కుప్పకూలిన యుద్ద విమానం

నవతెలంగాణ – హైదరాబాద్: అమెరికాలో విషాదకర ఘటన జరిగింది. ఫాదర్స్ డే సందర్భంగా ‘యాంగ్స్ ఎయిర్ మ్యూజియం’ అనే మ్యూజియం నిర్వహించిన వేడుకలు విషాదంగా మారాయి. రెండవ ప్రపంచ యుద్దం నాటి పాతకాలపు విమానం కుప్పకూలింది. విమానం కూలిన వెంటనే భారీగా మంటలు ఎగసిపడ్డాయి. ఈ ఘటనలో విమానంలో ఇద్దరు వ్యక్తులు మృత్యువాత పడ్డారని అధికారులు తెలిపారు. శాన్ బెర్నార్డినో కౌంటీలోని చినో ఎయిర్‌పోర్టుకు పశ్చిమ దిశ సమీపంలో శనివారం మధ్యాహ్నం 12:30 గంటల సమయంలో ట్విన్-ఇంజిన్ ‘లాక్‌హీడ్ 12ఏ’ విమానం కూలిందని ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు ప్రకటించారు. అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకొని 10 నిమిషాల్లోనే మంటలను ఆర్పివేశారని చినో వ్యాలీ ఫైర్ డిస్ట్రిక్ట్ బెటాలియన్ చీఫ్ బ్రయాన్ టర్నర్ వివరించారు. అయితే బాధితుల పేర్లను వెల్లడించలేదు. ఇది పాతకాలం నాటి విమానమని, చారిత్రక నేపథ్యం ఉందని టర్నర్ వివరించారు. కాగా ఈ విమానం యాంక్స్ ఎయిర్ మ్యూజియంకు చెందినదని తెలుస్తోంది.

Spread the love