ఒక కల ముందే కని…

అంత్యారంభాలు అనిశ్చితిలో భాగాలే
అయినా ఒక బిందువు నుండి ఒక ధార
ఒక ప్రళయపు అవశేషాల నుండి ఒక ప్రారంభం
ఎంతో నిడివిగల ప్రకతి నత్యం
జరిగి జరిగి కర్రపుల్లలు ఏరి ఏరి
గడ్డిపోచలో రెమ్మలో ముక్కున కరుచుకొని
ఒక నిర్మితిని పక్షి ఆవిష్కరించినట్టు
మనలోని మనల్ని గొప్పగా హుందాగా
గంభీరంగా ఉదాత్తంగా పడవ దాటిస్తూ
ఒక సిల్హౌట్‌లో నీటి రంగుల చిత్రంలా
అమూర్తమైన అనుభూతులను
ఒక కొత్త గాజు గ్లాసులో నింపుకుని తాగుతూ
పదేపదే గుక్క గుక్కుకు దాన్ని చుసుకుంటూ
ఉషోదయపు తేనీరు చప్పరిస్తున్నట్లు
ఒక కలను ముందే కని వెచ్చటి స్వెటర్‌ లో
దాచుకుని మన కిటికీ ముందునుంచి
వెళ్ళేవాళ్ళను చూస్తూ ఉంటాం
పలకరించాలన్న కుతూహలం ఉన్నా
సిగ్గుతో నోరు విప్పక తదేకంగా చూస్తూ…
లోపలేమో కొన్ని గోడలూ కొన్ని రాతలూ
పాత సామాన్లు నోట్‌ బుక్కులు
పద్యాలు వాక్యాలు అరుపులు విరుపులు
నవ్వులు చేష్టలు మిగిలే ఉంటారు
మసిబారిన గూట్లోని ఒక కిరసనాయిల్‌ కందిల్‌లో ఇంకా…
– రఘు వగ్గు

Spread the love