అయోధ్య రామాలయ విరాళాల చోరీపై సుప్రీం
సిట్‌లో ఐదో సభ్యుడిగా ఫోరెన్సిక్ ఆడిటర్ను కూడా చేర్చాలని ఆదేశం
న్యూఢిల్లీ : అయోధ్య రామాలయంలో విరాళాల చోరీ ఆరోపణలపై విచారణ సందర్భంగా సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ ఘటనపై రెండు వారాల్లోగా సమగ్ర నివేదిక సమర్పించాలని ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఆదేశించింది. ఐజీ ఎస్.కిరణ్ నేతృత్వంలో నలుగురు సభ్యుల బృందం విరాళాల దుర్వినియోగంపై దర్యాప్తు చేస్తోందని ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా జోక్యం చేసుకున్న సీజేఐ జస్టిస్ సూర్యకాంత్, సిట్‌లో ఐదో సభ్యుడిగా ఫోరెన్సిక్ ఆడిటర్ను కూడా చేర్చాలని ఆదేశించారు. విరాళాల నిధుల మళ్లింపు, రికార్డుల తనిఖీకి ఫొరెన్సిక్ నిపుణుడి అవసరం ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై దర్యాప్తును వేగవంతం చేయాలని సిట్‌ను ఆదేశించిన ధర్మాసనం, రెండు వారాల్లో దర్యాప్తు పురోగతిపై సమగ్ర నివేదిక సమర్పించాలని ఆదేశించింది. అయితే విరాళాల వివరాలను వెబ్‌సైట్‌లో పెట్టాలన్న పిటిషనర్ విజ్ఞప్తిని ధర్మాసనం తోసిపుచ్చింది. సిట్ ఇచ్చే నివేదిక ఆధారంగా తదుపరి చర్యలపై నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేసింది. తదుపరి విచారణ రెండు వారాలకు వాయిదా వేసింది.
సిట్లో ఉన్నది వీళ్లే
రాష్ట్ర ప్రభుత్వం తరఫున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా విచారణ సందర్భంగా సుప్రీంకోర్టుకు కీలక విషయాలు వెల్లడించారు. “మేము ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ కిరణ్ ఎస్ నేతృత్వంలో సిట్ ఏర్పాటు చేశాం. ఇందులో ఒక డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ (డీఐజీ), ఒక సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్ఎస్పీ), ఒక అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఏఎస్పీ) ఉన్నారు. ఈ బృందంలో ఫోరెన్సిక్ ఆడిటర్ను కూడా భాగం చేస్తాం. జులై 25న ఏర్పాటైన ఈ సిట్ ప్రస్తుతం ఈ కేసును దర్యాప్తు చేస్తోంది ” అని చెప్పారు. ఇక పిటిషనర్లలో ఒకరి తరఫున హాజరైన సీనియర్ అడ్వకేట్ దేవదత్ కామత్ తన వాదనలు వినిపిస్తూ, “ప్రజలు రూ.500, రూ.1000 నోట్లను విరాళాలుగా ఇచ్చారు. కానీ ఆ డబ్బు ట్రస్ట్కు చేరలేదు. ట్రస్ట్కు లభించిన మొత్తాన్ని వెబ్సైట్లో ఉంచితే, తమ డబ్బు ఎక్కడకు చేరిందో ప్రజలు తెలుసుకుంటారు. ఇదేమీ లిటిగేషన్ వ్యాజ్యం కాదు” అని అన్నారు. దీనిపై స్పందించిన న్యాయస్థానం సిట్కు అన్ని వివరాలు పరిశీలించే అవకాశం ఉంటుందని, పైగా ప్రస్తుతానికి ఈ కేసును క్లోజ్ చేయడం లేదని పేర్కొంది. “ప్రస్తుతానికి మీరంతా సమస్యలను నోట్ చేసుకోండి. ఇప్పుడు మా పూర్తి దృష్టి దర్యాప్తుపైనే ఉంది. మనకు వేగవంతమైన, నాణ్యమైన దర్యాప్తు అవసరం. మూకు నివేదిక సమర్పించమని వారిని అడుగుతున్నాం. మిగిలిన విషయాలను మేము తర్వాతి దశలో నిర్ణయిస్తాం” అని బెంచ్ స్పష్టం చేసింది.
రాజకీయం చేయొద్దు
ఇంతకు ముందు అయోధ్య రామమందిర విరాళాల కేసుపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ కేసును రాజకీయం చేయవద్దని, కోర్టులు రాజకీయాలకు వేదిక కాదని స్పష్టం చేసింది. ఇది ఒక సాధారణ నేరమని, తాము సరైన మార్గంలో దర్యాప్తు జరిగేలా చూస్తామని తెలిపింది. కాగా, ఈ కేసు దర్యాప్తునకు యూపీ గవర్నమెంట్ ఓ సిట్ను ఏర్పాటు చేసిందని, ప్రస్తుతం ఆ రాష్ట్ర పోలీసులు దానిపై క్షుణ్ణంగా దర్యాప్తు చేస్తున్నారని సుప్రీంకోర్టుకు సొలిసిటర్ జనరల్ వెల్లడించారు. దీనితో సుప్రీంకోర్టు తదుపరి విచారణను జులై 27కు వాయిదా వేసింది.
సీజేఐ సూర్యకాంత్, జస్టిస్ జోయ్మాల్య బాగ్చీ, జస్టిస్ వి.మోహనాలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఈ కేసుపై విచారణ చేసింది. ఈ సందర్భంగా అయోధ్య రామమందిర విరాళాల అక్రమాలపై విచారణ సిట్ చేయవచ్చా? అని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాన్ని సర్వోన్నత న్యాయస్థానం ప్రశ్నించింది. అంతకుముందు సొలిసిటర్ జనరల్ మెహతా మాట్లాడుతూ, కోర్టు గతంలో ఇచ్చిన ఆదేశాల మేరకు ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం స్టేటస్ రిపోర్టు దాఖలు చేసిందని తెలిపారు. “దర్యాప్తు కొనసాగుతోంది. ఇప్పటి వరకు 8 మందిని అరెస్టు చేశారు. నేను అంత కంటే ఎక్కువ వివరాలు వెల్లడించలేను” అని అన్నారు. దీనితో కేసును సిట్ దర్యాప్తు చేస్తోందా? అని కోర్టు ప్రశ్నించగా, “నిజానిజా లను తెలుసుకోవడానికి మాత్రమే సిట్ ఏర్పాటు చేశారు. ఇప్పుడు దీనిని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇందులో ఒక నేరం జరిగిందని మాత్రమే సిట్ కనిపెట్టింది” అని తుషార్ మెహతా కోర్టుకు తెలిపారు.
రెండు వారాల్లోగా సమగ్ర నివేదిక సమర్పించాలి
- Advertisement -
- Advertisement -



