పెండ్లి నీ కూతురిదే.. కానీ..

ముఖ్యమంత్రి రేవంత్‌ ప్రస్తుతం జపాన్‌ పర్యటనలో ఉన్నారు. కొద్ది నెలల క్రితం ఆయన దావోస్‌ వెళ్లారు. ఈ క్రమంలో సచివాలయంలో పాత్రికేయుల మధ్య పెట్టుబడులు, బహుళ జాతి కంపెనీలు, ప్రపంచ బ్యాంకు తదితరాంశాలు ప్రస్తావనకొచ్చాయి. ఆ సందర్భంగా ఓ సీనియర్‌ జర్నలిస్టు ప్రపంచ బ్యాంకు రుణాలు, దాని షరతుల గురించి ఓ గమ్మత్తైన కథ చెప్పారు. ‘అనగనగా ఓ సాధారణ రైతు. ఆయనకు ఒక్కగానొక్క కూతురు. ఆ అమ్మాయి పెరిగి, పెద్దదై, పెండ్లీడుకొచ్చింది. ఆమెకు పెండ్లి చేసేందుకు ఆ తండ్రి ప్రయత్నాలు ప్రారంభించాడు. కానీ చేతిలో చిల్లిగవ్వ లేదు. మరి పెండ్లెలా చేయాలి.. అని దిగాలుగా కూర్చున్నాడు. సరిగ్గా అదే సమయంలో ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు ఆయన వద్దకు వచ్చారు. ఈ చిన్న విషయం గురించి అంతగా ఎందుకు ఆలోచిస్తున్నావ్‌? మేం రుణం ఇస్తాం, ఎంత కావాలంటే అన్ని డబ్బులు తీసుకో, నీ బిడ్డ పెండ్లి ఘనంగా చేసేరు… అని భరోసానిచ్చారు. దీంతో తెగ సంబరపడిన ఆ బక్క రైతు, వరల్డ్‌ బ్యాంకు తొలి విడతలో ఇచ్చిన అప్పుతో పెండ్లి సామాగ్రి, అమ్మాయికి కావాల్సి నగానట్రా, బట్టలు కొన్నాడు. రెండో విడతలో ఇచ్చిన రుణంతో కాబోయే అల్లుడికి కట్నకానుకల్లో సగం సమర్పించుకున్నాడు. మూడో విడతలో ఇచ్చిన లోన్‌తో బియ్యం, ఉప్పులు, పప్పులు కొనుగోలు చేశాడు. పెండ్లి రోజు రానే వచ్చింది. పెండ్లి కొడుకు, పెండ్లి కూతురు పీటల మీద కూర్చున్నారు. ముహూర్తం సమయానికి మిగతా సగం కట్నం ఇవ్వాలన్నది ముందుగా చేసుకున్న ఒప్పందం. ఆ ప్రకారంగా రైతు… ప్రపంచ బ్యాంకు వద్దకెళ్లి, మిగతా అప్పును కూడా ఇవ్వాలని అర్థించాడు. దానికి వరల్డ్‌ బ్యాంకు ప్రతినిధులు… ఇస్తాం, ఆ మిగతా సొమ్ము మొత్తం ఇస్తాం, కానీ ఒక షరతు… పీటల మీద కూర్చున్న ఆ పెండ్లి కొడుకును లేపి, ఇదిగో మేం తీసుకొచ్చిన వీణ్ని కూర్చోబెట్టు. వీడితోనే నీ కూతురి మెడలో తాళి కట్టించాలి.. ఆ షరతుకు ఒప్పుకుంటేనే మిగతా కట్నం డబ్బులిస్తాం… అని మెలిక పెట్టారు. అప్పుడా రైతు పరిస్థితి… ముందు నుయ్యి, వెనుక గొయ్యిలా తయారైంది. ఎంత సేపు ఆలోచించినా ఏమీ అర్థంగాక, దిక్కుతోచక, గత్యంతర లేక వరల్డ్‌ బ్యాంకు వారు చూపిన అబ్బాయికే తన కూతుర్ని ఇచ్చి వివాహం చేశాడు. గట్లుంటది ప్రపంచ బ్యాంకు షరతులంటే…’ అని ముక్తాయింపునిచ్చారు ఆ సీనియర్‌ జర్నలిస్టు.
– బి.వి.యన్‌.పద్మరాజు

Spread the love