భారత కార్మికవర్గం పోరాడి సాధించుకున్న వేతనాల చెల్లింపు చట్టం-1936, కనీస వేతనాల చట్టం-1948, బోనస్ చెల్లింపు చట్టం-1965, సమాన పనికి – సమాన వేతన చట్టం-1976 చట్టాల్లో కొన్ని పరిమితులు, లోపాలున్నప్పటికీ కార్మికులకు కొన్ని హక్కులు కల్పిస్తూ ఉపయోగకరంగా ఉన్నాయి. ఈ నాలుగు చట్టాలను పెట్టు బడిదారుల ప్రయోజనం కోసం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రద్దు చేసి వేజ్‌కోడ్-2019ని తీసుకొచ్చి కార్మికులకు తీవ్ర అన్యాయం చేసింది. గతంలో ఉన్న వేతనాల చెల్లింపు చట్టం-1936 వల్ల కార్మికులకు వేతనాలు నిర్ధిష్ట సమయంలో (నెల నెలా) చెల్లించాల్సిందే. కార్మికులకు వేతనాలు చెల్లింపుల్లో ఆలస్యమైతే యాజమాన్యంపై చర్యలు తీసుకోవచ్చు. యజమాని కార్మికుల వేతనం నుండి ఇష్టానుసారంగా డబ్బు తగ్గించలేడు. కేవలం చట్టపరంగా అనుమతించ బడిన పద్ధతుల్లో మాత్రమే రికవరీ చేయవచ్చు. (ఉదా: ట్యాక్స్, ఫైన్, లోన్) కంపెనీలో వేతనాల లెక్కలు,తగ్గింపులు, బోనస్ లాంటి వివరాలు సృష్టంగా ఉండాలి. కార్మికులు వాటిని చూసే హక్కు కలిగి ఉంటారు. పనిచేసిన పని గంటలకు పూర్తి వేతనం పొందే హక్కు ఉంటుంది. వేతనం చెల్లించకపోతే లేదా అన్యాయం జరిగితే కార్మికులు లేబర్ ఇన్స్‌పెక్టర్‌్‌కు ఫిర్యాదు చేయవచ్చు. బదిలీ, తొలగింపు సమయంలో కూడా పని చేసినంత వరకు వేతనం చెల్లించాల్సిందే. కార్మికులకు వేతనాల చెల్లింపులో అన్యాయం జరిగితే వేతనాల చెల్లింపు చట్టం-1936 ద్వారా కంపెనీ, లేబర్ అధికారులకు కార్మికులు ఫిర్యాదు చేసుకోవచ్చు. చట్టపరంగా వడ్డీతో సహా వేతనం పొందే హక్కు చట్టం కల్పించింది. వేతనం చెల్లించకపోతే కంపెనీపై విచారణ చేసి చర్యలు తీసుకొనే హక్కు చట్టం కల్పిస్తూ కార్మికులకు రక్షణగా ఉన్నది.
