కల్లలవుతున్న అమెరికా కలలు

కల్లలవుతున్న అమెరికా కలలు– తాజా ఇమ్మిగ్రేషన్‌ నిబంధనలతో భారతీయుల బేజారు
న్యూఢిల్లీ : ఇమ్మిగ్రేషన్‌పై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ తీసుకుంటున్న కఠిన నిర్ణయాలు భారతీయులకు అశనిపాతంగా మారుతున్నాయి. వారి అమెరికా కలలు గాలిమేడలుగా కూలిపోతున్నాయి. మే నెలకు సంబంధించి అమెరికా విదేశాంగ శాఖ తాజాగా జారీ చేసిన వీసా బులెటిన్‌తో వారి ఆశలన్నీ ఆవిరై పోయాయి. ముఖ్యంగా హెచ్‌-1బీ వీసాలు, గ్రీన్‌కార్డులు కోరుకుంటున్న వారి నెత్తిన పిడుగు పడింది. ఉపాధి ఆధారిత ఐదో ప్రాధాన్యత (ఈబీ-5) కేటగిరీ కింద కటాఫ్‌ తేదీలో చేసిన మార్పులతో భారతీయులు ఖంగుతిన్నారు. ఈ బులెటిన్‌ ప్రకారం… భారతీయులకు ఈబీ-5 అన్‌ రిజర్వ్‌డ్‌ కేటగిరీ వీసా జారీ కటాఫ్‌ తేదీ ఆరు నెలల పాటు (2019 మే 1 వరకూ) వెనక్కి పోయింది. మరోవైపు చైనీయులకు ఇదే వీసా కటాఫ్‌ తేదీ 2014 జనవరి 22 వద్దే నిలిచిపోయింది.
‘ఈబీ-5 అన్‌ రిజర్వ్‌్‌డ్‌ వీసా కేటగిరీల లో భారతీయుల నుండి ఎక్కువ డిమాండ్‌ వస్తోంది. మిగిలిన ప్రపంచ దేశాల నుండి కూడా ఎక్కువ మంది ఈ కేటగిరీ కింద దరఖాస్తులు చేస్తున్నారు. దీంతో భారత్‌ కటాఫ్‌ తేదీని మరింత తగ్గించాల్సిన అవసరం ఏర్పడింది’ అని ఆ బులెటిన్‌లో వివరించారు. కాగా ఉపాధి ఆధారిత తొలి ప్రాధాన్యత (ఈబీ-1), ద్వితీయ ప్రాధాన్యత (ఈబీ-2) కటాఫ్‌ తేదీలలో ఎలాంటి మార్పులు చేయలేదు. మూడో ప్రాధాన్యత (ఈబీ-3) కేటగిరీ కింద భారత కటాఫ్‌ తేదీని రెండు వారాలు ముందుకు జరిపి 2013 ఏప్రిల్‌ 15వ తేదీగా నిర్ణయించారు. ‘2025 ఆర్థిక సంవత్సరంలో కుటుంబ సభ్యులు స్పాన్సర్‌ చేసే వలసవాదుల సంఖ్యను 2,26,000గా నిర్ణయించడం జరిగింది. వార్షిక ఉపాధి ఆధారిత ఇమ్మిగ్రెంట్ల సంఖ్యను 1,40,000గా నిర్ణయించాం’ అని విదేశీ మంత్రిత్వ శాఖ బులెటిన్‌ తెలిపింది.
ట్రంప్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత…
డోనాల్డ్‌ ట్రంప్‌ అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆ దేశ రాజకీయాలలో ఇమ్మిగ్రేషన్‌ మరోసారి కీలక అంశంగా మారింది. ‘అమెరికా ఫస్ట్‌’ అనే రిపబ్లికన్ల అజెండా నేపథ్యంలో అమెరికాలో ఎవరు, ఏ పరిస్థితులలో ప్రవేశించవచ్చు, ఎంతకాలం ఉండవచ్చు అనే విషయాలపై చర్చోపచర్చలు సాగుతున్నాయి. అక్రమ వలసదారులపై ట్రంప్‌ ప్రభుత్వం ఇప్పటికే ఉక్కుపాదం మోపి, వారిని స్వదేశాలకు సాగనంపుతోంది.
కటాఫ్‌ తేదీ అంటే…
అమెరికా విదేశాంగ శాఖ ప్రతి నెలా వీసా బులెటిన్‌ విడుదల చేస్తుంది. వివిధ దేశాల వారికి వీసా లభ్యతకు సంబంధించిన కటాఫ్‌ తేదీలను అందులో తెలియజేస్తుంది. ఏ అభ్యర్థులు తమ వీసా స్టేటస్‌ సర్దుబాటుకు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులో లేదా శాశ్వత నివాసానికి అర్హులో ఆ తేదీని బట్టే నిర్ణయిస్తారు. తాజాగా విడుదల చేసిన బులెటిన్‌లో పేర్కొన్న కటాఫ్‌ తేదీకి ముందున్న ప్రాధాన్యతా తేదీతో దరఖాస్తు చేసుకున్న వారికి శాశ్వత నివాసానికి అర్హులుగా గుర్తిస్తారు. నిర్దిష్ట నెలలో అందుబాటులో ఉన్న వీసాల కంటే ఏదైనా కేటగిరీ కింద ఎక్కువ దరఖాస్తులు వచ్చినా లేదా ఏదైనా దేశం నుండి ఎక్కువ దరఖాస్తులు వచ్చినా వీసా కటాఫ్‌ తేదీని తగ్గిస్తారు.

Spread the love