కొందరు ఉన్నతాధికారులకు మళ్లీ అవకాశం

కొందరు ఉన్నతాధికారులకు మళ్లీ అవకాశం– వారి సర్వీసుల పొడిగింపులకే.. మోడీ ప్రభుత్వం మొగ్గు
– ఇప్పటికే పలువురు బ్యూరోక్రాట్లను కీలక పదవుల్లో తిరిగి నియమించిన కేంద్రం
న్యూఢిల్లీ : కేంద్ర స్థాయిలో ఉన్నత పోస్టుల్లో ఉన్న అధికారుల సర్వీసును కేంద్రంలోని మోడీ సర్కారు పొడగించాలనుకుంటున్నట్టు తెలుస్తున్నది. కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చిన కొన్ని వారాల తర్వాత.. 1988వ బ్యాచ్‌ ఐపీఎస్‌ అధికారి, ఇంటెలిజెన్స్‌ బ్యూరో(ఐబీ) చీఫ్‌ తపన్‌ కుమార్‌ దేకా పదవీకాలాన్ని మోడీ ప్రభుత్వం ఒక సంవత్సరం పాటు పొడిగించింది. హిమాచల్‌ ప్రదేశ్‌ క్యాడర్‌కు చెందిన అధికారి అయిన దేకా.. 2022లో రెండేండ్ల కాలానికి ఐబీ చీఫ్‌గా నియమితులయ్యారు. ఇప్పుడు 2025 వరకు దేకా ఈ పదవిలో ఉంటారు. ప్రధాని మోడీకి ప్రధాన కార్యదర్శిగా పి.కె మిశ్రా, జాతీయ భద్రతా సలహాదారు (ఎన్‌ఎస్‌ఏ)గా అజిత్‌ దోవల్‌ల సేవలను కేంద్రం పొడిగించిన విషయం విదితమే. అమిత్‌ ఖరే, తరుణ్‌ కపూర్‌లను కూడా ప్రధాని సలహాదారులుగా ప్రభుత్వం తిరిగి నియమించింది. ఈసారి ఇతర పార్టీలతో సంకీర్ణంలో ఉన్నప్పటికీ, మోడీ ప్రభుత్వ మూడవ టర్మ్‌లో ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంఓ)లో ఉన్నతాధికారుల కొనసాగింపుపై ప్రభుత్వం గట్టి ఆలోచనతో ఉన్నదని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు.
2017 నుంచి ఆయుష్‌ మంత్రిత్వ శాఖలో కార్యదర్శిగా ఉన్న రాజేష్‌ కోటేచా కూడా ఆయన నియామకం నుంచి మూడోసారి పొడిగింపు పొందారు. అధికారులు ఇప్పటికే సర్వీస్‌ నుంచి పదవీ విరమణ చేసి, ప్రభుత్వం ద్వారా తిరిగి నియమించబడటంపై సర్వత్రా ఆసక్తి నెలకొన్నది. పీఎంఓ నియామకాలు రాజకీయ స్వభావం కలిగి ఉన్నప్పటికీ, రెండో టర్మ్‌ నుంచి మోడీ ప్రభుత్వం వారి నిర్ణీత పదవీ విరమణకు మించి సేవలందిస్తున్న అధికారులకు పొడిగింపులను ఇవ్వడానికి మొగ్గు చూపుతున్నదని విశ్వసనీయ వర్గాలు చెప్తున్నాయి. ఇప్పుడు కూడా ప్రభుత్వంలో పనిచేస్తున్న కొందరు ఉన్నతాధికారులు తమ నిర్ణీత పదవీకాలానికి మించి సర్వీసులు చేస్తున్నారు.
క్యాబినెట్‌ సెక్రెటరీ రాజీవ్‌ గౌబా.. ఇప్పటికే మూడు పొడిగింపులను పొందారు. భారతదేశ చరిత్రలో ఎక్కువ కాలం పనిచేసిన క్యాబినెట్‌ కార్యదర్శిగా రాజీవ్‌ నిలిచారు. హౌం సెక్రెటరీ అజరు భల్లా భారతదేశ చరిత్రలో ఎక్కువ కాలం పనిచేసిన రెండో హౌం సెక్రెటరీ. ఆగస్టు 2019లో ఆయన ఆ పదవికి నియామకం అయినప్పటి నుంచి భల్లాకు నాలుగు పొడిగింపులు వచ్చాయి. ఐఎఫ్‌ఎస్‌ అధికారి, విదేశాంగ కార్యదర్శి వినరు క్వాత్రా మార్చి 2024లో పదవీ విరమణ చేయవలసి ఉన్నది. ”ప్రజా ప్రయోజనాలను” పేర్కొంటూ ప్రభుత్వం ఆయనకు ఆరు నెలల పొడిగింపు ఇవ్వటం గమనార్హం. నవంబర్‌ 2022లో రక్షణ కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన 1988వ బ్యాచ్‌ ఐఏఎస్‌ అధికారి అరమనె గిరిధర్‌కు గతేడాది ఏడాది పొడిగింపు ఇచ్చారు. అతని పొడిగించిన పదవీకాలం అక్టోబర్‌ 2024లో ముగియనున్నది. 1986 బ్యాచ్‌ ఇండియన్‌ రెవెన్యూ సర్వీస్‌(ఐఆర్‌ఎస్‌) అధికారి అయిన నితిన్‌ గుప్తా ఆదాయపు పన్ను శాఖ అపెక్స్‌ పాలసీ మేకింగ్‌ బాడీ అయిన సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్ట్‌ టాక్సెస్‌(సీబీడీటీ)కి చైర్మెన్‌గా జూన్‌ 2022లో నియమితులయ్యారు.
గతేడాది సెప్టెంబర్‌లో, రెగ్యులర్‌ డైరెక్టర్‌ను ఎంపిక చేసే వరకు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) ఇన్‌ఛార్జ్‌ డైరెక్టర్‌గా రాహుల్‌ నవిన్‌ను ప్రభుత్వం నియమించింది. అప్పటి ఈడీ డైరెక్టర్‌ సంజరు కుమార్‌ మిశ్రాకు పదే పదే పొడిగింపులు మంజూరు చేసినందుకు సుప్రీంకోర్టు కేంద్రంపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. మిశ్రా మినహా డిపార్ట్‌మెంట్‌ మొత్తం ”అసమర్థులతో నిండి ఉన్నదా?” అని న్యాయస్థానం ప్రశ్నించింది. అయితే అప్పటి నుంచి ఈడీకి పూర్తిస్థాయి డైరెక్టర్‌ను ప్రభుత్వం నియమించలేదు. అయితే, స్పష్టత, విధాన రూపకల్పనలో స్థిరత్వం కోసమే ఈ పొడగింపులను చేస్తున్నట్టు ప్రభుత్వం సమర్థించుకుంటున్నదని విశ్లేషకులు చెప్తున్నారు.

Spread the love