Monday, May 4, 2026
E-PAPER
Homeఆటలుసన్‌రైజర్స్‌కు బ్రేక్‌

సన్‌రైజర్స్‌కు బ్రేక్‌

- Advertisement -

9 వికెట్లతో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ గెలుపు
ఛేదనలో మెరిసిన రఘువంశీ, రహానె
నిరాశపరిచిన సన్‌రైజర్స్‌ మిడిల్‌ ఆర్డర్‌
హైదరాబాద్‌ 165/10 కోల్‌కతా 169/3

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జైత్రయాత్రకు బ్రేక్‌ పడింది. వరుసగా ఐదు విజయాలు సాధించి ‘సిక్సర్‌’పై కన్నేసిన సన్‌రైజర్స్‌ సొంతగడ్డపై ఓటమి చవిచూసింది. ట్రావిశ్‌ హెడ్‌ (61), ఇషాన్‌ కిషన్‌ (42) రాణించినా.. మిడిల్‌ ఆర్డర్‌ వైఫల్యంతో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ తొలుత 165 పరుగులకే ఆలౌటైంది. ఊరించే లక్ష్యాన్ని కోల్‌కతా నైట్‌రైడర్స్‌ ఆడుతూ పాడుతూ ఛేదించింది. రఘువంశీ (59), రహానె (43) మెరవటంతో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ సీజన్లో మూడో విజయం ఖాతాలో వేసుకుంది.

నవతెలంగాణ-హైదరాబాద్‌
కోల్‌కతా నైట్‌రైడర్స్‌ హ్యాట్రిక్‌ కొట్టింది. సీజన్‌ ఆరంభంలో తడబడిన నైట్‌రైడర్స్‌.. వరుసగా మూడు విజయాలతో ఊపందుకుంది. బౌలర్లు, బ్యాటర్లు సమిష్టిగా రాణించటంతో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌పై 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. 166 పరుగుల ఛేదనలో రఘువంశీ (59, 47 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లు), అజింక్య రహానె (43, 36 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్‌), ఫిన్‌ అలెన్‌ (29, 13 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించారు. రింకు సింగ్‌ (22 నాటౌట్‌), కామెరూన్‌ గ్రీన్‌ (3 నాటౌట్‌) మరో 10 బంతులు ఉండగానే లాంఛనం ముగించారు.
అంతకుముందు, తొలుత బ్యాటింగ్‌ చేసిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ 19 ఓవర్లలో 165 పరుగులకే కుప్పకూలింది. ఓపెనర్‌ ట్రావిశ్‌ హెడ్‌ (61, 28 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్థ సెంచరీకి తోడు ఇషాన్‌ కిషన్‌ (42, 29 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించటంతో సన్‌రైజర్స్‌ ఓ దశలో 105/1తో భారీ స్కోరు దిశగా సాగింది. కానీ మిడిల్‌ ఆర్డర్‌లో హెన్రిచ్‌ క్లాసెన్‌ (11), రవిచంద్రన్‌ స్మరణ్‌ (4), అనికెత్‌ వర్మ (6), సాలీల్‌ అరోరా (2) నిరాశపరిచారు. కోల్‌కతా నైట్‌రైడర్స్‌ స్పిన్నర్‌ వరుణ్‌ చక్రవర్తి (3/36), పేసర్‌ కార్తీక్‌ త్యాగి (2/30) రాణించారు. ఐపీఎల్‌19లో 9 మ్యాచ్‌ల్లో నైట్‌రైడర్స్‌కు ఇది మూడో విజయం కాగా.. సన్‌రైజర్స్‌కు పది మ్యాచ్‌ల్లో ఇది నాల్గో ఓటమి.

నైట్‌రైడర్స్‌ ఆడుతూ పాడుతూ..
కోల్‌కతా నైట్‌రైడర్స్‌ లక్ష్యం 166 పరుగులు. బ్యాటింగ్‌ లైనప్‌లో రింకు సింగ్‌ మినహా మరొకరు ఫామ్‌లో లేరు. దీంతో కోల్‌కతా సైతం ఒత్తిడిలోనే కనిపంచింది. కానీ ఓపెనర్లు ధనాధన్‌ ఆరంభం అందించారు. ఫిన్‌ అలెన్‌ (29) 3 ఫోర్లు, 2 సిక్సర్లతో దంచికొట్టాడు. అజింక్య రహానె ఓ ఎండ్‌లో స్ట్రయిక్‌ రొటేషన్‌ చేయగా అలెన్‌ అదరగొట్టాడు. అలెన్‌ను కమిన్స్‌ అవుట్‌ చేయగా సన్‌రైజర్స్‌కు బ్రేక్‌ లభించింది. పవర్‌ప్లేలో 71/1తో నిలిచిన నైట్‌రైడర్స్‌ ఛేదనకు గట్టి పునాది వేసుకుంది. సాధించాల్సిన లక్ష్యం అందుబాటులోనే ఉండటంతో బ్యాటర్లు రిస్క్‌ తీసుకోలేదు. రహానె, రఘవంశీ రెండో వికెట్‌కు కీలక భాగస్వామ్యం నమోదు చేశారు. సన్‌రైజర్స్‌ బౌలింగ్‌ మార్పులు చేసినా.. రహానె, రఘువంశీ భాగస్వామ్యం విడగొట్టలేకపోయింది. 66 బంతుల్లో 84 పరుగులు చేసిన రహానె, రఘువంశీ కోల్‌కతా విజయాన్ని లాంఛనం చేశారు. ఆఖర్లో ఈ ఇద్దరు అవుటైనా.. రింకు సింగ్‌ (22 నాటౌట్‌), కామెరూన్‌ గ్రీన్‌ (3 నాటౌట్‌) ముగించారు. సన్‌రైజర్స్‌ బౌలర్లలో సకిబ్‌ హుస్సేన్‌, పాట్‌ కమిన్స్‌, శివాంగ్‌ కుమార్‌ తలా ఓ వికెట్‌ పడగొట్టారు.

