ఒక అధ్యాపకురాలి అంతరంగం

The interior of a teacherఅధ్యాపకురాలిగా, ఉద్యోగినిగా, గహిణిగా ప్రగతి తాను – తన చుట్టూ ఉన్న మహిళలు ఎదుర్కొన్న కష్టాలు సవాళ్లను, వాటిని చక్కదిద్దే ప్రయత్నాలను- ఇలా కథలుగా రూపొందించారు.
స్కూల్‌ విద్యార్థినులకు శానిటరీ పాడ్‌ ల ఆవశ్యకత గురించి తెలియజేసిన టీచర్‌ ఒక కథలో కనిపిస్తుంది. బాల్యం నుండి స్త్రీలపై ఏదో రకంగా లైంగిక వేధింపులు తప్పవు. పరువు పోతుందని భయపడకుండా ఎప్పటికప్పుడు ఎదిరించడమే ముఖ్యమని ఇంకో కథలో తెలియజేస్తారు. స్త్రీకి బయట ఆఫీసులోపని, ఇంట్లో చాకిరి తప్పదు. ఇంట్లో వాళ్ళు సైతం ఆమె చాకిరిని గుర్తించరు .పైగా తమ కోరికలే ముఖ్యంగా భావించి ఇబ్బంది పెడుతుంటారని ఒక కథలో చూపిస్తారు. కొత్తగా రచనలు చేసే అమ్మాయిలను ప్రోత్సహిస్తున్నట్టుగా నటించి వారికి సన్మానాలు, అవార్డుల పేరిట లోబర్చుకోవడానికి చూసే గోముఖ వ్యాఘ్రాలను ‘రైటింగ్‌ కోచింగ్‌’ లో బయట పెడతారు. పరువు హత్యలతో జీవితాలు నాశనం చేసుకోవడమా? వాళ్ళ అభిష్టాన్ని మన్నించి అందరూ హాయిగా ఉండటమా తేల్చుకోమని చెప్పే కథ ‘కొన్ని చీకట్లూ… ఓ వెలుతురూ..’. ఇంట్లో తండ్రి విధించే బురఖా నిబంధనలను వ్యతిరేకించిన హసీనా, బయట హిజాబ్‌ వ్యతిరేకతను కూడా అడ్డుకుంటుంది. మన బట్టల మీద వీళ్ళ పెత్తనమేమిటని ‘ముస్కురాహట్‌’ కథలో ప్రశ్నిస్తుంది
ఎన్ని చదువులు చదివినా, ఉద్యోగాలు చేసినా ఆమె జీవితం ఇంటికే పరిమితం కావాలా? తన జీవితాన్ని తాను చక్కదిద్దుకునే అవకాశాన్ని వారికి ఇవ్వకపోతే ఎలా అని ‘దివిటి’ కథలో నిలదీస్తారు. కుటుంబం బలం అనుకుంటారు. కానీ అది బలహీనతలా తయారవుతుంది. ఎక్కడికక్కడ స్త్రీ స్వతంత్రించకుండా మగాళ్లు అన్ని జాగ్రత్తలు తీసుకుంటుంటారు. ఆత్మ న్యూనత, అభద్రతా భావం నుండి తన మిత్రురాలిని ఎంత తెలివిగా సునీత బయటపడేసిందో చూడాలంటే ‘విహంగ’ కథ చదవాల్సిందే. పొలం ఎవరి పేరు మీద ఉంటే వాళ్లు చచ్చిపోతేనే నష్టపరిహారం వస్తుంది. ఆ ఊర్లో ఆడాళ్లెవరి పేరు మీద పొలాలు లేవు గనుక రైతులు కాదంటారు. దాంతో రగిలిపోయిన హనుమక్క ఎమ్మార్వో ఆఫీసులో పట్టా పాసుబుక్కు తన పేరు మీద మార్చమంటుంది. ఎందుకని ప్రశ్నించిన కొడుకుతో ”మేము సేద్యం పనులు చేస్తుండటం లేదా? చేన్లో పనిచేసే దానికి మేము కావాలి గాని పేరు ఎక్కడానికి, ఎక్కించడానికి పనికిరామా?” అని నిలదీస్తుంది. ‘నేను రైతునే’ అని నినదిస్తుంది.
