2025 ఫిబ్రవరి ఒకటవ తేదీన ప్రవేశపెట్టిన బడ్జెట్ మాదిరిగా శ్రామిక ప్రజా బాహుళ్యపు జీవితాల గురించి ఇంత బాహా టంగా అవహేళన చేసిన బడ్జెట్ స్వాతంత్య్రా నంతరం భారతదేశంలో ఇంకొకటి రాలేదు. పన్నులను తగ్గించి మధ్య తరగతి వినియోగాన్ని ప్రోత్సహించడం ద్వారా ఆర్థిక వ్యవస్థకు చురుకుదనం తీసుకురావడమే ఈ బడ్జెట్ వెనుక వ్యూహం అని ఆర్థిక మంత్రితో సహా ఆర్థిక పండితులందరూ ఒప్పుకుంటారు. అటువంటి వ్యూహం ఫలించాలంటే పన్నుల తగ్గింపు ద్వారా పెరిగే మధ్య తరగతి వినిమయం కాస్తా వేరే ఖాతాల్లో ప్రభుత్వ వ్యయానికి కోత పెట్టడం వలన తగ్గే వినిమయంతో చెల్లు అయిపో కుండా ఉండాలి. అప్పుడు పెరిగిన మధ్య తరగతి వినిమయం మొత్తంగా స్థూల డిమాండ్ స్థాయిని పెంచుతుంది. తద్వారా ఆర్థిక వ్యవస్థకు చురుకుదనం కలుగుతుంది. అయితే ఇప్పుడు తగ్గించిన పన్నుల వలన ప్రభుత్వం కోల్పోతున్న ఆదాయాన్ని భర్తీ చేయడం కోసం ప్రభుత్వ వ్యయంలో కోత పెడుతున్నారు. 2024-2025తో (సవరించిన అంచనాల ప్రకారం) పోల్చితే 2025-26 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ వ్యయం నామమాత్రపు ధరల ప్రాతిపదికన కేవలం 7.4 శాతం మాత్రమే పెరగనుంది. పెరిగే ధరలను పరిగణనలోకి తీసుకుంటే వాస్తవ పెరుగుదల ఏమీలేనట్టే. అంతేకాదు, వాస్తవానికి దేశ జీడీపీతో పోల్చితే తగ్గుతుంది.
ప్రభుత్వ వ్యయం ఎక్కడెక్కడ తగ్గనుందో చూద్దాం. ఆహార సబ్సిడీని నామమాత్రపు ధరల ప్రకారం మూడు శాతం మాత్రమే పెంచారు. అంటే 2023-24 వాస్తవ ఖర్చుతో పోల్చితే తగ్గిపోయింది. గ్రామీణ ఉపాధిహామీ పథకానికి 2024-25లో సవరించిన అంచనాల ప్రకారం రూ.86వేల కోట్లు కేటాయించగా, ఇప్పుడూ అంతే. అంటే పెరుగుదల ఏమీ లేదన్నమాట. ఇక 2023-24లో వాస్తవంగా రూ.89,154 కోట్లు ఖర్చు చేశారు. ఆ ఏడాదితో పోల్చితే ఇప్పుడు కేటాయింపు పడిపోయింది. జనవరి 25 నాటికి ఉపాధి హామీ బకాయిలు రూ.6950 కోట్లు ఉన్నాయి. ఆ మొత్తాన్ని మినహాయించితే ఈ ఏడాది బడ్జెట్‌లో ఈ పద్దుకు కోత పెట్టారని స్పష్టమౌతోంది.
ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖకు 2024-25 బడ్జెట్‌లో కేటాయించిన మొత్తం కన్నా నామ మాత్రపు ధరల ప్రకారం 9.5 శాతం పెరుగుదల ఉన్నట్టు లెక్క. అయితే జీడీపీతో పోల్చిచూస్తే ఈ పద్దుకు కేటాయింపు తగ్గింది. గత ఏడాది బడ్జెట్‌లో పాఠశాల విద్యకు రూ.73,000 కోట్లు కేటాయిస్తే ఈ ఏడాది రూ.78, 600 కోట్లు కేటాయించారు. ఇక్కడ కూడా జీడీపీలో గత ఏడాది కన్నా తక్కువ శాతమే పాఠశాల విద్యకు కేటాయింపు జరిగింది. సాక్ష్యం అంగన్‌వాడీ. పోషణ్-2 (గతేడాది కన్నా నామమాత్రపు ధరల ప్రకారం 3.6 శాతమే పెరుగుదల) ప్రధాన మంత్రి పోషణ్ (నామమాత్రపు ధరలతో పోల్చినా గతేడాది ఎంత కేటాయించారో ఇప్పుడూ అంతే కేటాయించారు) ఆ విధంగా సామాజిక రంగాలను మొత్తంగా చూసినప్పుడు కేటాయింపులు తగ్గాయి.