కనీస వేతనాల చట్టం-1948 ప్రకారం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ రంగాల్లో పనిచేసే కార్మికులకు కనీస వేతనం నిర్ణయిస్తాయి. మనిషి బతకడానికి అవసరమైన ఆహార పదార్ధాల ధరలు, కుటుంబ అవసరాలు, జీవన వ్యయం మొదలైన వాటిని బట్టి వేతనాలను నిర్ణయిస్తారు. ఆయా రాష్ట్రాల్లో ఖర్చులు, జీవన స్ధితిగతులను వేర్వేరుగా ఉంటాయి. కాబట్టి పెరుగుతున్న ధరలకునుగుణంగా వేతనాలు నిర్ణయించాలి. నిర్ణయించిన కనీస వేత నం కంటే తక్కువ చెల్లిస్తే యజమానికి జరిమాన లేదా శిక్ష విధించవచ్చు. కనీస వేతనాల చట్టం ద్వారా కార్మి కుల ఆర్ధిక స్ధిరత్వం, నిర్భంధ శ్రమను నివారించడం, సామాజిక సమానత్వానికి దోహదం చేస్తుంది ఈ చట్టం. డాక్టర్ ఆక్ట్రాయిడ్ ఫార్ములా ప్రకారం ఒక సాధారణ కార్మికుడు రోజుకు 2,700ల కేలరీల ఆహారం తీసుకోవాలి. అతని భార్య,ఇద్దరు పిల్లలను ఒక కుటుంబంగా పరిగణించి వారికి కావాల్సిన ఆహారం,దుస్తులు, నివాసం, విద్య, వైద్యం, రవాణా వంటి ఇతర అవసరాలను పరిగణలోకి తీసుకుని కనీస వేతనాలు నిర్ణయించాలని ఆక్ట్రాయిడ్ ఫార్ములా చెప్పింది. బోనస్ చెల్లింపు చట్టం-1965 ప్రకారం నెలకు రూ.21వేలు లేదా అంతకంటే తక్కువ వేతనం పొందే ఉద్యోగులకు ఈ చట్టం క్రింద బోనస్‌కు అర్హులు. ఉద్యోగి ఒక సంస్ధలో కనీసం ముప్తై రోజులు పనిచేసి ఉండాలి. ఆ కార్మికునికి కనీసం 8.33శాతం నుండి గరిష్టంగా ఇరవై శాతం వరకు బోనస్ చెల్లించాలి. ఆర్ధిక సంవత్సరం ముగిసిన ఎనిమిది నెలల్లోపు బోనస్ చెల్లించాలి. ఇరవై లేదా అంతకంటే ఎక్కువ మంది ఉద్యో గులు, కార్మికులు ఉన్న సంస్ధలు ఈ చట్టం పరిధిలోకి వస్తాయి. బోనస్ చెల్లింపు చట్టం అమలు చేయని సంస్ధలపై చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చు.
సమాన వేతన చట్టం-1976 ప్రకారం వేతనాల్లో లింగ వివక్ష ఉండకూడదు. ఒకే విధమైన పనిచేసే పురుష, మహిళ కార్మికులకు ఒకే వేతనం ఇవ్వాల్సిన బాధ్యత యాజమానిపై ఉంటుంది. ఉద్యోగి నియామకంలో లేదా ప్రమోషన్‌లో ఉద్యోగావకాశాల విషయంలో స్త్రీ, పురుష తేడా ఉండకూడదు. సమాన వేతన చట్టం కార్మికుల హక్కులను, పరిరక్షించే, సమానతకు దారి తీసే చట్టం. ఈ చట్టాన్ని ఉల్లంఘించిన వారికి జరిమాన లేదా శిక్ష విధిం చవచ్చు. ఇలాంటి కార్మిక చట్టాలను రద్దు చేసి వేతనాల కోడ్-2019 తీసుకువచ్చింది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రద్దు చేసిన నాలుగు చట్టాల్లో ఉన్న కార్మికుల ప్రయోజనాలకు సంబంధించిన అనేక అంశాలు ఈ వేతనాల కోడ్‌లో లేవు.యాజమాన్యాల, పెట్టుబడుదారుల సంపదను పెంచేదిగా వేతనాలు నిర్ణయించే అధికారం ప్రభుత్వాల, యాజ మాన్యాల విచక్షణ, దయాదాక్షిణ్యాలకు వదిలేసింది. కార్మికులకు కార్మిక సంఘాలకు కనీస వేతనాలపై మాట్లాడే హక్కు లేకుండా చేయడం దుర్మార్గం. కనీస వేతనాలను గంట, రోజు, నెలవారీగా పీస్‌రేట్ ప్రకారం ఇవ్వాలని సూచించింది. ఎనిమిది గంటల పని విధానాన్ని ప్రభుత్వాల నిర్ణయానికే వదిలేసింది. అంటే ఎన్ని గంటలైనా పరి శ్రమల, యాజమాన్యం, ప్రభుత్వం కార్మికులతో పని చేయించుకునే నిర్ణయాధికారం ప్రభుత్వాలకు ఉన్నది. ఈ కోడ్‌వల్ల పనిగంటలు పెరిగే ప్రమాదం ఉన్నది. దీని వల్ల అధిక పని గంటల శ్రమ ద్వారా వచ్చే సంపద యాజమాన్యాల జేబులు నింపడానికి ఉపయోగ పడుతుంది.
