– వెళ్లిపోండి అంటూ వరదబాధితుల ఆగ్రహం
మాడ్రిడ్ : ఇటీవల స్పెయిన్లో ఆకస్మిక వరదల బీభత్సం స ృష్టించాయి. దేశ చరిత్రలో అత్యంత దారుణమైన ప్రకృతి విపత్తుల్లో ఇదీ ఒకటి. దాదాపు 200మందికి పైగా మ ృతి చెందారు. వాలెన్సియా శివారులోని పైపోర్తా ప్రాంతంలోనే 60 మంది ప్రాణాలు కోల్పోయారు. వేలాది నివాసాలు దెబ్బతిన్నాయి. ఈ క్రమంలోనే వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటనకు వెళ్లిన స్పెయిన్ రాజు ఫెలీప్-6కు చేదు అనుభవం ఎదురైంది. వరద బాధితులంతా ఆగ్రహంతో రాజుతోపాటు అధికారులపై బురదజల్లారు. అంతటితో ఆగకుండా దురాషేలాడినట్లు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.
వాస్తవానికి స్పెయిన్ రాజుకు ప్రజల్లో మంచి ఆదరణ ఉంది. రాజభవనం విషయంలో తాజా ఘటన అనూహ్య పరిణామం. అయితే, వరద సహాయక చర్యల విషయంలో అధికారుల నిర్లక్ష్యంపై బాధితుల్లో తీవ్ర అసంత ృప్తి నెలకొంది. రాజు పర్యటన వేళ వారిలో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ”వెళ్లిపోండి.. వెళ్లిపోండి.. హంతకులారా” అంటూ విరుచుకుపడ్డారు. బురద జల్లడంతో అంగరక్షకులు గొడుగులతో రక్షణ కల్పించారు. నిరసనకారులను నిలువరించేందుకు పోలీసులు రంగంలోకి దిగాల్సి వచ్చింది. మరోవైపు రాజు మాత్రం ప్రశాంతంగా ఉండి.. బాధితులతో మాట్లాడేందుకు యత్నించారు. రాణి లెతిజియా, ప్రాంతీయ వాలెన్సియా అధ్యక్షుడు కార్లో మజోన్ కూడా అదే బ ృందంలో ఉన్నారు.
ఇటీవలి వరదల సమయంలో అధికారులు రెండు గంటలు ఆలస్యంగా పౌరుల ఫోన్లకు హెచ్చరిక సందేశాలు పంపడం గమనార్హం. దీంతో అప్పటికే నష్టం జరిగిపోయింది. అనంతరం కూడా యంత్రాంగం నుంచి సరైన స్పందన కరవవడంతో స్థానికంగా మరింత ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఇండ్లను శుభ్రపరచడం వంటి పనులు చాలావరకు నివాసితులు, స్వచ్చంధ కార్యకర్తలే చేశారు. ఈ పర్యటనలో రాజుతోపాటు ప్రధాని పెడ్రో సాంచెజ్ కూడా రావాల్సి ఉంది. అయితే.. ఆయన అక్కడ ఉన్నారా? అనేది స్పష్టంగా తెలియలేదు. దాదాపు అరగంట పాటు కొనసాగిన ఉద్రిక్తతల అనంతరం రాజు అక్కడినుంచి వెనుదిరిగారు.