ఆరంభం అదిరింది
ఉప్పల్‌లో టాస్‌ నెగ్గిన సన్‌రైజర్స్‌ మధ్యాహ్నం మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది. భీకర ఫామ్‌లో ఉన్న అభిషేక్‌ శర్మ (15) ఓ సిక్సర్‌, ఫోర్‌తో తనదైన శైలిలో పరుగుల వేట మొదలెట్టగా, ట్రావిశ్‌ హెడ్‌ జోరు కొనసాగించాడు. పేస్‌లో మార్పుతో అభిషేక్‌ శర్మను మాయ చేసిన కార్తీక్‌ త్యాగి.. పవర్‌ప్లేలోనే అవుట్‌ చేశాడు. అయినా, సన్‌రైజర్స్‌ దూకుడు తగ్గలేదు. ట్రావిశ్‌ హెడ్‌ (61), ఇషాన్‌ కిషన్‌ (42) పవర్‌ప్లేలో దంచికొట్టారు. దీంతో సన్‌రైజర్స్‌ 6 ఓవర్లలో వికెట్‌ నష్టానికి 71 పరుగులు చేసింది. ట్రావిశ్‌ హెడ్‌ 9 ఫోర్లు, 2 సిక్స్‌లతో 22 బంతుల్లోనే అర్థ సెంచరీ సాధించాడు. మరో ఎండ్‌లో ఇషాన్‌ కిషన్‌ సైతం జోరందుకున్నాడు. 8.5 ఓవర్లలో 105/1తో భారీ స్కోరు దిశగా సాగిన సన్‌రైజర్స్‌ మిడిల్‌ ఓవర్లలో చతికిల పడింది.

మిడిల్‌లో తడబాటు
హెన్రిచ్‌ క్లాసెన్‌, అనికెత్‌ వర్మ, సాలీల్‌ అరోరాలు బ్యాటింగ్‌కు రావాల్సి ఉండటంతో సన్‌రైజర్స్‌ అలవోకగా 200 పైచిలుకు పరుగులు చేయటం ఖాయమే అనిపించింది. ఇక్కడే కోల్‌కతా నైట్‌రైడర్స్‌ బౌలర్లు సమిష్టగా రాణించారు. సన్‌రైజర్స్‌ను 105/1 నుంచి 148/7తో ఒత్తిడిలోకి నెట్టారు. స్పిన్నర్‌ వరుణ్‌ చక్రవర్తి మాయకు ట్రావిశ్‌హెడ్‌, రవిచంద్రన్‌ స్మరణ్‌ (4) వికెట్‌ కోల్పోగా.. హెన్రిచ్‌ క్లాసెన్‌ (11)ను కామెరూన్‌ గ్రీన్‌ సాగనంపాడు. అనికెత్‌ వర్మ (6), సాలీల్‌ ఆరోరా (2) సైతం నిరాశపరిచారు. మిడిల్‌ ఆర్డర్‌లో క్లాసెన్‌ వికెట్‌ కోల్పోవటంతో సన్‌రైజర్స్‌ బ్యాటర్లు ఒత్తిడికి నిలబడలేకపోయారు. 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో మెరిసిన ఇషాన్‌ కిషన్‌ ఏడో వికెట్‌ రూపంలో నిష్క్రమించాడు. ఆఖర్లో పాట్‌ కమిన్స్‌ (10), హర్షల్‌ పటేల్‌ (6) హైదరాబాద్‌కు విలువైన పరుగులు జోడించారు. మరో ఓవర్‌ ఉండగానే సన్‌రైజర్స్‌ 165 పరుగులకు కుప్పకూలింది. కోల్‌కతా నైట్‌రైడర్స్‌ బౌలర్లలో వరుణ్‌ చక్రవర్తి (3/36), కార్తీక్‌ త్యాగి (2/30), సునీల్‌ నరైన్‌ (2/31) రాణించారు.

సంక్షిప్త స్కోరు వివరాలు
సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ : 165/10 (ట్రావిశ్‌ హెడ్‌ 61, ఇషాన్‌ కిషన్‌ 42, వరుణ్‌ చక్రవర్తి 3/36, కార్తీక్‌ త్యాగి 2/30)
కోల్‌కతా నైట్‌రైడర్స్‌ : 169/3 (రఘువంశీ 59, రహానె 43, అలెన్‌ 29, రింకు సింగ్‌ 22, సకిబ్‌ హుస్సేన్‌ 1/17)

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -