎస్వీ. రమ, రాష్ట్ర కార్యదర్శి కూరపాటి రమేష్, రాష్ట్ర కమిటీ సభ్యులు వై. సోమన్న, పి. సుధాకర్, ఎ. సునీత, తదితరులు పాల్గొన్నారు.