సామాజిక రంగానికి కేటాయింపులను తగ్గించడం ద్వారా, ఆహార సబ్సిడీకి, ఉపాధి హామీకి తగ్గించడం ద్వారా మధ్యతరగతి జీతగాళ్లకు పన్నుల్లో తగ్గింపులు ఇవ్వడమంటే సంక్షేమ పథకాల ద్వారా ప్రయోజనాలు పొందే పేద, శ్రామిక ప్రజా బాహుళ్యపు కొనుగోలుశక్తికి కోత పెట్టి దానిని మధ్య తరగతిలోని ఒక భాగానికి బదలాయించ డమే. ఆ విధంగా చూస్తే 2025-26 బడ్జెట్ మొత్తం ఆర్థిక వ్యవస్థకు ఎటువంటి చురుకుదనాన్నీ తీసుకురాలేకపోగా శ్రామికవర్గపు పేద జనాన్ని బలిపెట్టి మధ్యతరగతి జీతగాళ్లకు రాయితీలు ఇచ్చింది. సంపన్న వర్గాలను ఏ మాత్రమూ అంటుకోకుండా పేద శ్రామికుల నుండి కొనుగోలు శక్తిని మధ్యతరగతికి పున:పంపిణీ చేస్తూ, అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడిని సంతృప్తి పరిచేలా ద్రవ్యలోటును ఏమీ మార్చకుండా కొనసాగించారు. దీనర్ధం మధ్యతరగతి జీతగాళ్లకు ఏ విధమైన పన్ను రాయితీలూ ఇవ్వకూ డదని కాదు. పెరుగుతున్న ధరల నేపథ్యంలో వారికి రాయితీలు ఇవ్వాలి. అయితే అందుకోసం నిరుపేద శ్రామికవర్గాన్ని బలి చేయకూడదు కదా. కాని 2025-26 బడ్జెట్ అనుసరించినది ఇదే వ్యూహం. ఈ వ్యూహం వలన ఆర్థిక వ్యవస్థ మందకొడితనాన్ని అధిగమించలేక పోతున్నది కాని ఇందులో మూడు లక్షణాలు ఈ బడ్జెట్‌ను ఎన్డీయే కూటమికి ఆకర్షణీయంగా చేస్తున్నాయి.
మొదటిది: శ్రామిక పేదల కొనుగోలు శక్తిని కుదించడం వలన వారు సాధారణంగా కొనుగోలు చేసే సరుకులకు డిమాండ్ తగ్గిపోతుంది. మామూలుగా ఇటువంటి సరుకులు ఎక్కువగా చిన్న చిన్న ఉత్పత్తిదారుల వద్ద తయారౌతాయి. మధ్య తరగతి కొనుగోలు శక్తి పెంచినందువలన వారు కొనుగోలు చేసే సరుకులకు డిమాండ్ పెరుగుతుంది. వీరు కొనుగోలు చేసే సరుకులు ఎక్కువగా సంఘటిత రంగంలో గుత్తాధిపత్య సంస్థలు ఉత్పత్తి చేస్తాయి. అంటే ఈ వ్యూహం వలన గుత్త పెట్టుబడి ప్రయోజనాలు బాగా నెరవేరు తాయి. ఇది మార్క్స్ చెప్పిన ”పెట్టుబడి కేంద్రీకరణ” క్రమాన్ని వేగవంతం చేస్తుంది. ఈ క్రమంలో చిన్న పెట్టుబడులను దెబ్బ తీయడం ద్వారా పెద్ద పెట్టుబడి పెరుగుతుంది. నేటి భారతదేశ రాజకీయ రంగంలో కార్పొరేట్- హిందూత్వ కూటమి ఆధిపత్యా న్ని చెలాయిస్తోంది. ఆ కూటమిలోని ఒక స్తంభంగా ఉన్న కార్పొరేట్ల ప్రయోజనాలను ఎన్డీయే కూటమి ప్రభుత్వం ఈ విధంగా నెరవేరుస్తోంది.