కనీస వేతనాల సలహా మండళ్లను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంప్రదించాలి. కానీ కనీస వేతనాలపై సలహా మండళ్ళ ప్రతిపాదనలకు ప్రభుత్వం కట్టుబడి ఉండదు. కనీస వేతనాల సలహా మండళ్లు ఉన్న కూడా వేతనాలను నిర్ణియించే అధికారం ప్రభుత్వం తన చేతుల్లో పెట్టుకుంది. ఉదాహరణకు కేంద్ర ప్రభుత్వం నియమించిన నిపు ణుల కమిటీ రోజుకి 375 రూపాయల నుండి 447 రూపాయల మధ్య వేతనం ఉండాలని ప్రభుత్వానికి సిఫార్సు చేసినప్పటికీ 178 రూపాయలు వేతనం ఉండాలని పెట్టుబడుదారుల లాభాల కోసం బీజేపీ ప్రభుత్వం నిర్ణయించింది. కార్మికులు తమ సమస్యలను పరిష్కరించాలలని సమ్మె చేస్తే వేతనాల్లో కోతపెట్టే హక్కు యాజమానులకు కల్పించింది. బోనస్ చెల్లింపు వేతన పరిమితి రూ.21వేలను ఎత్త్తివేయాలని, మనం డిమాండ్ చేస్తే దీనిపై సమాధానం లేదు. కంపెనీ లాభనష్టాలను తెలుసుకోవడానికి, ప్రశ్నించడానికి అవకాశం లేదు. బోనస్ పరిమాణాన్ని నిర్ణయించడానికి, కేటాయించబడిన మిగులును కార్మికులు తనిఖి చేయడానికి బ్యాలెన్స్ షీట్స్ పొందే హక్కు కార్మికులకు లేదు. మొత్తంగా ఈ కోడ్‌లో కార్మికులకు బోనస్ గ్యారెంటీ లేకుండా చేసింది.
నిర్ధిష్ట సమయంలో వేతనాల చెల్లింపులు, బోనస్ చెల్లింపు, సమాన పనికి – సమాన వేతనం లాంటి కార్మిక ప్రయోజనాలను పూర్తిగా విస్మరించింది. వీటిని తనిఖి చేసే ఇన్‌స్పెక్టర్‌ను ”ఇన్‌స్పెక్టర్ కం ఫెసిలిటేర్‌గా పేరు మార్చి తనిఖీ బాధ్యత నుండి తప్పించింది. ప్రభుత్వం అనుమతిస్తేనే ఫ్యాక్టరీని తనిఖీ చేయాలి. కనీస వేతనం, వేతన చెల్లింపు, బోనస్ చెల్లింపు, సమాన వేతన చట్టాల్లో ఉన్న కార్మిక హక్కులు ఆ చట్టం వల్ల కార్మికులకు మేలు చేసే ఈ చట్టాలను రద్దు చేసి వేతనాల కోడ్-2019 రూపొందించింది. ఇది పెట్టుబడిదారుల, బడా కార్పొరేట్ల లాభాలు మరింత పెంచడం కోసమే తప్ప కార్మికుల ప్రయోజనం కోసం కాదని స్పష్టమౌతుంది. కార్మిక వ్యతిరేకమైన లేబర్ కోడ్స్ రద్దు కావాలంటే కార్మికవర్గ ఐక్యత, పోరాటంతోనే సాధ్యం.అందుకు మే 20 సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలి.
కూరపాటి రమేష్
9490098048