– నెల రోజులు గడిచినా పాత డిపాజిట్ ఇవ్వలేదు
– కొత్త వారికి గదులను అప్పజెప్పరు..!
నవతెలంగాణ-ఖానాపూర్‌టౌన్
మున్సిపాలిటీ షాపింగ్ కాంప్లెక్స్ వ్యవహారం ప్రహసనంగా మారుతుంది. పట్టణంలోని జీపు అడ్డా, విద్యానగర్, పాత బస్టాండ్ ప్రాంతంలో కలిపి 26 షట్టర్ రూమ్‌లు ఉన్నాయి. వీటికి ఆగస్టు నెలలో వేలం నిర్వహించారు. ఆసక్తి ఉన్న వ్యాపారులు 2024-25 సంవత్సరానికి గాను ఒక్కో షట్టర్ రూమ్ రూ.60వేల చొప్పున డిపాజిట్ చెల్లించి, వేలం ద్వారా దక్కించుకున్నారు. సదరు గదులను తాజాగా పొందిన పలువురికి అధికారులు ఇంతవరకు అప్పజెప్పలేదనే విమర్శలు వెల్లువెత్త్తుతున్నాయి. 2023-24 సంవత్సరానికి సంబంధించిన పాత వ్యాపారులు వాటిని ఖాళీ చేస్తేనే తాజాగా పొందిన వారికి అప్పజెప్పే అవకాశం ఉంటుంది. అయితే పాత వ్యాపారులు గతంలో డిపాజిట్‌గా పెట్టిన డబ్బులను పురపాలకసంఘం అధికారులు ఇంతవరకు వారికి ఇవ్వలేదని, వేలం ప్రక్రియ పూర్తయి నెల రోజులు గడిచిపోయిందని పలువురు పేర్కొన్నారు. పాత డిపాజిట్ డబ్బులను ఇవ్వని కారణంగా సదరు వ్యాపారులు ఖాళీ చేయడానికి నిరాకరిస్తున్నారు. తమకు రావాల్సిన డిపాజిట్ డబ్బులు ఇవ్వకుండా ఖాళీ చేయమంటే ఎలా చేస్తామని ప్రశ్నిస్తున్నారు.
అధికారుల తీరుపై విమర్శలు
మున్సిపల్ కాంప్లెక్స్ విషయంలో ఆధికారులు అనుసరిస్తున్న తీరు విమర్శలకు తావిస్తోంది. గత సంవత్సరం డిపాజిట్ చేసిన వ్యాపారులకు డబ్బులు ఇవ్వక పోవడం, తాజాగా పొందిన వారికి గదులను అప్పజెప్పని, కారణంగా ఇరువురు అద్దె చెల్లించలేని పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో మున్సిపాలిటీకి రావాల్సిన ఆదాయం కోల్పోయే అవకాశముంది. గత డిపాజిట్ చెల్లించడానికి ఇప్పుడు డబ్బులు లేవని, గదులను ఖాళీ చేసిన తర్వాత ఇస్తామని అధికారులు చెప్పడం ఆశ్చర్యం కలిగిస్తుంది. పాత డిపాజిట్ డబ్బులను సమయానికి ఇవ్వకుండా అధికారులు నిర్లక్ష్య సమాదానం చెప్పడాన్ని పలువురు తీవ్రంగా విమర్శిస్తున్నారు.
నా డిపాజిట్ డబ్బులు ఇస్తలేరు
గట్ల నర్సయ్య , టైలర్ షాపు, జీపు అడ్డా
నేను గత 25 సంవత్సరాల నుంచి ఈ కాంప్లెక్స్‌లో టైలరింగ్ చేసుకుంటూ ఉపాది పొందుతున్నాను. ప్రతీ ఏడాది క్రమం తప్పకుండా అద్దె చెల్లిస్తున్నాను. ఎప్పటి లాగే గతేడాది రూ. 50వేలు డీడీ రూపంలో డిపాజిట్ పెట్టి వేలం ద్వారా రూమ్ నెం.5 ను తీసుకున్నాను. ప్రతి నెల క్రమం తప్పకుండా అద్దె కూడా చెల్లించాను. ఈ సారి వేలం పాట ఎక్కువ కావడంతో వదిలేశాను. నాకు రావాల్సిన డిపాజిట్ డబ్బులు ఎన్నిసార్లు అడిగినా అధికారులు ఇవ్వడం లేదు. రూమ్ ఖాళీ చేసిన తర్వాత ఇస్తామని బెదిరిస్తున్నట్లుగా మాట్లాడుతున్నారు. నా డిపాజిట్ డబ్బులు ఇస్తేనే ఖాళీ చేస్తాను.
రెండు రోజుల్లో ఇచ్చేస్తాం
మనోహర్‌గౌడ్, కమిషనర్
గడిచిన సంవత్సరానికి డిపాజిట్‌గా పెట్టిన డబ్బులను రెండురోజుల్లో ఇచ్చేసి రూమ్‌లను ఖాళీ చేయిస్తాం. కొత్తగా వేలంలో పొందిన వ్యాపారులకు వాటిని అప్పజెప్తాం.