రెండవది: అధికారిక గణాంకాల్లో అసంఘటిత రంగంలో (చిన్న స్థాయి ఉత్పత్తి రంగం) పడిపోతున్న డిమాండ్‌ను, దాని ఫలితంగా తగ్గుతున్న ఉత్పత్తిని సక్రమంగా లెక్కించడం లేదు. ఇక స్వల్పకాలిక అంచనాల దగ్గరకొస్తే కార్పొరేట్ రంగంలో జరిగేదాన్నే మొత్తం ఆర్థిక వ్యవస్థకంతటికీ వర్తింపజేయడం ఒక అలవాటు అయి పోయింది. ఈ విధంగా చేయడం వలన ఆర్థిక వ్యవస్థ చాలా బాగా ఉన్నట్టు లెక్కలు చూపిస్తాయి. కార్పొరేట్లకు మంచి ఫలితాలు వస్తే మొత్తం దేశ ఆర్థిక వ్యవస్థకంతటికీ మంచి ఫలితాలు వచ్చినట్టే లెక్క. ఈ లెక్కలు చూపించి ఒక పక్కన కార్పొరేట్లను సంతోషపెడుతూనే, ప్రభుత్వం కూడా తాను ఆర్థిక వ్యవస్థను వేగంగా ముందుకు నడిపిస్తున్నట్టు గొప్పలు చెప్పుకోవచ్చు.
మూడవది: మధ్య తరగతికి పన్ను రాయితీలు ఇచ్చినది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. కాని, అందుకోసం ఎవరు మూల్యం చెల్లించవలసి వస్తోంది అన్నది మాత్రం బడ్జెట్‌లో స్పష్టంగా కనిపించదు. అందుచేత ఏ పేదల కొను గోలు శక్తినైతే తాను దెబ్బ తీస్తోందో ఆ పేదల మద్దతును కోల్పోకుండానే మధ్యతరగతి నుండి అదనంగా మద్దతును పొందగలుగుతానని ప్రభుత్వం భావిస్తోంది. పేదల దారిద్య్రానికి రకరకాల కారణాలను చూపించవచ్చు. తద్వారా బడ్జెట్‌లో అనుసరించిన వ్యూహం గురించి ఆ పేదలు పట్టించుకోకుండా చూసుకోవచ్చు. పైగా, శ్రామిక ప్రజల్లో తన మద్దత్తు గనుక తగ్గే పరిస్థితి ఉంటే హిందూత్వ వ్యూహాన్ని ఎటుదిరిగీ ముందుకు తేవచ్చు. తద్వారా వారిని తప్పుదోవ పట్టించనూవచ్చు.
బడ్జెట్‌లో అనుసరించిన ‘వ్యూహం’ గురించి మరీ మనం ఎక్కువగా ఊహించుకుంటున్నామా అని సందేహం రావచ్చు. కాని ఈ మధ్య ఎన్డీయే ప్రభుత్వం తరచూ మధ్యతరగతిని పొగడ్తలతో ముంచెత్తడం చూస్తే అటువంటి అనుమానాలు తొలగిపోతాయి. ప్రస్తుత బడ్జెట్ సమావేశాల ప్రారంభంలో దేశాధ్యక్షులు ద్రౌపది ముర్ము ప్రసంగంలో వర్తమాన అంశాలపై ప్రభుత్వ దృక్పథాన్ని వివరిస్తూ ఆక్రమంలో మధ్యతరగతిని ఆకాశానికెత్తేశారు. ఆర్థికమంత్రి పదే పదే మధ్య తరగతిని ప్రశంసిస్తూ ఆర్థిక వ్యవస్థను పునరుజ్జీవింపచేసే శక్తి ఆ తరగతికే ఉందని ప్రకటించారు. ఇవన్నీ పరిశీలించినప్పుడు ఈ బడ్జెట్ ఏదో హడావుడిగా పైపైన యాదృచ్ఛికంగా రూపొందించిన విధానాలను బట్టి తయారైంది కాదని, మధ్యతరగతికి, శ్రామికవర్గ ప్రజానీకానికి మధ్య ఒక చీలికను సృష్టించడం ద్వారా కార్పొరేట్- హిందూత్వ కూటమికి కొంత అదనపు మద్దతును సమీకరించే ఉద్దేశంతో తయారైనదని అర్ధమౌతుంది. అదే సమ యంలో అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడిని కూడా ఇది సంతృప్తిపరుస్తుంది. నయా ఉదారవాద సాంప్రదాయానికి అనుగుణంగా ఈ బడ్జెట్‌లో సంపన్నులపై అదనపు పన్నులేమీ వేయలేదు. ద్రవ్యలోటును కూడా ఏమీ పెంచలేదు.