కాలేజీ మానేసి అడవుల వెంట తిరిగి పూలు, పత్రి కోసుకొని వచ్చి వినాయక చవితి పండుగకు అమ్ముకొని బీద విద్యార్థుల గురించి తపనపడే ఒక అధ్యాపకురాలు ‘బెనకల చవితి’లో కనిపిస్తుంది. అలాగే డిగ్రీ చదివే అమ్మాయిలు సెలవులకు ఇంటికి పోలేదంటే ఏం అనర్థం జరిగిందో అని లెక్చరర్లు భయపడి పోతారు. తీరా చూస్తే, ఇంటికి పోతే చదువు మానిపిస్తారని ఒకరు, ఇష్టం లేని పెళ్లి చేస్తారని మరొకరు ఇంటికి వెళ్లలేదని చెబుతారు. ఈ విషయంలో అధ్యాపకుల నిస్సహాయత్వాన్ని మనల్ని ఆలోచింపజేస్తుంది. విద్యార్థినులు కాలేజీకి రాకపోవడం ఎందుకో సహదయతతో ఆలోచించాలి. చిన్న వయసులో ఒక్కొక్కరు ఎన్నెన్ని బరువులు మోస్తున్నారో ఎవరికి తెలుసు. వాళ్ళ సంపాదన కుటుంబాలకు అవసరం కనుక చదువును పక్కన పెట్టేస్తున్నారు. రూల్స్‌ పేరిట అధ్యాపకులు వారిని పరీక్షలు రాయకుండా అడ్డుకుంటున్నారు. ఇలా పిల్లలు జీవితాలను కోల్పోతుంటే, అధ్యాపకులు వాళ్ళ ఉద్యోగ భద్రత కోసం తిప్పలు పడుతుంటారని ‘తిరుపాలమ్మ’ కథ తెలియజేస్తుంది.
ప్రేమలు, ఆప్యాయతలు అన్నీ డబ్బు సంబంధాల ముందు దిగదుడుపే అని ‘మావి చిగురు’ కథ, వసుధైక కుటుంబం అనే భావన నుండి కరోనా రాకతో ఎవరికీ మారుగా మిగిలిపోయారని ‘ఉద్భవామి’ కథ లో తెలియజేస్తారు. పది కిలోమీటర్ల దూరంలో ఉన్న రైల్వే స్టేషన్లో, రైళ్ల టాయిలెట్లలోకి పంపించే నీళ్లు పట్టుకొచ్చుకోవడానికి ఎంత ప్రమాదకరమైన ప్రయాణం చేస్తుంటారో ‘నీళ్ల బండి’ కథలో చూడవచ్చు. మంత్రాలు, క్షుద్ర పూజల పేరుతో ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని ఎంత హింస, ఎంత దోపిడీ జరుగుతుందో ‘విలాపధామం’ కథలో కనబడుతుంది.
ఈ కథలన్నీ మహిళా కేంద్రంగా రూపొందడం విశేషం. ముఖ్యంగా రచయిత్రి తన విద్యార్థినుల పట్ల కనపరిచే ప్రేమాదరణలు, వాళ్లకు సహాయంగా నిలిచి వాళ్ళ జీవితాలను చక్కదిద్దాలనుకునే ప్రయత్నాలు మనల్ని ఆకట్టుకుంటాయి. ఎన్రోల్మెంట్‌, డ్రాప్‌ అవుట్ల విషయంలో ప్రైవేటు విద్యాలయాలతో పోటీ పడలేరు. అలాగని ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించలేరు. రూల్స్‌ పేరు చెప్పి వాళ్ళ జీవితాలతో ఆడుకోవడం ఎంతవరకు సబబు అని ప్రశ్నిస్తారు. ఇక గహిణిగా, ఉద్యోగిగా మహిళలు చేసే ద్విపాత్రాభినయం ఎంత విసుగ్గా, కష్టంగా ఉంటుందో చక్కగా తెలియజేశారు. మహిళా రైతుల గురించి కానీ, మైనార్టీ విద్యార్థినుల సమస్యలు కానీ, కొత్త రచయిత్రుల ట్రాపు గురించి రాసిన కథలు కొత్తగా, వైవిద్య భరితంగా ఉన్నాయి. ఈ కథలన్నీ రచయిత్రి అనుభవంలోంచి రూపుదిద్దుకున్నాయని అనుకోవడంలో ఆశ్చర్యమేమీ లేదు.
– కె.పి.అశోక్‌ కుమార్‌
9700000948

Spread the love