ఇక్కడే ప్రభుత్వపు దృష్టి బయట పడుతోంది. శ్రామిక ప్రజల ప్రయోజనాలను బలిపెట్టి మధ్య తరగతిలో తన మద్దతును పెంచుకోడానికి ప్రభుత్వం సిద్ధపడుతోంది. అంకెల్లో తన పాలన మెరుగైనదిగా చూపించుకోవడం కోసం అది శ్రామిక ప్రజానీకాన్ని నష్టపరుస్తోంది. పెట్టుబడిదారీ సమాజంలో ఇది తరచూ జరిగేదే. కాని భారత దేశంలో మాత్రం ఇది కొత్తగా జరుగుతోంది. మనదేశంలోని పాలక వర్గాలు ఎప్పుడూ తాము పేద శ్రమజీవుల కోసమే పాటు పడుతున్నట్టు చెప్పుకుంటారు. కాని ఇప్పుడు ప్రభుత్వం తన ప్రాధాన్యతలను బాహాటంగా వెల్లడిస్తోంది. మధ్య తరగతికి ప్రాధాన్యతనిచ్చి శ్రామిక పేదలను శిక్షిస్తోంది.
ఈ ”వ్యూహాత్మక నవ్యత్వం” మినహా 2025-26 బడ్జెట్ పాత నయా ఉదారవాద బడ్జెట్ల మాదిరిగానే అదే రోసిపోయిన విధానాన్ని అనుసరించింది. స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల ప్రకారం పంటలకు తగిన ధరను కల్పించాలన్న రైతాంగపు డిమాండ్‌ను అది పట్టించుకోలేదు. ఇన్సూరెన్స్ రంగంలో విదేశీ కంపెనీలకు వంద శాతం యాజమాన్య వాటాలు కలిగివుండేం దుకు అనుమతులిస్తూ వాటికి ఎర్రతివాచీ పరిచి స్వాగతిస్తోంది. తమ వేటాడే ”జంతు ప్రవృత్తి”ని ప్రదర్శించమని, భారీగా పెట్టుబడులు పెట్టమని స్వదేశీ గుత్త పెట్టుబడి సంస్థలకు ఉద్బోధలు చేసింది (ఆర్థిక సర్వే మాత్రం వినిమయ వస్తువుల డిమాండ్ చాలా నిరుత్సాహంగా ఉన్నందువల్ల పెట్టుబడులు రావడం లేదని, వేతనాలలో పెరుగుదల లేకుండా, లాభాల వాటా మాత్రం చాలా ఎక్కువగా పెరిగిపోయినందువలన ఆర్థిక అసమానతలు పెరిగిపోయాయని, అందువల్లే డిమాండ్ మందకొడిగా ఉందని స్పష్టంగానే చెప్పింది).
విదేశీ మదుపుదారులను పొగడ్తలతో ముంచెత్తితే దానివల్ల ఏ ప్రయోజనమూ ఉండదు. కాని అటువంటి పొగడ్తలతో విదేశీ పెట్టుబడులు వస్తాయని, రూపాయి విలువ పతనం ఆగుతుందని ప్రభుత్వం ఆశించివుండొచ్చు. అయితే ఆ ఆశ అడియాసేనని బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన రెండు రోజులకే తేలిపోయింది. రూపాయి పతనం ఆగలేదు సరికదా ఫిబ్రవరి 3న అది కోలుకోలేనంతగా దిగజారింది. ఒక డాలరుకి రూ.87 చొప్పున మారకపు రేటు ఆ రోజున పడిపోయింది. ప్రజలలో ఒక సమూహాన్ని అవహేళనా పూర్వకంగా మోసగిస్తూ మరొక సమూహాన్ని ఆకర్షించడానికి, తనను తాను గొప్పగా చిత్రీకరించుకోడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తే అది ఆర్థిక సంక్షోభాన్ని ఏమాత్రమూ పరిష్కరించలేదు.
(స్వేచ్ఛానుసరణ)
ప్రభాత్ పట్నాయక్